జ్యుడీషియల్ కమిషన్ కు సివిల్ కోర్టుతో సమానంగా పవర్స్: జస్టిస్ చంద్రకుమార్ 

జ్యుడీషియల్ కమిషన్ కు సివిల్ కోర్టుతో సమానంగా పవర్స్: జస్టిస్ చంద్రకుమార్ 
  • సమన్లు జారీ చేయొచ్చు.. తిరస్కరిస్తే చర్యలు తీస్కోవచ్చు 
  • కాళేశ్వరంపై రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ 
  • ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనం వృథా: కోదండరెడ్డి 
  • కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది: వెంకట్రామయ్య
  • ప్రాజెక్టు ప్లేస్ ను మార్చడమే అవినీతికి తొలిమెట్టు: నైనాల గోవర్ధన్ 

ఖైరతాబాద్, వెలుగు: ప్రభుత్వం నియమించే విచారణ కమిషన్ కు కూడా సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు ఉంటాయని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. అయితే, ప్రభుత్వం రిఫర్ చేసిన అంశానికి మాత్రమే కమిషన్ విచారణ పరిమితం అవుతుందన్నారు. తెలంగాణ జల సాధన సమితి, తెలంగాణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ‘జ్యుడీషియల్ కమిషన్ లను బెదిరించే కేసీఆర్ భూస్వామ్య, రాచరిక విధానాలను ఖండించండి’ అనే అంశంపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్​ను మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టిన నేపథ్యంలో కమిషన్ పరిధి, దాని అధికారాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘‘జ్యుడీషియల్ కమిషన్ ఎవరినైనా విచారణకు పిలిస్తే వెళ్లాలి. కమిషన్ ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు. సమన్లను తిరస్కరించే వ్యక్తులపై సివిల్ కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కమిషన్ కూడా అలాంటి చర్యలు తీసుకోవచ్చు” అని వివరించారు. అయితే, తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి ఎందుకు మార్చారో ప్రభుత్వం తేల్చాలన్నారు. 

ఏకపక్ష నిర్ణయాలు దెబ్బతిశాయి

గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేసిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు కట్టే ముందు భూ పరీక్షలు నిర్వహించాలని, కానీ అవేవీ చేయకుండానే నిర్ణయాలు తీసుకున్నారని తప్పుపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం కావడంపై విచారణ జరగాలన్నారు.

కేసీఆర్ హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్ తో కూడా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారన్నారు. సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందన్నారు. మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును రీ- డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం వద్దకు మార్చడమే అవినీతికి తొలిమెట్టు అని తెలంగాణ జల సాధన సమితి నైనాల గోవర్ధన్ అన్నారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఎక్కువ భాగం పనులను మేఘా సంస్థకు ఇవ్వడంపై విచారణ జరపాలన్నారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, దొంతు నర్సింహారెడ్డి, తెలంగాణ విఠల్, పృథ్వీ రాజ్ యాదవ్, సౌగరా బేగం తదితరులు మాట్లాడారు.