మండల పరిషత్‌లకు 1,212.. పోలీస్‌ శాఖకు 1,396 పోస్టులు

కేబినెట్‌ భేటీలో 49 అంశాలకు ఆమోదం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మండల పరిషత్‌లకు 1,212 పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ భేటీ రాత్రి 8:30 వరకు కొనసాగింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 20 పోలీస్‌ స్టేషన్ల స్థాయిని పెంచాలని, వాటికి కొత్తగా 1,396 పోస్టులు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా సెషన్స్‌ కోర్టుల్లో కొత్త పోస్టులను క్రియేట్‌ చేయాలని(ర్యాటిఫికేషన్‌), స్టేట్ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2019 నుంచి వర్తించేలా 3.44 శాతం డీఏ ఇవ్వనుంది. రంగారెడ్డి జిల్లాలో నందిగాం పంచాయితీ నుంచి అంతిరెడ్డిగూడను విడదీసి కొత్త గ్రామ పంచాయితీ ఏర్పాటు చేయనున్నారు. ఐదు పోలీస్‌ కమిషనరేట్లు, జిల్లాల్లో 26 ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న పది మందికి స్పెషల్‌ రెమిషన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

అత్తాపూర్, శంషాబాద్​ అర్బన్​స్టేషన్లు..

సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి కొంత ప్రాంతాన్ని విడగొట్టి అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. శంషాబాద్‌ రూరల్‌ ఠాణాను విభజించి శంషాబాద్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఆర్‌ అండ్‌ బీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను విలీనం చేస్తారు. లాంగ్వేజీ పండింట్లు, పీఈటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఐదుగురు డీఎస్పీలు, ఇద్దరు అడిషనల్‌ కమాండెంట్‌ పోస్టులను సూపర్‌ న్యూమరీగా క్రియేట్‌ చేయడానికి అనుమతిచ్చారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కొత్త పోస్టుల క్రియేషన్‌, ఐ అండ్‌ పీఆర్‌లో కొత్తగా 36 పోస్టుల క్రియేషన్‌కు అనుమతినిచ్చారు. వీటితో పాటు మరో 34 అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Latest Updates