జడ్జీలు కాని జడ్జీలు తీర్పులు చెప్తున్నరు!

జిన్ జియాంగ్ ఓ ఇ–కామర్స్ సైట్ లో ఓ మొబైల్ కొన్నడు. చేతికొచ్చినంక చూస్తే అందుట్ల మొబైల్ పగిలిపోయి కన్పించింది. వెంటనే అతడు తన పాత మొబైల్ తీసుకున్నడు. వీచాట్ యాప్ ఓపెన్ చేసిండు. కేసు ఫైల్ చేసిండు. ఓ రోజు విచారణ టైం వచ్చింది. మళ్లా వీచాట్ లోనే వీడియో చాట్ ద్వారా వాదనలు వినిపించిండు. ఎవిడెన్స్ సమర్పించిండు. అంతే.. ఇ–కామర్స్ కంపెనీ తప్పు చేసిందని, పరిహారం చెల్లించాల్సిందేనంటూ వర్చువల్ జడ్జీ అవతార్ (జడ్జీ రూపంలోని బొమ్మ) తీర్పు చెప్పేసింది!  అవును.. చైనాలో ఇప్పుడు ఆన్ లైన్ కోర్టులు, వాటి ద్వారా జడ్జీలు కాని జడ్జీలు కూడా తీర్పులు చెప్తున్నారు!

స్పీడు పెంచేందుకే..

‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్..’ అన్నది న్యాయసూత్రం. అంటే ‘ఆలస్యంగా జరిగే న్యాయం అసలు న్యాయమే కాదు’  అని అర్థం. అందుకే చైనా ఈ విషయంపై చైనా సుప్రీం పీపుల్స్ కోర్ట్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలని వాడుకుంటూ ఆన్ లైన్ కోర్టులను ప్రవేశపెట్టింది. అసలే ప్రపంచంలోనే ఎక్కువ జనాలున్న దేశం. కేసులు కూడా లక్షల కొద్దీ పెండింగ్ లో పడిపోతున్నాయి. అందుకే.. డిజిటల్ కోర్టుల్లో వర్చువల్ జడ్జీలను రంగంలోకి దించింది చైనా సుప్రీంకోర్టు.

అంతా ఆన్ లైన్ లోనే..

చైనాలో ఆ దేశానికి సొంత మెసేజింగ్ యాప్ వీచాట్ ఉంది. ఆ పాపులర్ యాప్ ద్వారానే ఈ ఆన్ లైన్ కోర్టులు నడుస్తున్నాయి. వీచాట్ ఇంటర్ ఫేస్ లో పైభాగంలో చైనా జాతీయ చిహ్నం ఉంటుంది. దాని కింద ఒక వర్చువల్ జడ్జి (డిజిటల్ బొమ్మ) కూర్చుని ఉంటారు. విచారణకు హాజరయ్యేవారు తమ అకౌంట్ ద్వారా లాగిన్ కావాలి. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వీచాట్ ద్వారానే కేసును ఫైల్ చేయొచ్చు. వాదనలు వినిపించొచ్చు. ఎవిడెన్స్ ను కూడా మార్పిడి చేసుకోవచ్చు.

విచారణ ఇలా జరుగుతది..

విచారణ సమయంలో వీచాట్ లోకి లిటిగెంట్లు వీడియో చాట్ ద్వారా లాగిన్ అవుతారు. ఆన్ స్క్రీన్ లో ఏఐ జడ్జి అవతార్ ప్రత్యక్షమవుతుంది. ఆ వెంటనే లిటిగెంట్లు తమ వాదనలను వినిపిస్తారు. ఈ సందర్భంగా లిటిగెంట్లను వర్చువల్ జడ్జి కేసుకు సంబంధించిన ప్రశ్నలను కూడా అడుగుతాడు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుని, లిటిగెంట్ల వాదనలను బట్టి తీర్పును ప్రకటిస్తాడు. అయితే, వర్చువల్ జడ్జీలు పూర్తి చేసిన ప్రొసీడింగ్స్ ను అసలైన జడ్జీలు పర్యవేక్షిస్తారు. ఏఐ జడ్జీల డెసిషన్ కరెక్ట్ గా ఉందని భావిస్తే దానినే తుది తీర్పుగా ప్రకటిస్తారు. లేదంటే బాధితులకు సరైన న్యాయం జరిగేలా తీర్పును సవరించి చెప్తారు.

30 లక్షల ప్రొసీడింగ్స్ పూర్తి

డిజిటల్ కోర్టులకు ఆన్ లైన్ ట్రేడ్ డిస్పూట్లు, కాపీరైట్ కేసులు, ఇ-–కామర్స్ వివాదాల వంటి కేసులే ఈ కోర్టులకు ఎక్కువగా వస్తున్నాయి. వర్చువల్ జడ్జీలను రంగంలోకి దింపడం వల్ల అసలైన జడ్జీలకు ఎంతో పనిభారం తగ్గుతోందని చెప్తున్నారు. దాదాపు 30 లక్షల లీగల్ కేసులు, జ్యుడీషియల్ ప్రొసీజర్స్ ను ఈ ఆన్ లైన్ కోర్టులు పూర్తి చేశాయట. వాస్తవానికి చైనాలో తొలి డిజిటల్ కోర్టు 2017లోనే హాంగ్​ఝౌలో ప్రారంభమైంది. ప్రధానంగా డిజిటల్ అంశాలకు సంబంధించిన లీగల్ డిస్పూట్లను పరిష్కరించేందుకు ఇది మొదలైంది.

పూర్తిగా సీక్రెట్

బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడటం వల్ల ఈ కోర్టు ప్రక్రియ అంతా పూర్తి సీక్రెట్ గా జరుగుతుందని హాంగ్ ఝౌ ఇంటర్నెట్ కోర్ట్ వైస్ ప్రెసిడెంట్ నీ డిఫెంగ్ చెప్తున్నారు. కేసుల్లో లీగల్ ప్రొసీజర్స్ ను పాదర్శకంగా పూర్తి చేసేందుకు, రికార్డులన్నింటినీ సీక్రెట్ గా భద్రపర్చేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోందని వెల్లడించారు. హంగా ఝౌ డిజిటల్ కోర్ట్ సక్సెస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా బీజింగ్, గ్వాంగ్ ఝౌలలోనూ చైనా సుప్రీంకోర్ట్ డిజిటల్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ ఈ రెండు కోర్టులూ కలిపి 1,18,764 కేసులను స్వీకరించాయని, 88,401 కేసులను ముగించాయని సుప్రీంకోర్ట్ తెలిపింది. చైనాలో ప్రస్తుతం12 ప్రావిన్స్ లలో డిజిటల్ కోర్టులు నడుస్తున్నాయని ఆ దేశ సుప్రీంకోర్ట్ చీఫ్​జస్టిస్, ప్రెసిడెంట్ ఝౌ కియాంగ్ గురువారం ఒక నివేదికలో వెల్లడించారు. దేశంలోని 90 శాతం కోర్టులు ఎంతోకొంత ఆన్ లైన్ లో ప్రొసీడింగ్స్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates