ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు

  • రెండు మోటార్లకు వెట్​రన్​
  • రివర్స్​ పంపింగ్ ​సక్సెస్​
  • అసెంబ్లీ సమావేశాల తర్వాత పంప్​హౌజ్​లను ప్రారంభించనున్న సీఎం

కమ్మర్​పల్లి, వెలుగు: ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలు శనివారం చేరుకున్నాయి. నిజామాబాద్​జిల్లా ముప్కాల్ మండలంలో ని జీరో పాయింట్ వద్దకు వచ్చాయి. ముప్కాల్ పంప్​హౌజ్​పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. సాధారణంగా ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై గ్వైకాడ్​, విష్ణుపురి, బాబ్లీతోపాటు 250 పైగా చిన్న, మధ్యతరహా, పెద్ద ప్రాజెక్ట్​లతోపాటు చెక్ డ్యాంలు  నిర్మించింది. దీంతో ఎస్సారెస్పీకి వరద ప్రవాహం తగ్గింది. దీంతో కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీలోకి పంపించాలని ప్రభుత్వం ఎస్సారెస్పీ రివర్స్​పంపింగ్​పథకం చేపట్టింది. ఎగువ ప్రాంతంలో వర్షాల ద్వారా వరద రాకున్నా కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీకి నీటిని అందించడానికి మూడుచోట్ల పంప్​హౌజ్ ల నిర్మాణం, వరదకాలువ ఆధునికీకరణకు రూ.1756 కోట్లు కేటాయించింది. ఈ పనులను 10 ఆగస్టు 2017లో  సీఎం కేసీఆర్​ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ పనులు రెండేళ్లైనా పూర్తి కాలేదు. దాంతో రివర్స్​పంపింగ్​ ద్వారా నీళ్లు వస్తాయో రావోననే సందేహాలు రైతుల్లో వ్యక్తమయ్యాయి. వెట్ రన్ నిర్వహించడంతో  రైతులు శనివారం ఉదయం నుంచే నీటిని చూడటానికి వరదకాలువ వద్దకు చేరుకున్నారు. మహిళలు, రైతులు వరదకాలువ వద్ద పూజలు చేశారు.

రెండు పంప్​హౌజ్ ల వద్ద వెట్​రన్

ఎస్సారెస్పీ రివర్స్​పంపింగ్​లో భాగంగా వరద కాలువ 73వ కిలోమీటర్​వద్ద ఉన్న  జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామంలో నాలుగు మోటార్లకు వారం క్రితం వెట్​రన్ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత ఇదే జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్​రావుపేట్​గ్రామంలోని వరద కాలువ 34వ కిలోమీటర్ వద్ద ఉన్న పంప్​హౌజ్​కు నీళ్లు చేరుకున్నాయి. ఈ పంప్ హౌజ్​ వద్ద నాలుగు మీటర్లకు పైగా నీరు చేరడంతో శుక్రవారం రాత్రి ఆఫీసర్లు నాలుగు మోటార్లకు వెట్​రన్ నిర్వహించారు. తర్వాత రెండు మోటార్లను శనివారం మధ్యాహ్నం వరకు నడిపించారు. ఆఫీసర్ల సూచన మేరకు మధ్యాహ్నం రెండు మోటార్ల వెట్​రన్ నిలిపివేశారు. రెండు మోటార్ల ద్వారా 3,000 క్యూసెక్యుల నీటిని వరద కాలువలోకి వదిలారు. ఈ కాలువ ద్వారా 0.34 టీఎంసీ నీరు ఎస్సారెస్పీ వైపు పరుగులు పెట్టాయి. నిజామాబాద్​ జిల్లా సరిహద్దు గ్రామమైన కమ్మర్​పల్లి మండలం నాగపూర్ గ్రామానికి నీరు చేరడానికి 3 గంటల సమయం పట్టింది. ఆదివారం మధ్యాహ్నానికి ఎస్సారెస్పీలోకి నీరు చేరనున్నాయి.

అసెంబ్లీ సమావేశాల తర్వాతే ప్రారంభం

ఎస్సారెస్పీ రివర్స్​పంపింగ్​ను సీఎం కేసీఆర్ తో ప్రారంభింపజేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆఫీసర్లు  చేస్తున్నారు. జిల్లాలోని మెండోర మండలం పోచంపాడ్ గ్రామంలో పనులకు గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు జగిత్యాల  రాంపూర్ పంప్​హౌజ్ తోపాటు రాజేశ్వర్​రావుపేట్​వద్ద ఉన్న పంప్​హౌజ్ ను సీఎం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ పనుల ప్రారంభోత్సవానికి ముందే  ఇరిగేషన్ ఆఫీసర్లు వెట్​రన్ నిర్వహించినట్లు సమాచారం. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి వరదకాలువ వెంబడి గ్రామాల్లో పాదయాత్ర చేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. దీనికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు బడ్జెట్​సమావేశాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వరదకాలువ ఉన్న గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం 29 టీఎంసీల నిల్వ

ఎస్సారెస్పీ పూర్తి స్థాయి సామర్థ్యం 91 టీఎంసీలు.  1091 అడుగుల నీటి మట్టం ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో 1070.10 అడుగుల నీటి మట్టం ఉండగా 29.084 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజు 1086.70 అడుగులు ఉండగా 72.269 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Kaleshwaram water reached to SRSP

Latest Updates