గంటలో ప్రియుడి పెళ్లి.. ఆపేసిన ప్రియురాలు

సికింద్రాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. అబ్బాయికి పెద్దలు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. దీంతో ప్రేయసికి మాట మాత్రం కూడా చెప్పకుండా పెద్దలు చూసిన అమ్మాయితో లగ్గానికి అబ్బాయి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ప్రియురాలు గంటలో పెళ్లి అనగా మండపానికి చేరుకొని పెళ్లిని ఆపేసింది. వివరాలు.. జనగామ జిల్లా, యశ్వంతాపూర్‌‌కు చెందిన అనిల్.. ఘట్‌‌కేసర్, చౌదరిగూడలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో అనిల్‌‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతడికి మరో యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.

సికింద్రాబాద్‌‌లోని ఓ చర్చిలో వివాహం జరుగుతుండగా.. అనిల్ ప్రేమించిన యువతి వెళ్లి గొడవ చేసి మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో తామేమీ చేయలేమని పోలీసులు చెప్పారు. దీంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే కొన్ని నిమిషాలకు పెళ్లి కూతురు మైనర్ అంటూ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో చైల్డ్ లైఫ్ ఆఫీసర్లు అక్కడికి వచ్చి పెళ్లి కూతురు పదో తరగతి మెమోను పరిశీలించారు. మేజర్ అయ్యేందుకు మరో మూడు నెలలు ఉండటంతో చైల్డ్ లైఫ్ ఆఫీసర్లు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుతోపాటు వారి పేరెంట్స్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest Updates