జార్ఖండ్ ముస్లింల గుస్సా

జార్ఖండ్ రాష్ట్రంలోని మొత్తం 14 లోక్ సభ నియోజకవర్గాలకు గాను ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కూడా ముస్లింలను దూరం పెట్టింది. దీంతో రాష్ట్రంలోని ముస్లింలంతా కాంగ్రెస్ పై గుస్సా తో ఉన్నారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా ఉన్నా తమను పక్కన పెట్టారని కోపంతో రగిలిపోతున్నారు. ఈకోపంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

రాజకీయ పార్టీలపై జార్ఖండ్ ముస్లింలు కోపంతో రగిలిపోతున్నారు. అన్ని పార్టీలు తమను ఓటుబ్యాంకుగానే చూశాయని మండిపడ్డారు. జార్ఖండ్ లో మొత్తం 14 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఈనియోజక వర్గాల్లో బీజేపీ కూటమికి, స్థానిక పార్టీల కూటమికి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్కరంటే ఒక్కముస్లింకు కూడా టికెట్ ఇవ్వలేదు. బీజేపీ కూటమి తమకు టికెట్లు ఇస్తుందని ఎన్నడూ ఆశించలేదని ముస్లింలు అన్నారు.

అయితే బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ పేరుతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కూటమి కూడా టికెట్ ఇవ్వకపోవడం పై ముస్లింలు మండిపడ్డారు. సెక్యులర్ పేరు చెప్పుకుని ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చే రాజకీయ పార్టీలు తమను ఓటుబ్యాంకు గానే చూశాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్ జనాభాలో15 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అయినప్పటికీ ఒక్క ముస్లిం కు కూడా ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం దారుణం అన్నా రు సామాజిక కార్యకర్త నదీమ్ ఖాన్. “ మా బతుకులు పల్లకీలు మోయడానికేనా…లోక్ సభ ఎన్నికల్లో పోటీకి పనికిరామా…..” అని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో 17వ లోక్ సభలో జార్ఖండ్ ముస్లింల వాయిస్ వినిపించే అవకాశమే లేకుండా పోయిందని ఆయనఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు నియోజకవర్గా ల్లో ముస్లింలే కీలకం
రాష్ట్రంలోని అనేక నియోజక వర్గాల్లో ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా గొడ్డా, ఛాత్ర, లోహర్దగ, రాజ్ మహల్…ఈ నాలుగు నియోజకవర్గాల్లో కేండిడేట్ల గెలుపోటములను ప్రభావితం చేయగలసత్తా ముస్లింలకు ఉంది.

గొడ్డా సెగ్మెంట్ నుంచే ముస్లింల ప్రాతినిథ్యం
2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. 14 సెగ్మెంట్లలో ఒక్క గొడ్డా నియోజకవర్గం నుంచే ముస్లింలు గెలిచారు. 2004లో గొడ్డా సెగ్మెంట్ నుంచి ఫుర్ఖాన్అన్సారీ కాంగ్రెస్ టికెట్ పై గెలిచారు. జార్ఖండ్ రాష్ట్రం నుంచి లోక్ సభ కు ఎన్నికైన ఏకైక ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. 2009 లో కాంగ్రెస్ టికెట్ పై ఆయన మరోసారి పోటీ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబూ సోరేన్ పెద్ద కుమారుడు దుర్గా సోరేన్ చేతిలోఓడిపోయారు. 2014 లో కూడా అన్సారీకి ఓటమితప్పలేదు. బీజేపీ కేండిడేట్ నిశికాంత్ దూబే పైఆయన ఓడిపోయారు. ఈసారి గొడ్డా నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. పొత్తు లో భాగంగా ఇక్కడి నుంచి‘జార్ఖండ్ వికాస్ మోర్చా ’ (జేవీఎం) తరఫున స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

ముస్లింలను రాజ్యసభ కు పంపిస్తాం : కాంగ్రెస్
టికెట్ ఇవ్వకపోయినంత మాత్రాన ముస్లిం లను పట్టించుకోలేదనడం కరెక్ట్ కాదన్నారు జార్ఖండ్ పీసీసీ ప్రెసిడెంట్ అజోయ్ కుమార్. మతం, కులం ఆధారంగా కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదన్నారు. ముస్లింల నుంచి ఒకరిని భవిష్యత్తులో రాజ్యసభ కు పంపే ఆలోచన కాంగ్రెస్ కు ఉందన్నారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇవ్వలేకపోయామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గొడ్డా టికెట్ ముస్లింలకే ఇవ్వాలని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ డిసైడ్ అయిందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్.అయితే పొత్తు లో గొడ్డా నియోజకవర్గాన్ని జేవీఎంకు ఇవ్వడంతో ముస్లింలకు టికెట్ ఇవ్వడం సాధ్యంకాలేదని సహాయ్ వివరణ ఇచ్చారు. ఏమైనా కాంగ్రెస్ నాయకత్వం లోని కూటమిలో పార్టీలేవీ కనీసం ఒకటికెట్ కూడా ఇవ్వకపోవడంతో జార్ఖండ్ ముస్లింలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి లాభిస్తుందా ?
కాంగ్రెస్ కూటమిపై ముస్లిం లలో కలిగిన అసంతృప్తి చివరకు బీజేపీకి లాభం చేస్తుందని రాజకీయపండితులు చెప్పారు. ముస్లింల ఓట్లు ఇదివరకు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కే పడేవని చెప్పారు. అయితే కాంగ్రెస్ మీద కోపంతో ముస్లింలు తమకునచ్చిన కేండిడేట్ కు వేస్తారన్నారు. దీని వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయన్నది రాజకీయ విశ్లేష కుల అంచనా. ఈ పరిణామం చివరకు బీజేపీకే లాభం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Latest Updates