ఈ రీచార్జ్ చేసుకుంటేనే జియోతో ఇతర నెట్ వర్క్ కు కాల్స్

  • కాల్స్ పై జియో అదనపు చార్జ్: కొత్త ఐయూసీ ప్లాన్స్ ఇవే

లాంచింగ్ నాడు భారతీయులకు మాట్లాడుకునే ఫ్రీడం ఇస్తున్నామని గర్వంగా ప్రకటించిన జియో.. ఇప్పుడు ఆ భారం మోయలేమని చేతులెత్తేసింది. ఇప్పటికే రూ.13 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామని ఇక ఇవ్వలేమని చెప్పింది. చానాళ్ల నుంచే అమలులో ఉన్న ట్రాయ్ నిబంధన ఐయూసీ పేరు చెప్పి కస్టమర్లపై బాదుడు స్టార్ట్ చేసింది.

రిలయన్స్ జియో కస్టమర్లపై బాంబ్ పేల్చింది. ఇప్పటి వరకు ఉన్న ఫ్రీ కాలింగ్ కు ముగింపు పలికింది. జియో నుంచి ఎయిర్ టెల్, ఐడియా లాంటి ఇతర నెట్ వర్క్ కస్టమర్లకు ఫోన్ చేయాలంటే అదనపు రీచార్జ్ చేసుకోక తప్పదు. ఔట్ గోయింగ్ కాల్స్ పై ఇక నిమిషానికి ఆరు పైసల చొప్పున చెల్లించాలి. ఇందుకోసం రెగ్యులర్ గా చేసుకునే రీచార్జ్ తో పాటు ప్రత్యేకంగా ఐయూసీ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. దాని ద్వారా వచ్చే మెయిన్ బ్యాలెన్స్ నుంచి ఈ ఆరు పైసల చార్జ్ ని వసూలు చేస్తుంది జియో. ఇందు కోసం నాలుగు ఐయూసీ ప్లాన్స్ ను జియో ప్రకటించింది.

కొత్త ఐయూసీ ప్లాన్స్ ఇవే

  1. రూ.10 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే ఇతర నెట్ వర్క్ కస్టమర్లకు 124 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. దీనికి 1 జీబీ డేటా ఉచితంగా ఇస్తోంది జియో.
  2. రూ.20 ప్లాన్ తీసుకుంటే 249 నిమిషాల వరకు కాల్స్, 2 జీబీ డేటా వస్తుంది.
  3. రూ.50 ప్లాన్ వేసుకుంటే 656 నిమిషాలు, 5 జీబీ డేటా వాడుకోవచ్చు.
  4. రూ.100 ప్లాన్ – దీనికి 1362 నిమిషాల కాల్స్, 10 జీబీ డేటా వస్తుంది.

ఇప్పటికే నెలావారీగా, మూడు నెలలకోసారి చేసుకుంటున్న రూ.199/399 వంటి రీచార్జ్ లతో పాటు ఈ ఐయూసీ ప్లాన్ కూడా తీసుకుంటేనే ఇతర నెట్ వర్క్ వాడుతున్న వారితో మాట్లాడడం కుదురుతుంది. లేదంటే కేవలం జియో కస్టమర్లతోనే మాట్లాడగలుగుతారు. అలాగే మొబైల్ డేటా ఉంటే వాట్సాప్, మెసెంజర్లలో ఫ్రీగా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. అలాగే ల్యాండ్ లైన్ ఉన్న వారితో కూడా ఉచితంగా మాట్లాడొచ్చు.

Latest Updates