ఇవాళ్టి నుంచి ఉస్మానియాలో జూడాల సమ్మె

రాష్ట్రంలో ఆర్ఎంపీ,పీఎంపీ వ్యవస్థను రద్దు చేయాలని ఉస్మానియా హాస్పిటల్​లో జూనియర్ డాక్టర్ లు  ఇవాళ్టి (బుధవారం) నుంచి సమ్మె చేయనున్నారు. ఏమాత్రం వైద్య అనుభవం లేని వీరి కారణంగా ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ జూనియర్ల డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. దీనిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం అనుభవం లేని డాక్టర్లను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇందుకు నిరసనగా ఉస్మానియా ఆస్పత్రి ముందు జూనియర్ డాక్టర్ లు ధర్నాకు దిగారు. దీంతో పాటు గత 5నెలలుగా తమకు రావాల్సిన స్టైఫండ్ పెండింగ్ లో ఉందని వెంటనే వాటిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్ కు వినతిపత్రం సమర్పించారు. ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ రద్దు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్ లు తెలిపారు. తమకు మద్దతు ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కూడా త్వరలోనే కలుస్తామని జూనియర్ డాక్టర్ లు తెలిపారు. ఉస్మానియాలో మాత్రమే సమ్మె చేస్తున్నామని మిగతా దవాఖానాల్లో నిరసనలు తెలుపుతారన్నారు.

 

Latest Updates