యూట్యూబ్ లో నాకు క్రేజ్ మామూలుగా లేదు : పాల్ మేనిఫెస్టో రిలీజ్

విజయవాడ :  ప్రజా శాంతి పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ వ్యవస్థాపకులు కె.ఎ.పాల్. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు.

“నా సొంత ఆలోచనలో ఈ మ్యానిఫెస్టోను తయారు చేశా. ఇటువంటి మ్యానిఫెస్టో ప్రపంచంలో ఎవరూ రూపొందించలేదు. ఈ మ్యానిఫెస్టోపై CM అభ్యర్థిగా ఉన్న నేత ఎవరితో అయినా నేను బహిరంగ చర్చకు సిద్దం. 40శాతం ఓటు బ్యాంకు మాకు ఉంది. మా గెలుపు ఖాయమని తెలిసి ఇతర పార్టీల నేతలు భయపడుతున్నారు.

నా మ్యానిఫెస్టో చూశాక చంద్రబాబు, పవన్, జగన్ కుటుంబ సభ్యులు కూడా నా పార్టీకే ఓటు వేస్తారు.  నెల రోజులలో ట్రంప్ ను తీసుకువచ్చి, నిధులు తెచ్చి నా సత్తా ఏమిటో చూపిస్తా.   చానల్స్ లో నాకు కవరేజి ఇవ్వకుండా… వారి రేటింగ్ కోసం యూట్యూబ్ లో మాత్రమే ఇస్తున్నారు. మోడి, చంద్రబాబు, జగన్ ల మాటలు ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదు” అన్నారు.

 • అధికారంలోకి రాగానే పార్టీ  గెలిచిన ఒక్కో నియోజకవర్గానికి రూ.వంద కోట్లు కేటాయిస్తాం
 • గెలిచిన ప్రతి నియోజకవర్గంలో రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
 • వైజాగ్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కె.ఎ.పాల్ హెల్త్ సిటీ, కిలారు సంతోషమ్మ మెమోరియల్ హాస్పిటల్ నిర్మాణం
 • హెలికాప్టర్ లతో ఎయిర్ అంబులెన్స్ సేవలు
 • గెలిచిన ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్కూళ్లు నిర్మిస్తాం
 • 3లక్షల 10వేల మంది అనాధ పిల్లలకు ఉచిత విద్య
 • నారాయణ స్కూల్స్ కంటే‌ మెరుగైన మార్కులు తెప్పిస్తాం
 • ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు రూ.15వేలు ఇస్తాం
 • ఆడపిల్ల పుడితే మరో రూ.1000 అదనం
 • డ్వాక్రా మహిళల కు తొలిరోజే పూర్తిగా రుణమాఫీ
 • అర్హత గల మహిళలకు 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తాం
 • రాష్ట్రానికి లక్షల కోట్లు తెచ్చి జాతి, కుల, మత బేధాలు లేకుండా పాలన సాగిస్తాం
 • నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తాం
 • రైతులు అందరికీ ఎకరానికి రూ.8 వేలు సాయం,  రూ.5 లక్షల జీవిత బీమా
 • ఏడాదిలో 100శాతం రైతు రుణ మాఫీ

“పాల్ ను గెలిపిస్తే… ‌ విదేశాల నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం. వంద నియోజకవర్గాలో మా గెలుపు ఖాయం. 175 నియోజకవర్గాలలో గెలుపు కోసం కృషి చేస్తున్నాం. చంద్రబాబు, జగన్ లను చూపిస్తే ఎవరూ చూడరు. నన్ను చూపండి.. యూ ట్యూబ్ లోనే నా లైవ్ ను ఇరవై లక్షల మంది చూశారు. నాకు కవరేజి ఇచ్చిన మీడియాకు మూడు నెలల తర్వాత అంతా బాగుంటుంది” అన్నారు కేఏపాల్.

Latest Updates