చర్చలు విజయమన్న కాసేపటికే జూడాల సమ్మెబాట

డిమాండ్లేవీ తీర్చలేదన్న జూనియర్ డాక్టర్లు
డాక్టర్లపై దాడికి నిరసనగా రోడ్డు పై బైఠాయింపు
గాంధీకి సీఎం రావాలని డిమాండ్
సెక్రటేరియట్ కు రావాలని జూడాలకు ఈటల కబురు
రాబోమని తేల్చి చెప్పడంతో గాంధీకి వచ్చిన ఈటల
సమస్యలపై రోడ్డెక్కొద్దని మంత్రి సూచన
అయినా సమ్మెకే దిగిన జూనియర్ డాక్టర్లు

హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: సర్కారుతో గాంధీ జూనియర్ డాక్టర్లు చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె చేసేందుకే జూడాలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం రాత్రి కరోనా పేషెంట్ ఒకరు మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ పేషెంట్ బంధువులు ఓ డాక్టరుపై దాడి చేశారు. దానికి నిరసనగా మంగళవారం రాత్రి నుంచే జూడాలు ఆందోళన చేస్తున్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రి ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. సేవ్ డాక్టర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి రావాలంటూ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే చర్చల కోసం సెక్రటేరియట్ కు రావాల్సిందిగా జూడాలకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాచారం ఇచ్చారు. అయితే, తాము రాబోమని జూడాలు తేల్చి చెప్పడంతో ఈటలనే గాంధీకి వెళ్లారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి జూడాల సమ్మెకు మద్దతు తెలిపారు. వైద్యులపై దాడులను అరికట్టలేని సర్కార్ అసలు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో విఫలమైందని విమర్శించారు.

రోడ్డెక్కొద్దు .. నాతో చెప్పండి
బుధవారం సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీలోని సెమినార్లల్లో జూడాలతో మంత్రి ఈటల, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. గాంధీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని జూడాలు డిమాండ్ చేశారు. డాక్టర్లు, ఇతర స్టాఫును రిక్రూట్ చేయాలన్నారు. సెక్యూరిటీ పెంచాలని, హెల్త్ మినిస్టర్ అడ్వైజరీ కమిటీలో చోటు కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీ వార్డుల్లో ఎస్పీజీ ప్రొటెక్షన్ పెట్టాలని కోరారు. కరోనా పేషెంట్లు పెరుగుతుండటంతో తమపై పని ఒత్తిడి పెరుగుతోందని, వేరే ఆస్పత్రుల్లోనూ ట్రీట్మెంట్ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పీపీఈ కిట్లలో కొన్ని నాసిరకంగా ఉన్నాయని, నాణ్యమైన కిట్లు ఇవ్వాలని కోరారు. చర్చల తర్వాత మాట్లాడిన మంత్రి ఈటల.. డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు ఉంటే తనతో చెప్పాలని, రోడ్డెక్కొద్దని డాక్టర్లకు సూచించారు. వేరే ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్పై సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వారానికోసారి జూడాలతో సమావేశం అవుతా మని హామీ ఇచ్చారు. వెంటనే విధుల్లో చేరాలని జూడాలను కోరారు.

సఫలమన్న కాసేపటికే…
జూనియర్ డాక్టర్లతో చర్చలయ్యాక మంత్రి ఈటల కార్యాలయం జూడాలతో చర్చలు సఫలమయ్యాయని ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రి హామీతో జూడాలు డ్యూటీ ఎక్కేందుకు ఒప్పుకున్నారని అందులో పేర్కొంది. మంత్రికి జూడాలు కృతజ్ఞతలు కూడా చెప్పారని ప్రకటించింది. కానీ, ప్రకటన వచ్చిన కాసేపటికే.. సమ్మె కొనసాగిస్తున్నట్టు జూడాలు ప్రకటించారు. మంత్రితో చేసిన చర్చలు ఫలించలేదని, తమ డిమాండ్లేవీ నెరవేరలేదని చెప్పారు.

దాడి చేసిన ఇద్దరు అరెస్ట్
ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్లపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారిని రిమాండుకు పంపించారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్లర్లో ఈ విషయం వెల్లడించారు. నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఎపిడెమిక్ డిసీజ్ యాక్టులోని సెక్షన్ 4, తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్, మెడికేర్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వైద్యులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వారియర్స్ అయిన డాక్టర్ల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇక, బుధవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో పోలీస్ బందోబస్తును పెంచుతామన్నారు.

For More News..

హైదరాబాద్లో ఇట్లయితే కష్టం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ

Latest Updates