పూజ‌లు చేస్తే వెళ్లిపోతానంది: క‌రోనా మాత క‌ల‌లో క‌నిపించి చెప్పింది!

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. మందు లేని ఈ మ‌హ‌మ్మారి.. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా సోకుతూ.. ఇప్ప‌టికే ప్ర‌పంచం వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల మందిని బ‌లి తీసుకుంది. ఈ వైర‌స్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ త‌యారీ కోసం ప‌లు రీసెర్చ్ సంస్థ‌లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌ని శాస్త్రవేత్త‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ అప్ డేట్స్ గురించి నిరంతరం తెలుసుకోవాల‌ని ప్ర‌జ‌లంతా ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, ఈ ప్ర‌పంచానికి దూరంగా అంద‌రికీ అందుబాటులో ఉండే టెక్నాల‌జీ, స‌దుపాయాలు లేని ప్రాంతాల్లో మూఢ‌న‌మ్మ‌కాలు ఇంకా రాజ్య‌మేలుతున్నాయి. ప్ర‌జ‌ల ప్రాణాలును క‌బ‌లిస్తున్న వైర‌స్ క‌రోనా.. దానిని దైవంలా క‌రోనా మాత అంటూ పూజ‌లు చేస్తున్నారు జార్ఖండ్ లోని ఆదివాసీలు. ధ‌న్ బాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో మ‌హిళ‌లు, ట్రాన్స్ జెండ‌ర్లు క‌రోనా మాతను పూజిస్తున్నారు.

క‌ల‌లో ఆవు రూపంలో క‌నిపించి.. దేవ‌తలా మారి..

జార్ఖండ్ లోని ధ‌న్ బాద్ స‌మీపంలో ఉన్న ఝ‌రియా ప్రాంతంలో శుక్ర‌వారం నాడు ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌లు, ట్రాన్స్ జెండ‌ర్లు చేరి పూజ‌లు చేస్తున్నారు. క‌రోనా మాత పేరుతో భ‌జ‌న‌లు కూడా చేస్తున్నారు. అందులో ఒక‌రిని స్థానిక మీడియా ప్ర‌తినిధులు ఇలా ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించ‌గా… క‌రోనా మాత క‌ల‌లో క‌నిపించి.. పూజ‌లు చేస్తే ఎక్క‌డి నుంచి వ‌చ్చానో అక్క‌డికే వెళ్లిపోతాన‌ని చెప్పింద‌ని స‌మాధాన‌మిచ్చారు. “నాకు క‌ల‌లో ముందు ఒక ఆవు రూపం క‌నిపించింది. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా దేవ‌త‌‌లా మారి.. త‌న పేరు క‌రోనా మాత అని, భార‌త్ లోని ప్ర‌జ‌లు త‌న‌ను పూజిస్తే ఎక్క‌డి నుంచి వ‌చ్చానో అక్క‌డికి వెళ్లిపోతాన‌ని చెప్పింది. అందుకే క‌రోనా వెన‌క్కి వెళ్లిపోవాల‌ని మేమంతా ఇక్క‌డ పూజ‌లు చేస్తున్నాం” అని చెప్పింది నిర్మ‌లా కిన్నెర అనే ట్రాన్స్ జెండ‌ర్. ఇప్పుడున్న క‌ష్ట స‌మ‌యంలో ఈ వైర‌స్ ను అంతం చేయాలంటే క‌రోనా మాత‌కు పూజ‌లు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని బ‌న్సీ కిన్నెర అనే మ‌రో ట్రాన్స్ జెంర‌డ్ చెప్పింది.

ఆ పూజ‌ల‌కు సంబంధించిన‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో జార్ఖండ్ తోపాటు బీహార్, యూపీ, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో మ‌హిళ‌లు క‌రోనా మాత పూజ‌లు మొద‌లుపెట్టారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి తామంతా ఈ పూజ‌లు చేస్తున్నామ‌ని వారు చెబుతున్నారు. ఈ వీడియోల‌ను చూసి సోష‌ల్ మీడియాలో కొంద‌రు నెటిజ‌న్లు అంధ విశ్వాసాలు న‌శించాలంటూ ప‌లువురు ట్వీట్లు చేశారు. ఇది ఇలానే సాగితే ఆల‌యాలు క‌ట్టినా ఆశ్చ‌ర్యం లేదంటూ క్యాప్ష‌న్లు పెట్టారు.

Latest Updates