ధిక్కారానికి దిక్సూచీ కాళోజీ

  • పాలకుల దోపిడీని అడుగడుగునా నిలదీసిన ధైర్యమది
  • కాళోజీ ఇప్పుడుంటే గట్టిగా ప్రశ్నించేవారు
  • హక్కుల కోసం నోరెత్తలేని పరిస్థితిని చూసి బాధపడేవారు
  • కాళోజీ జయంతి సందర్భంగా కవులు, సాహితీవేత్తలు

వరంగల్, వెలుగు: పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, సమాజంలో అసమానతలను ఆయన ఎప్పుడూ నిలదీసేవారు. ఆ భావాలకు అక్షర రూపమిచ్చి ప్రశ్నల బాణాలు సంధించేవారు. ఉర్దూ అధికార భాషగా ఉన్న రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించి..1945లో రజాకార్ల దౌర్జాన్యాన్ని నిలదీస్తూ మహాసభలు నిర్వహించారు. వరంగల్​ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నగర బహిష్కరణకు గురయ్యారు. నిజాం నవాబు ఆగడాలను ధైర్యంగా ఎదురించిన ఆయన.. ప్రజాస్వామ్యం కోసం తపనపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను చూసి బాధపడేవారు. ‘‘కలదందురు లోకసభను..- కలదందురు ప్రభుత్వంలో, పంచాయితీలో.. కలదందురు రాజ్యాంగమున.. కలదు ప్రజాస్వామ్యమనే వింత కలదో, లేదో?’’ అని కాళోజీ వాపోయారు. ఓట్లు వేసి పార్లమెంటరీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ప్రబోధించి, మంచి వాళ్లని ఎన్నుకొమ్మని ప్రభోదించారు. అదే టైంలో స్థానికంగా, జాతీయంగా ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నెయ్యి చందంగా మారిపోయిందనేవారు. ‘విషనాగులు పూజలందుకుంటున్నాయి.. సత్యవాది విషం తాగుతున్నడు’ అని ఆవేదన చెందేవారు.

మనవాళ్లే దోపిడీ చేస్తే..

‘పరాయివాళ్ల దోపిడీని ఎదుర్కోవాలి, తరిమికొట్టాలి. స్థానికులే దోపిడీ చేస్తే వాళ్లను ఇక్కడే పాతరేయాలి’ అని చెప్పిన కాళోజీ.. ఇప్పుడు బతికుంటే బాధపడేవారని కొందరు సాహితీవేత్తలు, కవులు స్పష్టం చేస్తున్నారు. సమాజంలో బతకాలంటే అప్పుడప్పుడు తిరుగుబాటు తప్పదని ‘బతకదలిచినట్టి మనిషి బతుకు.. తిరుగుబాటు’ అని కాళోజీ ఎలుగెత్తేవారని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఈరోజున గళం, కలం ఎత్తినవాళ్ల పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కవులు, సాహితీవేత్తలకు ఏడాదికోసారి ఇస్తున్న అవార్డులు గుర్తింపు కాదు.. తాయిలాలు ఇచ్చి బుజ్జగిస్తే గుర్తింపు కాదు.. అభిప్రాయాలను ప్రకటించుకోవడానికి స్వాతంత్ర్యం కలిగి ఉండటం నిజమైన గుర్తింపు” అని స్పష్టం చేస్తున్నారు. కాళోజీ చెప్పిన ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరుతున్నారు. విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుందని కాళోజీ అంటుండేవారని.. కానీ ఇప్పుడు విమర్శ వద్దు, ప్రతిపక్షం వద్దనే తీరు తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన మార్గం ఇప్పుడవసరం..

రాజ్యాంగం అంటే చాలా నమ్మకం ఉన్న మనిషి కాళోజీ. కానీ రాన్రాను రాజ్యమే రాజ్యాంగాన్ని పక్కకు వేసేస్తోంది. రాజ్యాంగం పరిరక్షణ, హక్కుల గురించి మాట్లాడితే.. అదే పెద్ద నేరమంటున్న పరిస్థితి ఉంది. ప్రజల హక్కుల కోసం మాట్లాడిన కవులను నిర్బంధిస్తున్నరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగబద్ధంగా పాలించాలని కాళోజీ నినదించేవారు. కాళోజీని ఐకాన్​గా పెట్టుకుంటున్నం. ఆయన మార్గంలో ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యకరంగా నిలబెట్టుకుందామనే డిమాండ్​ మీద అందరం పని చేయగలిగితే.. అందుకు అవకాశాలు ఉంటే.. కాళోజీ కలలు కన్న తెలంగాణ, రాజ్యం, దేశం ఉంటాయి.

– కాత్యాయనీ విద్మహే, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

అన్యాయం అనిపిస్తే ప్రశ్నించేవారు

అందరూ బాగుండాలె అనుకున్న గొప్ప వ్యక్తి కాళోజీ. ఆయన ఇప్పుడున్నా.. ప్రస్తుత వాతావరణం బాగోలేకపోతే ప్రశ్నించేవారు. కాళోజీ ఎన్నడూ ఎవరైనా, ఎంత గొప్పవారైనా.. అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా గొడవకు ముక్తి ప్రాప్తి అంటుండేవారు. ఇప్పుడున్న పరిస్థితులను గమనించి ఏమైనా అవకతవకలు ఉంటే మాత్రం ఊరుకునేవారు కాదు.

– వీఆర్​ విద్యార్థి, ప్రముఖ కవి

దోపిడీ లేని రాజ్యం కావాలనుకున్నరు

కాళోజీ దోపిడీ లేని రాజ్యం కావాలనుకున్నరు. తెలంగాణ అందరికీ అనుకూలంగా ఉండాలని అనుకున్నారు. తెలంగాణ రాకముందు ‘వానాకాలంలోనూ చేనులెండిపోతయని, మండే వేసవిలో వలే ఎండలు కాస్తుంటయని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఎవరనుకున్నారు?’ అని ఆంధ్రా పాలకుల వంచనను ఎండగట్టారు.

– నాగిళ్ల రామశాస్త్రి, ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధి

Latest Updates