రారండోయ్ వేడుక చేద్దాం..

Jhari villagers celebrate their marriage functions unitedly

పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి.. దంపతులను ఆశీర్వదించి.. విందు ఆరగించి.. పదో పరకో సమర్పించుకోవడం సాధారణం. కానీ, నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరీ గ్రామ ప్రజలకు మాత్రం పెళ్లంటే పెద్ద పండుగ. ఊరంతా ఏకమై ప్రతీ ఏటా సామూహిక వివాహాలు చేస్తున్నారు. అయితే.. ఒక్క పెళ్లి చేయాలంటేనే ఎన్నో పనులుంటాయి. బంధువులంతా సాయం చేస్తే తప్ప పూర్తి కావు.

పేద కుటుంబంలో పెళ్లంటే నెల రోజుల ముందే పనులు మొదలుపెడతారు. మరీ పది పెళ్లిళ్లు ఒకేసారి చేయాలంటే ఎంత పని ఉంటుంది? అందుకే ఊరంతా కలిసి పనులు చేస్తారు. కొందరు వంట పని చేస్తే.. మరికొందరు పందిళ్లు వేస్తారు. ఇలా పనులన్నీ పంచుకుంటారు. అందుకే  ఏ సమస్య లేకుండా పనులన్నీ సమయానికి పూర్తవుతాయి.

ఇద్దరి మనసులను ఒకటి చేసేదే పెళ్ళి. రెండు కుటుంబాలను కలిపే వేడుక. జీవితంలో ఒకే సారి చేసుకునే పండుగ. అప్పటివరకు ఒంటరిగా సాగిన ప్రయాణాలను మూడుముళ్ల బంధంతో ఒక్కటి చేసే ఉత్సవం.. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న పండుగ కాబట్టే.. ఝరీ గ్రామస్తులు భూదేవంత వాకిట్లో ఆకాశమంత పందిళ్లు వేసి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఊరంతా ‘వేడుక చూసేందుకు కాదు.. చేసేందుకు రండి అంటున్నారు. ఆ ఊళ్లో పదకొండేళ్లుగా సామూహిక వివాహాలు చేస్తున్నారు. ఇదే ఆ ఊళ్లో జరిగే అతి పెద్ద పండుగ. పన్నెండో సామూహిక వివాహల వేడుక ఈ మధ్యే  వైభవంగా జరిగింది.

పెళ్లంటే భారం కాదని

ఝరీలో యేటా వేసవిలో సామూహిక వివాహాలు జరుపుతున్నారు. 12 సంవత్సరాలుగా ఇలా చేస్తుండడంతో అది కాస్తా ఆచారంగా  మారిపోయింది. తమ బిడ్డలకు పెళ్లి చేయాలనుకునే  తల్లిదండ్రులు ఆ విషయాన్ని ముందుగా గ్రామంలోని కమిటీకి చెప్తారు. తర్వాత కమిటీ సమక్షంలో తేదీ నిర్ణయిస్తారు. తల్లిదండ్రులు అంతా కలిసి వేడుక నిర్వహించేందుకు కావాల్సిన డబ్బును గ్రామ పెద్దలకు ఇస్తారు. . ఊరంతా కదిలొచ్చి కలిసి పెళ్లి పనులు చేస్తారు.

అంతా ఓ పద్ధతి ప్రకారం..

వేడుకకు వచ్చే బంధువులకు ఎలాంటి లోటు జరగకుండా చూసుకుంటారు గ్రామ ప్రజలంతా కలిసి. అన్ని అతిథి మర్యాదలు చేస్తారు. వేడుక ప్రాంగణంలో ఇబ్బంది కలగకుండా లేడిస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్, డైనింగ్ హాల్స్, ఫస్ట్ ఎయిడ్, కిచెన్ సెక్షన్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ఎక్కడా గొడవ జరగకుండా గ్రామ పెద్దలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఒకే రోజు సుమారు పది పెళ్లిళ్లు జరగడంతో ఊళ్లో ఇళ్లన్నీ పచ్చని పందిళ్లతో కళకళలాడుతాయి.

12 సంవత్సరాలుగా

ఝరీలో ఎక్కువగా పేద కుటుంబాలే ఉన్నాయి. పిల్లల పెళ్లిళ్లు చేయడం వాళ్లకు ఎంతో భారం. పెళ్లి వేడుక సంతోషంగా జరగాలి కానీ.. భరించలేని బాధగా ఉండకూడదు అనుకున్నారు. అందుకే ఊరంతా కలిసి పన్నేండేళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి అంతా కలసి సామూహిక వివాహాలు చేస్తున్నారు. ఈ పన్నెండేళ్లలో 124 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి.

-బాసర, వెలుగు

Latest Updates