ఎంబీబీఎస్​ కౌన్సెలింగ్​పై.. దారికొచ్చిన కాళోజీ వర్సిటీ

ఏపీ స్టూడెంట్లకు చాన్స్​ లేకుండా చివరి రౌండ్ కౌన్సెలింగ్

రూల్స్​ప్రకారమే చేస్తున్నమని ఇప్పటిదాకా చెప్పిన ఆఫీసర్లు

ఇప్పుడు తప్పు దిద్దుకుని నోటిఫికేషన్​

హైదరాబాద్‌, వెలుగు: ఎంబీబీఎస్​ అడ్మిషన్లలో రాష్ట్ర స్టూడెంట్లకు తీవ్ర అన్యాయం జరగడంపై ఆగ్రహం వ్యక్తం కావడంతో.. కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ చివరి దశలో దిద్దుబాటు చేపట్టింది. ఇప్పటికే ఏపీలోని మెడికల్ కాలేజీల్లో చేరిన స్టూడెంట్లు తెలంగాణలో జరుగుతున్న చివరిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించింది. శనివారం విడుదల చేసిన కన్వీనర్ కోటా చివరి రౌండ్‌ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. తెలంగాణలోని కాలేజీల్లో సీట్లు పొంది, వాటిలో చేరిన స్టూడెంట్లు మాత్రం ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది.

నాలుగో రౌండ్ తర్వాత మిగిలిన 4 సీట్లను ఈ రౌండ్‌లో స్టూడెంట్లకు కేటాయించనున్నారు. ఆదివారం పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు చాన్స్​ ఇచ్చారు. ఏపీలో సీట్లు పొందిన స్టూడెంట్లను నాలుగో రౌండ్ కౌన్సెలింగ్​లో పాల్గొనేందుకు అనుమతించడం, తెలంగాణ స్టూడెంట్లకు జరుగుతున్న అన్యాయంపై ‘వెలుగు’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దాంతో ఆఫీసర్లు స్పందించారు. ఇన్నాళ్లూ అంతా రూల్స్ ప్రకారమే చేస్తున్నామని వాదించగా.. ఇప్పుడు మార్చారు.

మేనేజ్‌‌మెంట్ కోటా నోటిఫికేషన్ ఎప్పుడు?

ఎంబీబీఎస్​ మేనేజ్‌‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నీట్ ర్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్‌‌మెంట్ కోటా సీట్ల మూడో రౌండ్ కౌన్సెలింగ్ డిసెంబర్‌‌‌‌లోనే ముగియగా.. జనవరి 4  వరకు కాలేజీల్లో చేరేందుకు చాన్స్​ఇచ్చారు. ఇది జరిగి ఆరు రోజులు అవుతున్నా మరో నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్ని సీట్లు మిగిలాయో (నాన్ జాయిన్డ్) కూడా వెల్లడించలేదు. మరోవైపు ఈ నెల 15తో నేషనల్ మెడికల్ కౌన్సిల్ విధించిన కౌన్సెలింగ్ గడువు ముగుస్తుంది. మేనేజ్‌‌మెంట్ కోటాలో బీ, సీ అని రెండు కేటగిరీల సీట్లు ఉంటాయి. బీ కేటగిరీ సీటు ఫీజు రూ.11.5 లక్షల నుంచి 12 లక్షలు ఉండగా.. సీ కేటగిరీ సీటు ఫీజు రూ.23 లక్షలకుపైగా ఉంది. బీ కేటగిరీ సీట్లు మిగిలితే, ఆటోమేటిగ్గా సీ కేటగిరీ కిందికి మారిపోతాయని యూనివర్సిటీ రూల్స్‌‌లో ఉంది. అంటే మూడో రౌండ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఇంకో నోటిఫికేషన్ ఇవ్వకుంటే.. ఆ సీట్లను ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు ఎక్కువ డబ్బు చెల్లించే స్టూడెంట్లకు అమ్ముకునే చాన్స్‌ ఉంది.

Latest Updates