కేసీఆర్ వాస్తు ఫలితం 2023లో తెలుస్తుంది : జేపీ నడ్డా

jp-nadda-comments-in-bjp-public-meeting-in-nampally
  • నిజాం రజాకార్లపై పోరాడిన తెలంగాణకు వందనం
  • కాళేశ్వరం పేరుతో గలీజ్ పనులు
  • ఆయుష్మాన్ భారత్ వద్దన్నారు.. మరి ఆరోగ్యశ్రీ సంగతేంటి..?
  • నాంపల్లి బీజేపీ సభలో జేపీ నడ్డా కామెంట్స్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తల్చుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదని అన్నారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. ఈ సాయంత్రం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ మహా సమ్మేళనం సభలో నడ్డా ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన నడ్డా.. “నేను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక… మొదటిసారి దక్షిణ భారతానికి ముఖద్వారమైన తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం మన పార్టీకి ఎల్లప్పుడు ఉంటుంది అని నాకు విశ్వాసం ఉంది” అని చెప్పారు.

“ఆదివాసీ దేవతలు సమ్మక్క సారక్క, బాసర సరస్వతి దేవి, యాదగిరి నర్సింహస్వామి కొలువైన, బమ్మెర పోతన జన్మించిన, దేశంకోసం బలిదానం చేసిన కొమరం భీమ్ పుట్టిన, కృష్ణా-గోదావరి నదులు ప్రవహిస్తున్న తెలంగాణకు రావడం ఆనందంగా ఉంది. నిజాం రజాకార్లపాలనపై తిరుగుబాటు చేసిన నేలకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉంది” అన్నారు.

జమ్ముకశ్మీర్ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి… ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు జేపీ నడ్డా. మోడీ, షా తల్చుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నింటిలో బీజేపీ భిన్నమైనదన్నారు. సాధారణ కార్యకర్తలు కూడా పార్టీ అధ్యక్షులుగా,  ప్రధానులుగా అయ్యే అవకాశమున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. డిసెంబర్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందన్నారు. ముస్లిం మహిళల సమస్యలను అర్ధం చేసుకుని.. ట్రిపుల్ తలాక్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. మోడీ హయాంలో భారత ఎకానమీ రూ.5 ట్రిలియన్ డాలర్లు పెరిగిందన్నారు. 2020 వరకు ప్రతి ఒక్కరికీ తాగడానికి మంచి నీరు అందివ్వాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

ఆయుష్మాన్ భారత్

ప్రపంచంలోనే ఉత్తమ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అని చెప్పారు జేపీ నడ్డా. దేశమంతటా అమలుచేస్తున్న గొప్ప స్కీమ్ ఇది అని అన్నారు. కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తూ… ఆయష్మాన్ భారత్ ను పక్కనపెట్టారని అన్నారు. మోడీ, బీజేపీపై అక్కసుతోనే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలుపరచడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ సంగతి పక్కన పెడితే.. మరి ఆరోగ్య శ్రీ సంగతి ఏమైంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వాలనుకున్నా… రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకోవడం లేదన్నారు.

2023లో కేసీఆర్ కు వాస్తు సంగతి తెలుస్తుందన్నారు జేపీ నడ్డా. పరిపాలన సచివాలయం నుంచి జరగడం లేదన్నారు. కేబినెట్ లో ఎస్టీలకు ప్రాధాన్యత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ కోసమే చేస్తున్నారనీ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు మంచి పేరు పెట్టి గలీజ్ పనులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటనీ.. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ పీఠం ఎక్కారని.. ఆ తర్వాత మరిచిపోయిందని అన్నారు. తెలంగాణలో ఈసారి ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పిన జేపీ నడ్డా.. టిఆర్ఎస్ నుండి కూడా బీజేపీలోకి నాయకులు వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ చెప్పేది వింటేనే టీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి ఉందన్నారు. కలిసొచ్చే వారిని కలుపుకొని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నడ్డా.

Latest Updates