కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం

బారాముల్లా: కశ్మీర్లో ఉగ్రవేట సాగుతోంది. పుల్వామా దాడి తర్వాత ఏ ఒక్క ఉగ్రవాదినీ వదలకూడదన్న లక్ష్యంతో ఏరివేత సాగిస్తున్నారు ఆర్మీ సైనికులు. ఇందులో భాగంగా శుక్రవారం చేపట్టినఆపరేషన్ లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జమ్ము కశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలోని వార్ పొరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వార్ పొరాలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు ఈ ఉదయం ఆర్మీకి సమాచారం అందింది. వారిని తుదముట్టించేందుకు జవాన్లు రంగంలోకి దిగారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ షురూ చేశారు. ఆ ప్రాంతానికి చేరుకోగానే బలగాలపై ముష్కరులు కాల్పులకు జరిపారు. ఆర్మీ జవాన్లు దీటుగా పోరాటానికి దిగారు.
దాదాపు 10 గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరాటంలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను హతమార్చారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయాన్నే మొదలైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
అయితే ఎన్ కౌంటర్ జరుగుతుండడంతో అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న జవాన్లలో ఎవరికీ గాయాలు కాలేదని డీఐజీ అతుల్ కుమార్ గోయల్ తెలిపారు. హతమైన ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందన్నారు.ఆపరేషన్ పూర్తయ్యే వరకు స్థానిక ప్రజలెవరూ బయటకు రావద్దని కోరామని చెప్పారాయన.

Latest Updates