
అడ్డ పంచె… భుజాన కండువా..
ఇదీ ప్రధాని లేటెస్ట్ డ్రెస్…
మహాబలిపురంలో చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌కు స్వాగతం పలకడానికి తమిళకట్టూ బొట్టూతో వచ్చారు ప్రధాని. జిన్‌పింగ్ అయితే ఫుల్ షర్ట్ టక్ చేసుకుని ఆఫీసుకి వచ్చినట్టు వచ్చారు. ఈ ఇద్దరు నాయకులూ.. మహాబలిపురంలో టూరిస్టుల్లాగానే తిరిగారు. జిన్‌పింగ్‌కు శిల్పాలు చూపిస్తూ గైడ్‌లా ఎన్నో సంగతులు చెప్పారు మోడీ. అక్కడాక్కడ వేరే ఎవరూ లేకుండా ఇద్దరే మాట్లాడుకుంటూ తిరిగారు. చెట్ల నీడలో కొబ్బరినీళ్లు తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు.
ఇద్దరు నేతలు ఇలా వచ్చారు…
ఎయిర్ చైనా బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌లో చైనా ప్రెసిడెంట్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చెన్నై వచ్చారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ స్వాగతం చెప్పారు. ప్రధాని మోడీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో మహాబలిపురం చేరుకున్నారు. నాఛియార్కోయిల్ బ్రాంచ్ అన్నమ్ ల్యాంప్, తంజావూర్ పెయింటింగ్- నృత్యంచేసే సరస్వతిని చైనా ప్రెసిడెంట్‌కు మోడీ ప్రెజెంట్ చేశారు. షోర్ టెంపుల్ దగ్గర జిన్‌పింగ్‌ను విదేశాంగమంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైజర్ అజిత్ దోవల్ కలిశారు.
మహాబలిపురం చేరుకున్న మోడీ.. అర్జునుడు తపస్సు చేసిన చోటుని చెప్పుకునే దగ్గర జిన్‌పింగ్ కు వెల్కమ్ చెప్పారు. మహాబలిపురంలోని వెయ్యేళ్లనాటి కట్టడాలు, శిల్పాలను దగ్గరుండి చూపించారు. పాశుపతాస్త్రంకోసం అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతమని చెప్పుకునే చోటును, పంచ రథాలు, షోర్ టెంపుల్లను తిప్పి చూపించారు. సహాయకులు లేకుండా కేవలం ఇద్దరూ కట్టడాలను చూస్తూ ముందుకుసాగారు. పంచ రథాల ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత లీడర్లు ఇద్దరూ బ్రేక్ తీసుకున్నారు. కొబ్బరినీళ్లు తాగుతూ అక్కడే సేదతీరారు. కుర్చీలలో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అక్కడకి దగ్గర్లో ఉన్న కృష్ణుడు వెన్నముద్దను పోలిన పెద్ద రాయిని చూశారు. షోర్ టెంపుల్ దగ్గర సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇద్దరు నేతలు చూశారు. కళాక్షేత్రకు చెందిన కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రొగ్రామ్స్ చూసిన మోడీ సుతారంగా లయవేస్తూ కనిపించారు. గెస్ట్కోసం ప్రధాని డిన్నర్ ఏర్పాటుచేశారు. పూర్తిగా సంప్రదాయ వంటకాలను వడ్డించారు.
చెన్నైలో రెడ్ కార్పెట్ వెల్కమ్
అంతకుముందు, చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండైన జిన్ పింగ్‌ను తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, స్పీకర్ ధనపాల్ రిసీవ్ చేసుకున్నారు. జిన్‌పింగ్ గౌరవార్థం సుమారు 500 మంది తమిళ కళాకారులు సంప్రదాయ దుస్తులతో తప్పట్టమ్, భరతనాట్యం ప్రదర్శించారు. స్కూలు చిన్నారులు చైనా, ఇండియా జెండాలతో స్వాగతించారు. అక్కడి నుంచి గిండిలోని ఐటీసీ గ్రాండ్ ఛోలా హోటల్‌కు జిన్ పింగ్ చేరుకున్నారు. హోటల్లో కాసేపు విశ్రమించాక.. జిన్ పింగ్ సాయంత్రం 5 గంటలకు మహాబలిపురం చేరున్నారు.
తాజ్ రిసార్ట్‌లో మీటింగ్
శనివారం ఉదయం తాజ్ ఫిషర్మాన్స్ కోవ్ రిసార్ట్‌లో మోడీ, జిన్‌పింగ్ భేటీ కానున్నారు. సుమారు ఆరుగంటల పాటు జరగనున్న ఈ భేటీలో దౌత్య సంబంధాలతో పాటు పలు కీలక ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని సమాచారం. టెర్రరిజం, టెర్రర్ కార్యకలాపాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. వ్యాపార సంబంధాలు, రక్షణ, సరిహద్దు అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వస్తాయని అన్నారు.
మహాబలిపురమే ఎందుకు?
చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఇండియాకు వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని కాదని.. చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురానికి వెళ్లారు. జిన్పింగ్అక్కడ పర్యటించడానికి కారణమేంటి? ప్రధాని నరేంద్ర మోడీ, జిన్‌పింగ్ మహాబలిపురంలోనే ఎందుకు సమావేశమవుతున్నారు?
చైనాతో పల్లవుల ట్రేడ్
పల్లవుల కాలంలో సౌత్ ఇండియాలోని మేజర్ పోర్టుల్లో మహాబలిపురం ఒకటిగా ఉండేది. చైనాతో ట్రేడ్ విషయంలో ప్రధాన కనెక్టింగ్ పాయింట్ అదే. ఇందుకు సంబంధించి మహాబలిపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో చారిత్రక ఆధారాలు కూడా దొరికాయి
ఢిల్లీకి దూరంగా ఉండేలా..
ప్రపంచ దేశాలతో చైనాకు ఉన్న ప్రాచీన సంబంధాలతోపాటు చరిత్ర, సంస్కృతి అంటే జిన్‌పింగ్‌కు ఎంతో ఇష్టం. మరోవైపు ఇన్ఫార్మల్ మీటింగ్‌కు వేదికను ఢిల్లీకి దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులను మోడీ ఆదేశించారు. అలా మహాబలిపురం కరెక్టుగా సరిపోతుందని ఎంపిక చేశారు.
బోధిధర్ముడు పుట్టిన గడ్డ
చైనాలో లక్షలాది మందితో బోధిధర్మగా పూజలందుకుంటున్న బౌద్ధ గురువు.. ఒకప్పటి తమిళ యువరాజు. పల్లవ రాజైన బోధిధర్మ అసలు పేరు ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. ఆయన బౌద్ధమతాన్ని తీసుకున్నాడు. ఆయుధాలు లేకుండానే యుద్ధం చేయడంలో మాస్టర్. బుద్ధిజం మెసెంజర్‌గా చైనాలో పర్యటించాడు. అక్కడి ప్రజలకు ధ్యానం, మార్షల్ ఆర్ట్స్ నేర్పించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో బోధిధర్ముడికి కనెన్షన్ ఉందన్న కారణంతో మహాబలిపురాన్ని వేదికగా ఎంచుకుని ఉండొచ్చని చెబుతున్నారు.
రాజకీయంగా బలపడేందుకు..
దివంగత మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ మోడీ, జిన్పింగ్సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో బీజేపీ కలిసి పని చేస్తున్నా.. సొంతంగా ఎదగాలని చూస్తోందని చెబుతున్నారు. ఎప్పుడూ కుర్తా పైజామాలో కనిపించే నరేంద్ర మోడీ.. జిన్‌పింగ్‌తో సమావేశంలో మాత్రం అడ్డ పంచెతో కనిపించారు.
మూడు భాషల్లో మోడీ ట్వీట్
“అద్భుతమైన సంస్కృతి, ఆతిథ్యం ఇచ్చే గొప్ప భూమి తమిళనాడుకు చేరుకున్నాను. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌కు తమిళనాడు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ అనధికార సమావేశం ఇండియా, చైనా మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను” అని మోడీ ఇంగ్లిష్, తమిళం, మాండరిన్ భాషల్లో ట్వీట్ చేశారు.