ఆరని మంటల జరియా..!

అది 2017 జూన్‌‌. తండ్రీకొడుకులు బబ్లూ ఖాన్‌‌, రహీమ్‌‌ ఖాన్‌‌ ఇంట్లో ఉన్నారు. బయటికెళ్దామని రెడీ అయ్యారు. తలుపులు తెరిచారు. బయట అడుగుపెట్టారో లేదో పెద్ద గుంతలో పడిపోయారు. చనిపోయారు. భూమిలో మంట వల్ల ఏర్పడిందా గొయ్యి. జరియా లోని ఫుల్‌‌బరిబాగ్‌‌లో జరిగిందీ ఘటన.

జార్ఖండ్‌‌లోని జరియా కోల్‌‌ బెడ్‌‌ ప్రాంతంలో ఇదేం పెద్ద విషయం కాదు. 208 చదరపు కిలోమీటర్లున్న (కోల్‌‌కతా సిటీ అంత) ఆ ప్రాంతంలో 70 ఊళ్లున్నాయి. యాక్సిడెంట్లు, అకస్మాత్తు మరణాలు ఆ ఊళ్లల్లో సర్వ సాధారణం. అసలేం జరుగుతోంది ఆ ప్రాంతంలో? ఎందుకు ప్రజలు ఇంకా అక్కడే ఉంటున్నారు? ఇంత జరుగుతున్నా సర్కారు ఏం చేస్తోంది?

1916లో మంట మొదలు

దేశంలో నాణ్యమైన బొగ్గు దొరికే జరియా ప్రాంతం ఇండియన్‌‌ కోల్‌‌ ఇండస్ట్రీకి గుండె. ఇక్కడ నేల కింద భారీ బొగ్గు గనులున్నాయి. ఎలా మొదలైందో కానీ వందేళ్ల కిందట భూమి కింద రాజుకున్న అగ్గి ఇప్పటికీ మండుతూనే ఉంది. బొగ్గు గనుల వల్ల మంట ఆరకుండా ఎగసి పడుతూనే ఉంది. తొలిసారి 1916లో ఖాస్‌‌ జరియా గనిలో మంటలు గుర్తించారు. 1930లో ఆ గని కూలిపోయింది. తర్వాత 1934లో వచ్చిన ఇండో–నేపాల్ భూకంపం వల్ల ఆ మంట విస్తరించి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 700 అడుగుల లోతున్న ఓపెన్‌‌ కోల్‌‌ మైన్‌‌ ప్రాంతానికి చాలా దగ్గర్లోనే ఉంది లిలొరిపథరా ఊరు. గాలిలో ఎప్పుడూ దుమ్ము, కింది నుంచి మంట, వేడి.. భూమి లోపలి నుంచి వచ్చే పొగ.. వీటి మధ్యే ఆ ఊరి ప్రజలు ఊపిరిపీలుస్తున్నారు. వర్షమొస్తే బొగ్గు గనుల నుంచి పొగలు బయటకొచ్చి ఊరంతా కప్పేస్తుంటాయి. పైగా తాగే నీళ్లు బొగ్గు దెబ్బకు కలుషితం. అక్కడి 70 ఊళ్లలో దాదాపు ఇదే పరిస్థితి. ఎప్పుడు భూమి కుంగుతుందో తెలియదు. మంటలు ఎప్పుడు ఎక్కువైతాయో అర్థం కాదు. చాలా మందికి దగ్గు, తలనొప్పి, ఛాతినొప్పి కామన్‌‌. టీబీ, ఆస్తమా గురించి చెప్పక్కర్లేదు.

2004లోనే మాస్టర్‌‌ ప్లాన్‌‌

జరియాలోని  ఊళ్ల ప్రజలను ఖాళీ చేయించేందుకు 2004లో కేంద్రం జరియా మాస్టర్‌‌ప్లాన్‌‌ను తీసుకొచ్చింది.  2009లో ఆమోదించింది. 2021 నాటికి అందర్నీ తరలించాలని నిర్ణయించింది. డెడ్‌‌ లైన్‌‌కు ఇంకా 24 నెలలే టైం ఉన్నా పునరావాసం కల్పించాల్సిన ప్రజలు లక్షల్లో ఉన్నారు. 2017లో ఖాన్‌‌ తండ్రీ కొడుకులు మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం, బొగ్గు గనులను తవ్వుతున్న కోల్‌‌ ఇండియా సబ్సిడరీ సంస్థ భారత్‌‌ కొకింగ్‌‌ కోల్‌‌ లిమిటెడ్‌‌ సంస్థతో కలిసి ఫుల్‌‌బరిబాగ్‌‌ నుంచి 40 కుటుంబాలను మరో ప్రాంతానికి తరలించారు. వాళ్లు ప్రస్తుతం బెల్గారియాలోని జరియా విహార్‌‌ క్వార్టర్లలో ఉంటున్నారు. జరియా రీహాబిలిటేషన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ సంస్థ వీటిని కట్టించింది.

ఇక్కడే సస్తం.. కానీ అటు రాం

రెండేళ్లు కూడా అయిందో లేదో క్వార్టర్లలో ఉన్న వాళ్లలో చాలా మంది తిరిగి ఊరికొచ్చేశారు. ‘బెల్గరియాలో ఉండటం కన్నా ఇక్కడే చావడం మేలు’ అంటున్నారు వాళ్లు. 20 మంది ఉన్న ఫ్యామిలీకి ఒక్క రూం ఇస్తే ఎట్లా ఉండేదని ప్రశ్నిస్తున్నారు. ‘అక్కడ పని కూడా దొరుకుతలేదు. తిండి లేక చచ్చిపోయేట్టున్నాం’ అంటున్నారు. మరో వ్యక్తి.. ‘నాకు 65 ఏళ్లు. నాలుగో ఫ్లోర్‌‌లో గది ఇచ్చారు. ఆరోగ్య సమస్యలున్నాయి. అంత పైకి ఎక్కలేను. ఇకపైన సరైన వసతులు కల్పించకుండా ఎక్కడికీ పోను. ఫుల్‌‌బరిబాగ్‌‌లో చచ్చిపోయినా నాకేం బాధ లేదు’ అని చెబుతున్నారు.

లాభాలు కావాలె.. జనాలు కాదు: అశోక్‌‌

జరియా నామరూపాల్లేకుండా పోతున్నా బీసీసీఐ, జేఆర్‌‌డీఏ పట్టించుకోవడం లేదని  జరియా కోల్‌‌ఫీల్డ్‌‌ బచావో సమితి అధ్యక్షుడు అశోక్‌‌ అగర్వాల్‌‌ ఆరోపిస్తున్నారు. బీసీసీఐకి కావాల్సింది లాభమని, అక్కడి ప్రజలకు ఏమైనా వాళ్లకు అనవసరమని విమర్శిస్తున్నారు. ‘2004 నాటి జరియా మాస్టర్‌‌ ప్లాన్‌‌ ప్రకారం పక్కా ఇళ్లల్లో ఉంటున్న 29,444 మంది, తాత్కాలిక ఇళ్లల్లో ఉంటున్న 24,000 మందికి పునరావాసం కల్పించాలి. కానీ టైం గడుస్తున్నకొద్దీ జనం పెరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ 1,41 లక్షల కుటుంబాలున్నాయి. ఇప్పటివరకు తాత్కాలిక కుటుంబాల్లో ఉంటున్న 2,600 ఫ్యామిలీలనే తరలించారు. పక్కా ఇళ్లల్లో ఉంటున్న వారిని ఇంకా ముట్టుకోలేదు’ అని అగర్వాల్‌‌ చెప్పారు. ఈ విషయమై 1990లోనే కోర్టులో ఆయన పిల్‌‌ వేశారు. ఈ కేసులో జులై 16న అడ్వొకేట్‌‌ గౌరవ్‌‌ అగర్వాల్‌‌ను అమికస్‌‌ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates