42 ఏళ్లుగా కట్టిన కాలువ ఒక్కరోజుకే తెగింది

ఆ కాలువ తవ్వి కట్ట పోయడానికి 42 ఏళ్లు పట్టింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కాలువ పనులు ఏళ్లకేళ్లు సాగాయి. అప్పట్లో దాని అంచనా ఖర్చు 12 కోట్లు. కానీ, ఇప్పుడది ₹2,176 కోట్లకు పెరిగింది. అంత ఖర్చు పెట్టి, అన్నేళ్లు సాగదీసి..సాగదీసి పూర్తి చేసిన కాలువను ఓపెన్​ చేశారు. కానీ, ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగానైనా నిలవలేదు. కారణం, ఓపెన్​ చేసిన ఒక్క రోజుకే కాలువ కట్ట తెగిపోయింది. చుట్టూ ఉన్న ఊళ్లను కాలువ వరద ముంచెత్తింది. జార్ఖండ్​లోని హజారీబాగ్​ కోనార్​ కాలువ గురించే ఇదంతా. కోనార్​ నదికి అనుబంధంగా తవ్విన ఈ కాలువను బుధవారం జార్ఖండ్​ సీఎం రఘుబర్​దాస్​ ప్రారంభించారు. గేట్లు తెరిచి నీళ్లను వదిలారు. కానీ, ఒక్కరోజులోనే దాని కట్ట తెగిపోయి పక్క జిల్లా హజారిబాగ్​ సహా గిరిధ్​లోని 35 పల్లెలు, వేలాది ఎకరాల పంటను ముంచెత్తింది.

దానికి అధికారులు చెబుతున్న కారణమేంటో తెలుసా..? ఎలుకలు. అవును, ఆ కాలువ కట్ట తెగిన పాపం ఎలుకలదేనని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి 8.30 గంటలకు కాలువ కట్ట చిన్నచిన్నగా లీకవుతుండడాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ తర్వాత పది గంటల్లోనే ఆ చిన్న రంధ్రం పెద్దగా మారిపోయి గండిపడినట్టు చెబుతున్నారు. నీటి వనరుల విభాగానికి చెందిన అడ్వాన్స్​ ప్లానింగ్​ డివిజన్​ చీఫ్​ ఇంజనీర్​తో కమిటీ వేశామని నీటిపారుదల శాఖ చీఫ్​ సెక్రటరీ అరుణ్​ కుమార్​ సింగ్​ చెప్పారు. మట్టి కట్టల్లో ఎలుక బొరియల వల్ల నీళ్లు లీకయ్యాయని, అది కాస్తా పెద్ద గండిగా మారిందని వివరించారు.

కట్టింది 44 కిలోమీటర్లే

నిజానికి ఈ కాలువ ఇంకా మొత్తం తవ్వలేదు. 1955లో ఉమ్మడి బీహార్​ రాష్ట్రంలో కోనార్​ నదిపై దామోదర్​ వ్యాలీ కార్పొరేషన్​ రిజర్వాయర్​ కట్టింది. పొలాలకు నీళ్లిచ్చేందుకు 357 కిలోమీటర్ల మేర కాలువ, 17 కిలోమీటర్ల మేర సొరంగం కట్టాలని భావించారు. ఒక్క సొరంగం మాత్రం పూర్తయింది. కానీ, ఏళ్ల తరబడి కాలువ నిర్మాణాన్ని సాగదీశాయి అక్కడి ప్రభుత్వాలు. తాజాగా ఇప్పుడు కాలువను నిర్మించినా పూర్తి స్థాయిలో కాలేదు. కేవలం 44 కిలోమీటర్ల మేర మాత్రమే  పూర్తయింది. అయితే, పంటలకు నీళ్లివ్వాలన్న ఉద్దేశంలో ఆదరాబాదరాగా ప్రభుత్వం కాలువను ప్రారంభించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాలువ వల్ల హజారిబాగ్​, గిరిధ్​, బొకారో జిల్లాల్లోని 85 గ్రామాలకు నీళ్లందుతాయి. 44 కిలోమీటర్లు తవ్వి కట్ట పోయడానికే 42 ఏళ్లు పట్టిందంటే, మొత్తం 357 కిలోమీటర్లూ పూర్తి కావాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో!!

Latest Updates