విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నిర్ణయమే ఫైనల్

విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నిర్ణయమే ఫైనల్

న్యూఢిల్లీ, వెలుగు:

విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేటాయింపుల్లో ఉన్న ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కార్పొరేషన్లు మాత్రమే లిఖితపూర్వకంగా జస్టిస్ ధర్మాధికారి కమిటీని ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల అభ్యంత‌‌రాల‌‌ను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని కమిటీని ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపుల్లో జ‌‌స్టిస్ ధ‌‌ర్మాధికారి నివేదిక‌‌పై అభ్యంత‌‌రాలు వ్యక్తం చేస్తూ, ఏపీ డిస్కమ్‌‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుని జస్టిస్ అశోక్‌‌ భూషణ్‌, జస్టిస్‌‌ ఎంఆర్‌‌ షాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచార‌‌ణ చేప‌‌ట్టింది. వాద‌‌న‌‌ల తరువాత కమిటీ రిపోర్ట్‌‌పై డిస్కమ్‌‌ల అభ్యంతరాలను పరిశీలించాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీకి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఉద్యోగుల అభ్యంత‌‌రాల‌‌ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. అయితే, ధర్మాధికారి కమిటీ కేటాయింపులను పక్కన పెట్టాలన్న ఏపీ డిస్కమ్‌‌ల వాదనలను బెంచ్‌‌ తోసిపుచ్చింది. అభ్యంతరాలు ఉంటే కమిటీకే తెలపాలని స్పష్టం చేసింది. రిలీవ్ అయిన ఉద్యోగులకు జీతాలు ఎవరు అందజేయాలనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ 1157 మంది విద్యుత్ ఉద్యోగుల్లో తెలంగాణకు 502, ఏపీకి 655 మంది ఉద్యోగులను కేటాయించింది.