మేం పక్క రాష్ట్రం వాళ్లమనే మాపై వివక్ష

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఐపీసీ 147, 324 సెక్షన్లను చేర్చారు. ఎఫ్ఐఆర్  లో మార్పులు చేశారు. రిమాండ్ డైరీలో పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు.  ఇదే విషయంపై అఖిలప్రియ సోదరి భూమా మౌనిక మీడియాతో మాట్లాడారు. నాటకీయ పరిణామాల మధ్య తమ అక్కను రిమాండ్‌ కు తరలించారన్నారు మౌనిక. పోలీసుల తీరు భాద కలిగించిందని, అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతోందని, రాత్రి భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హఫీజ్‌ పేట్ ‌లోని 25 ఎకరాల భూవివాదం వ్యక్తిగత వివాదం కాదని తెలిపారు.

‘‘కంపెనీ పేరుతో నాన్న, మామ ఏవీ సుబ్బారెడ్డి కొనుగోలు చేశారు. ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు పార్ట్ ‌నర్స్ ‌గా ఉన్నారు. మా నాన్న చనిపోయాక భూమిపై వివాదం సృష్టించారు. ప్రతాప్‌ రావు చెబుతున్నట్లు భూవివాదంపై కూర్చొని మాట్లాడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో నేనే ప్రవీణ్‌రావుతో మాట్లాడి పరిష్కారం చేయాలని కోరాను. బుధవారం ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అని చెప్పి అరెస్ట్‌ చేసి వదిలేశారు. ఏ2గా ఉన్న మా అక్కను ఏ1గా మార్చి రిమాండ్‌ కు తరలించారు. మామకు ఓ న్యాయం ..మాకో న్యాయమా?. మేం పక్క రాష్ట్రం వాళ్లం కాబట్టే మాపై వివక్ష చూపుతున్నారా? ప్రతాపరావు కుటుంబంతో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం కావాలి. అని భూమా మౌనిక కోరారు.

హఫీజ్ పేట్  భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియేనని కోర్టుకు తెలిపారు. ఆమె రెండో నిందితురాలని ప్రెస్ మీట్ లో తెలిపిన పోలీసులు.. ఇపుడు ఏ1గా మార్చారు. మరో నిందితుడు సుబ్బారెడ్డిని విచారించి… 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి వదిలేశారు. కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం గాలింపు కొనసాగుతోంది. సెక్షన్లు మారడంతో.. కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అఖిలప్రియ తరపు లాయర్లు. బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది సికింద్రాబాద్ కోర్టు. కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. మెరుగైన వైద్య చికిత్స కోసం తనను చంచల్ గూడ జైలు నుంచి హాస్పిటల్ కు తరలించాలంటూ అఖిలప్రియ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. జైల్ లో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని…. అందుబాటులో డాక్టర్లు ఉన్నారని కోర్టు తెలిపింది. జైల్ అధికారులు ఆస్పత్రికి తరలించాలని సూచిస్తే… అప్పుడు నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.

Latest Updates