రెండు ట్రైన్లు ఢీ.. క్యాబిన్‌లో ఇరుకున్న డ్రైవర్.. 8 గంటల తర్వాత..

గ్యాస్ కట్టర్‌తో రైలు క్యాబిన్ కోసి.. బయటకు తీసిన రెస్క్యూ టీమ్

ప్రాణాలతో బయటపడిన ఎంఎంటీఎస్ డ్రైవర్.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ చంద్రశేఖర్ దాదాపు 8 గంటల తర్వాత సేఫ్‌గా బయటపడ్డాడు. చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ కట్టర్‌తో రైలు క్యాబిన్ కోసి.. అతడిని బయటకు తీసింది రెస్క్యూ టీం.

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు – సికింద్రాబాద్ మధ్య నడిచే హంద్రీ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ వస్తుండగా సిగ్నల్ చూసుకోకపోవడం వల్ల కాచిగూడ స్టేషన్‌లో సేమ్ ట్రాక్‌పై ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్‌ను ఢీకొంది. దీంతో రెండు రైళ్లలోని ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగిగాయి. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంఎంటీఎస్ ట్రైన్ డ్రైవర్ చంద్రశేఖర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయ చర్యలు మొదలుపెట్టిన రెస్క్యూ టీం అతడిని బయటకు తీయడానికి తీవ్రంగా కష్టపడింది. గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్ కట్ చేసి.. దాదాపు 8 గంటల తర్వాత సాయంత్రానికి సేఫ్‌గా కాపాడింది. కాళ్లకు గాయాలైన డ్రైవర్‌ను ఆబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సిగ్నల్స్ సమస్య వల్లే

ఈ ప్రమాదానికి కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పై రావడంతో ప్రమాదం జరిగింది. రెండో ట్రాక్‌లో రావాల్సిన ఎంఎంటీఎస్ నాలుగో ట్రాక్‌పై రావడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో రైల్వే పైలెట్ తప్పిదం ఏమీ లేదని, సిగ్నల్ ఆధారంగా ట్రాక్ ను మారుస్తారని, అదే సమయంలో రెండో ట్రాక్ పడాల్సిన సిగ్నల్ , నాలుగో ట్రాక్ పై సిగ్నల్ పడడంతో ఎంఎంటీఎస్ ట్రైన్ ట్రాక్ మారడంతో ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని  చెప్పారు.

Latest Updates