‘కాలాపానీ’.. కహానీ

కాలాపానీ అనగానే వెంటనే గుర్తొచ్చేవి… ఆ పేరుతో తీసిన సినిమా, అదే పేరుతో ఉన్న ఓ జైలు. అండమాన్​ అండ్​ నికోబార్​ దీవుల్ని బ్రిటిష్​వాళ్ల హయాంలో ‘కాలాపానీ’గా పిలిచేవారు. అక్కడే పెద్ద జైలు కట్టి స్వతంత్రం​కోసం అంకితభావంతో పోరాడినవాళ్లను అక్కడికి పంపేసేవారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే  కాలాపానీకి దానికి సంబంధమే లేదు. ఇది ఇండియా, నేపాల్ బోర్డర్​లో ఉంటుంది. నిజానికి ఈ ఏరియా ఇండియా, నేపాల్​తోపాటు టిబెట్​ (చైనా) కలిసే మూడు దేశాల ట్రయాంగిల్​ జంక్షన్​. మన దేశంలో ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని పితోరా​గఢ్ జిల్లా పరిధిలోకి వస్తుంది.​ నేపాల్​ ఈ ప్రాంతాన్ని తన భూభాగంలోని దర్చులా జిల్లాలో ఓ భాగంగా చెప్పుకుంటోంది. ఇక్కడ 1962 నుంచీ ఇండో–టిబెటన్​ బోర్డర్​ పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.

ఉరుములేని పిడుగులా ఇప్పుడు ఇండియా, నేపాల్​ మధ్య కాలాపానీ వివాదం బయటికొచ్చింది. జమ్మూ కాశ్మీర్​ని విడదీసి, రెండు యూటీలుగా మార్చిన తర్వాత కొత్త మ్యాప్​ల్ని ఇండియా రిలీజ్​ చేసింది. దీనిలో నేపాల్​ తనదిగా భావించే కాలాపానీ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్​లోని పితోరాగఢ్​లో ఉన్నట్లుగా ఇండియా మ్యాప్​లో చూపించింది. దీనిని ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఖండించారు. సరిహద్దు సమస్య ఉన్నప్పుడు ఇండియా ఏకపక్షంగా మ్యాప్​ రిలీజ్​ చేయడం కుదరదని ఓలి అభ్యంతరం చెప్పారు.

ఈ తగాదా ఎప్పటిది?

కాలాపానీ అనేది 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఒక ప్రాంతం. దీనిపై రెండు వందల ఏళ్లకు పైగా తగాదా నడుస్తోంది. తొలిసారిగా 1816లో సమస్య తలెత్తింది. పరిష్కారం కోసం అప్పట్లో బ్రిటిష్​ ఇండియాకి, నేపాల్​కి​ మధ్య సెగౌలీ అనే ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మహాకాళి నదిని నేపాల్​ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. మహాకాళి నది ఎక్కడ పుట్టిందనేదే ఈ పంచాయతీకి ప్రధాన కారణం. మహాకాళి నదిని మొదట్లో కాళి నది అనేవారు. ఈ నదికి తూర్పు ఒడ్డునే ఈ కాలాపానీ ప్రాంతం ఉంది.  మహాకాళి నదికి చాలా ఉప నదులు ఉన్నాయి. అవన్నీ కాలాపానీ వద్దే కలుస్తాయి. అందువల్ల కాళీ నది పుట్టింది కాలాపానీ దగ్గరేనని ఇండియా అంటోంది. కానీ, ఉప నదులన్నీ లిపు లేఖ్​ పాస్​ వద్ద పుట్టాయి కాబట్టి, కాళీ నదికూడా అక్కడే మొదలవుతోందని నేపాల్​ వాదిస్తోంది. అక్కడి నుంచి ప్రవహిస్తున్న కాళీ నదిలో నేపాల్​ బోర్డర్​లో ఉన్న ‘లిపు గాడ్’ అనే ఉపనది కలుస్తుంది.

లిపు గాడ్​కి తూర్పున ఉన్న ప్రాంతాలన్నింటినీ నేపాల్​ ఎప్పుడో తమవిగా క్లెయిమ్​ చేసుకుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పీస్​ అండ్​ కాన్​ఫ్లిక్ట్​ స్టడీస్​’కి చెందిన అలోక్​ కుమార్​ గుప్తా అనే స్కాలర్ చెబుతున్న ప్రకారం… కాలాపానీ వద్ద ప్రధాన నదిలో కలిసే ముఖ్యమైన ఉప నదుల్లో లిపు గాడ్​ ఒకటి. లిపు గాడ్​ ఎక్కడైతే కాలాపానీని కలుస్తుందో కాళీ నది అక్కడే ఆరంభమవుతోందని మన దేశం వాదన. ఈ మేరకు ఇండియా, నేపాల్​ దేశాలు  కొన్ని ఆధారాలను చూపుతున్నాయి.

ఆ ఆధారాలేంటి?

ఇండియా తన వాదనలకు 1830 నాటి అడ్మినిస్ట్రేటివ్​, ట్యాక్స్​ రికార్డ్​ల్ని ఆధారంగా చూపుతోంది. నాటి నుంచీ కాలాపానీ తమ భూభాగంలోనే (పితోరా​​గఢ్​ పరిధిలోనే) ఉందనే క్లారిటీ ఇస్తోంది. కాళీ నది ఎగువన పరీవాహక ప్రాంతాలపై బ్రిటిష్ గవర్నమెంట్​ 1870ల్లో చేసిన సర్వేలను సాక్ష్యాలుగా జత చేస్తోంది. కాలాపానీ 1879 నుంచి బ్రిటిష్​ ఇండియా టెరిటరీలో భాగంగానే ఉందనడానికి తగిన మ్యాపుల్ని ముందు పెడుతోంది. నేపాల్​ సైతం 1850, 56లకు చెందిన అలాంటి మ్యాపులనే (మహాకాళి నది కాలాపానీ దగ్గరే పుట్టినట్లు చూపే మ్యాపులనే) తెరపైకి తెస్తోంది.

వ్యాసుడు తపస్సు చేసిన ప్రాంతం

కాలాపానీ ప్రాంతాన్ని ‘వ్యాస లోయ’గాకూడా చెబుతారు. ఇక్కడే వ్యాస మహర్షి తపస్సు చేశాడని, కాలాపానీ గ్రామం దగ్గరలోని కాళీమాత ఆలయం ప్రాంగణంలోని కోనేరులోనే కాళి నది పుట్టిందని అంటారు. ఇక్కడి నుంచి చూస్తే మధ్య హిమాలయాల్లోని ‘ఓమ్​ పర్వతం’ కనబడుతుంది. 1965లో సీఐఏ రిలీజ్​ చేసిన మ్యాప్​లలో కాలాపానీ ప్రాంతాన్ని ఇండియాలో చేర్చింది. ఈ లోయలో ప్రవహించే కాళి, టింకర్​ నదులు ఇండియా, నేపాల్​, చైనాలకు సరిహద్దులుగా ఉన్నాయి.

Latest Updates