పట్టణాల్లో జాబ్స్‌‌ పెరుగుతున్నయ్‌‌!

మార్చి క్వార్టర్‌‌లో పెరిగిన ఉద్యోగాలు గవర్నమెంట్‌‌ రిపోర్ట్‌‌ వెల్లడి

న్యూఢిల్లీ: పట్టణవాసులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌ పట్టణాల్లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పడిపోయింది. గత నాలుగు క్వార్టర్లలో ఇదే అతి తక్కువ అని ఇంగ్లిష్‌‌ వార్తాసంస్థలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడాన్ని ఆపలేకపోతున్నారని, ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని విపక్షాలు తరచూ ప్రధాని మోడీని విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ లెక్కలు ఆయన ప్రభుత్వానికి ఊరటనిస్తాయని చెప్పవచ్చు. గత ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌లో నిరుద్యోగం రేటు 9.9 శాతం రికార్డయింది. గత ఏడాది ఏప్రిల్‌‌–జూన్‌‌ డేటా మాత్రం అందుబాటులోకి రాలేదు. మార్చి క్వార్టర్‌‌ రిపోర్టును కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ త్వరలో బయటపెట్టనుంది. అయితే ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన గురించి సమాచారం ఇవ్వలేదు.

‘‘కరెంట్ వీక్లీ స్టేటస్‌‌’’ విధానంలో మార్చి క్వార్టర్‌‌ రిపోర్ట్‌‌ను తయారు చేశారు. సర్వేకాలంలో ఒక వారంలో సగటు నిరుద్యోగాన్ని ఈ విధానంలో లెక్కిస్తారు. ఆ వారంలో ఒక వ్యక్తి ఖాళీగా ఉన్నా, అతణ్ని నిరుద్యోగిగా గుర్తిస్తారు. ఈ క్వార్టర్‌‌లో 15–29 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం 22.5 శాతం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 23.7 శాతం ఉంది. ఉపాధి కల్పన లెక్కలను ఎప్పటికప్పుడు విడుదల చేయకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2017 జూలై నుంచి గత ఏడాది జూన్‌‌ వరకు విడుదల చేసిన రిపోర్టులో దేశవ్యాప్తంగా నిరుద్యోగం రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరినట్టు వెల్లడయింది. ఈ రిపోర్టును మోడీ ప్రభుత్వం ఈ ఏడాది మేలో బయటపెట్టింది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates