అప్పుడే పెరుగుతున్న ఎండలు

రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లు

ఇప్పటికే 34 డిగ్రీలు నమోదు

ఈ సీజన్​లో చలి తక్కువే..

హైదరాబాద్‌, వెలుగు: ఎండాకాలానికి నెల రోజుల ముందుగానే రాష్ట్రంలో ఎండలు మొదలయ్యాయి. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొద్దుగాల 8గంటలకే మొదలవుతున్న ఎండ.. టైమ్​ గడిచేకొద్దీ ఎక్కువవుతోంది. నైట్ టెంపరేచర్లు కూడా పెరగడంతో ఉక్కపోత మొదలైంది. ఆదివారం ఆదిలాబాద్ లో 34.5, మహబూబ్ నగర్ లో 33.2, మెదక్ లో 33,  హైదరాబాద్ లో 32.6, భద్రాచలంలో 32.5, హన్మకొండలో 32.5, నల్గొండలో 32.5, నిజామాబాద్ లో 32.4, ఖమ్మంలో 32.2, రామగుండంలో 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతలూ భారీగా పెరిగాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నిజామాబాద్‌‌‌‌, ఖమ్మం, హన్మకొండలో 20 డిగ్రీలు, హైదరాబాద్‌‌‌‌లో 19.5, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 19.1, ఆదిలాబాద్‌‌‌‌, భద్రాచలం లో 19 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి.

ఈసారి చలి అంతంతే..

రాష్ట్రంలో ఈ సీజన్‌‌‌‌లో చలి తీవ్రత తక్కువగానే ఉంది. నవంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌ నెలల్లో వారం పది రోజులే చలి ఎక్కువ పెట్టింది. ఆ టైమ్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు పడిపోయాయి. మిగతా అన్ని రోజుల్లో సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలి ఉంటుంది. కానీ ఈసారి జనవరిలోనే చలి తీవ్రత తగ్గింది. తూర్పు దిశ నుంచి గాలులు వీచేవని, కానీ ఇప్పుడు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇక చలి పోయినట్లేనని, తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పింది.

ఇవి కూడా చదవండి..

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

 

Latest Updates