బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఎప్పుడు కరోనా సోకుతుందోనని భయం
ఇప్పటికే పలువురికిపాజిటివ్‌.. ఒకరి మృతి
ట్రీట్‌మెంట్‌ కూడా సరిగ్గా అందుతలేదని ఆవేదన
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగానే జర్నలిస్టులు

కరోనా వార్‌లో ఫ్రంట్‌ లైన్‌లో ఉన్న జర్నలిస్టులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనూ క్షణం విశ్రాంతి లేకుండా పని చేసిన జర్నలిస్టులు ఇప్పుడు కనీసం ట్రీట్‌మెంట్‌ దొరక్క భయపడుతున్నారు. హైదరాబాదుకు చెందిన ఓ యువ జర్నలిస్టు నాలుగు రోజుల క్రితం
కరోనాతో చనిపోయారు. మరికొందరికి పాజిటివ్‌ వచ్చింది. తమకు సరైన ట్రీట్మెంట్ అందడంలేదని వాళ్లు అంటున్నారు. అనుమానం
ఉన్న మిగతా వాళ్లు టెస్టులు చేయించుకునే పరిస్థితిలేక టెన్షన్ పడుతున్నారు.

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వివిధ స్థాయిల్లో పని చేసే సిబ్బంది లక్ష మందిపైనే ఉంటారు. వార్తా సేకరణలో రిపోర్టర్లు, కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు నిత్యంజనంలో తిరుగుతూ ఉంటారు. వీళ్లతో డెస్క్ లోని సబ్ ఎడిటర్లు, వీడియో ఎడిటర్లు, ఆర్టిస్టులు టచ్ లో ఉంటారు. ఎడిటర్‌ మొదలు ప్రిటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ స్టాఫ్, పేపర్‌ బాయ్‌ వరకు రోజూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉండి వార్తలను జనానికి చేరవేస్తారు. లాక్‌డౌన్‌తో మీడియా రంగం సంక్షోభంలో పడి చాలా మంది జర్నలిస్టుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. జీతాల కోతతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇన్ని ఉన్నా విధి నిర్వహణకు కట్టుబడి రేయింబవళ్లుపని చేస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు
చూస్తోందని జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు.

ట్రీట్మెంట్.. గాల్లో దీపం!
లాక్‌డౌన్‌ టైమ్‌లో కరోనా వారియర్స్‌ కేటగిరిలో ఉన్న డాక్టర్లు, పారామెడికల్‌ స్టాఫ్, పోలీస్‌, శానిటేషన్ వర్కర్స్ను కలిసి.. వారి సేవల్ని ప్రపంచానికి చాటి చెప్పారు జర్నలిస్టులు. కంటెయిన్మెంట్ జోన్లలోని సమస్యల్ని వివరించి ఆఫీసర్లను అలర్ట్ చేశారు. తమకు, తమ ఫ్యామిలీలకు రిస్క్‌ అని తెలిసినా సామాజిక బాధ్యతగా వార్తల్ని సేకరించారు. ఇలా జనం మధ్య తిరుగుతూ న్యూస్ కవరేజీ ఇచ్చిన జర్నలిస్టుల్లో కొందరికి వైరస్‌ అటాక్‌ అయింది. మనోజ్‌ అనే యువ జర్నలిస్టు కరోనాతో మృత్యువాతపడ్డారు. హాస్పిటల్‌లో మనోజ్‌కి సరైన ట్రీట్ మెంట్ అందలేదని, ఐసీయూలో బెడ్‌ కేటాయించేందుకు బాగా ఆలస్యం చేశారని స్వయంగా ఆయన కుటుంబీకులే ఆరోపించారు. హాస్పిటల్లో తనకు సరైన ట్రీట్‌మెంట్‌ అందడం లేదని ఫ్రెండ్స్‌తో మనోజ్ చేసిన చాటింగ్ బయటకు వచ్చింది. బుధవారం మరో ముగ్గురు జర్నలిస్టులు కరోనాతో గాంధీ హాస్పిటల్లో చేరారు. రాత్రి హాస్పిటల్లో చేరిన తమను పట్టించుకోలేదని, కనీసం మంచి నీళ్లు, ఒక టాబ్లెట్ ఇచ్చే దిక్కులేదని తన గోడును ఓ జర్నలిస్టు తన మిత్రులతో వెళ్లబోసుకున్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఆదుకొమ్మంటే.. నో రెస్పాన్స్!
తెలంగాణ ఉద్యమంలో జనం ఆకాంక్షను ఇక్కడి జర్నలిస్టులు వార్తలుగా మలిచి ప్రపంచానికి చాటిచెప్పారు. ఉద్యమ సమయంలో జనంతో కలిసి
వారు ముందుకు నడిచారు. జనాన్ని ముందుకు నడిపించారు. కుట్రలను, కుతంత్రాలను బట్టబయలు చేశారు. సొంత రాష్ట్రం ఏర్పడితే అన్ని విధాలా అండగా ఉంటామని నాడు లీడర్లు జర్నలిస్టులకు హామీలిచ్చారు. ఇండ్లు ఇస్తామని, ఇన్సూరెన్స్‌ చేస్తామని, ఫ్రీ ట్రీట్‌మెంట్‌ అని ఎన్నో చెప్పిన రాష్ట్రప్రభుత్వం.. వాటి గురించి ఆలోచించడం లేదు. కొవిడ్‌ వారియర్స్‌కి రూ. 50 లక్షల ఇన్సూరెన్స్‌ ఉంది. ఇంచుమించు అలాంటి సేవలో ఉన్న జర్నలిస్టులకు మాత్రం ఆ సౌకర్యం కూడా లేదు. కొన్ని రాష్ట్రాలు కొవిడ్‌ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు
రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం అలాంటిదేమీ లేదు. మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ జర్నలిస్టులందరికీ రూ. పది వేల చొప్పున కరోనా సహాయం అందించాలని రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసి మూడు వారాలైనా స్పందన లేదు. లాయర్ల తరహాలో జర్నలిస్టులకు కూడా రూ. 25 కోట్ల సాయం ప్రకటించాలని కోరినా రెస్పాన్స్‌ లేదు.

రాత్రనకా పగలనకా..!
దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. జనం ఇళ్లకే పరిమితం కావాలని కేంద్రం ఆదేశించింది. కొన్ని అత్యవసర
సేవలకు మాత్రమే సర్కార్‌ అనుమతినిచ్చింది. అందులో మీడియా కూడా ఒకటి. ఎమర్జెన్సీ సేవల్లో భాగంగా ప్రభుత్వ విభాగాల వాళ్లు వాళ్ల
పనుల్లో నిమగ్నమైతే జర్నలిస్టులు వార్తా సేకరణలో పడ్డారు. జనాలకు కొవిడ్‌ తీవ్రత ఎలా ఉందో చెబుతూ అవేర్‌నెస్‌ కలిపించే ప్రయత్నం చేశారు.
రాత్రనకా పగలనకా పని చేశారు. ప్రగతి భవన్‌ ముందు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు. సీఎం ప్రెస్మీట్ల కోసం గంటల తరబడి రోడ్లపై
కాపుగాశారు. మంత్రుల పీసీల కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. లాక్‌డౌన్‌ ఆంక్షల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. రిస్కయినా కంటెయిన్మెంట్
జోన్లకు వెళ్లారు. జనాలకు అందుతున్న సౌకర్యాలు, అసౌకర్యాల గురించి వార్తలు రాశారు. వలస కార్మికుల వెంట నడిచారు. వాళ్ల
బాధలను కండ్లకు కట్టారు. సర్కారు దిగి వచ్చి సాయం చేసేలా చేశారు. అన్‌లాక్‌ మొదలయ్యాక సాధారణ జీవనం షురూ అయితే
దాన్ని చూపించారు. మాస్కులు కట్టుకోకపోతే హెచ్చరించారు. ఫిజికల్ డిస్టెన్సింగ్‌ లేదని మందలించారు. కేసులు పెరుగుతుంటే జాగ్రత్తలు
చెప్పారు. కరోనాపై పోరాటంలో మీడియా సంస్థలు, జర్నలిస్టుల పాత్రను మరువలేం అని ఇటీవలే హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది.

టెస్టులడిగితే ఇదీ పరిస్థితి..!
కరోనాటెస్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ‘మీడియాలో కొందరుఫ్రెండ్స్కు పాజిటివ్ అనితేలింది.న్యూస్ కవరేజీలోఅందరం కలిసి తిరిగినం. అనుమానంగా ఉంది.. మాకందరికీ టెస్టులు చేయండి..’అని కొందరు జర్నలిస్టులు హెల్త్‌ మినిస్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ‘చూసేటందుకు మంచిగనే ఉన్నరు కదా. టెస్టులు ఎందుకు..?’అని మంత్రి బదులివ్వటంతో అక్కడి వాళ్లంతా విస్మయానికి గురయ్యారు. మళ్లీ మళ్లీ ఒత్తిడి చేయటంతో టెస్టులు చేసేందుకు ఒప్పుకున్నారు.

20 మంది జర్నలిస్టులకు కరోనా!
గత కొన్నిరోజుల నుంచి క్రమంగా రాష్ట్రంలో వైరస్ ఉద్దృతి పెరిగింది. జర్నలిస్టులు అతీతులేమీ కాకపోవటంతో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు. రెడ్ జోన్, గ్రీన్ జోన్, కంటెయిన్మెంట్ జోన్లు, ఆసుపత్రులన్నింటా కవరేజీలో భాగంగా కలిసి తిరగటంతో రిస్క్లో పడ్డారు. ఇప్పటి వరకు దాదాపు 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఇందులో కొందరు గాంధీ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్
పొందుతుండగా మిగిలిన వాళ్లు హోంక్వారెంటైన్‌ అయ్యారు. రాష్ట్రంలో నేషనల్‌ మీడియాకు చెందిన వారు ముందుగా కరోనా బారిన పడ్డారు. తర్వాత స్థానిక మీడియా ప్రతినిధులు వైరస్‌తో ఎఫెక్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో ఒక టీవీ చానల్‌ క్రైమ్‌ రిపోర్టర్‌ మనోజ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ హాస్పిటల్లో చేరి, చనిపోయారు. కరోనా కాలంలో తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని జర్నలిస్టులు కోరుతున్నారు. కరోనా టెస్టులు చేయించాలని, హాస్పిటల్లో చేరితే సరైన ట్రీట్మెంట్ అందించాలని అంటున్నారు.

For More News..

చర్చలు సక్సెస్ అని సర్కార్ ప్రకటించిన కాసేపటికే జూడాల సమ్మెబాట

Latest Updates