కల్వకుర్తి ఆయకట్టు కనికట్టేనా

4టీఎంసీలతో 4లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా?

నాగర్​కర్నూల్​, వెలుగు : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 15 టీఎంసీలు కేటాయిస్తే కేవలం 12 టీఎంసీలే వాడుకున్నామని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం  నివేదిక ఇచ్చింది. గణాంకాలను చూస్తే కేటాయించిన నీటి కంటే కేవలం మూడు టీఎంసీలే తక్కువ వాడుకున్నట్లు తెలుస్తోంది. కానీ లోతుగా చూస్తే ఎత్తిపోసిన 12 టీఎంసీల్లో ఎంత నిల్వ చేసుకోగలిగాం అంటే అధికారుల వద్ద దొరికే సమాధానం కేవలం 4 టీఎంసీలు మాత్రమే! అంతకు మించి నిల్వ చేసి, ఒక ప్రణాళిక ప్రకారం సాగునీటిని విడుదల చేస్తే 4 లక్షల ఎకరాల పూర్తిస్థాయి ఆయకట్టు సాగయ్యేది.  ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి కృష్ణానదికి వరద ప్రవాహం ప్రారంభమైనా  కేవలం నాలుగు టీఎంసీల  నీటి నిల్వ సామర్థ్యం గల నాలుగు రిజర్వాయర్లు నింపారు. 713 చెరువులను  నింపినట్లు చెబుతున్నా, వాటి కింద ఏమేర సాగవుతుందో చెప్పలేని పరిస్థితి.

మూడు లిఫ్టుల ద్వారా 3వేల క్యూసెక్కులు.. 

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మూడు ప్రధాన లిఫ్టులు ఎల్లూరు, జొన్నల బొగడ, గుడిపల్లిగట్టు నుంచి ఐదు పంపులు పనిచేస్తే రోజుకు 3వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు. దానికి తగినట్లు ప్రధాన కాలువలను డిజైన్​ చేశారు. నిర్మాణ సమయంలో సిస్టర్న్​ వరకు సరిగ్గానే  ఉన్నా, ప్రధాన కాలువల లోతు, వెడల్పును తగ్గించారు. దీంతో మూడు పంపులకు మించి నడిపించే పరిస్థితి లేదు. నాలుగో పంపు పని చేస్తే కాలువలు తట్టు కోలేని పరిస్థితి.

పిల్ల కాలువలు ఎక్కడ?

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లూరు, జొన్నలబొగడ, సింగోటం, గుడి పల్లి గట్టు రిజర్వాయర్లను ఒక్కో టీఎంసీ సామర్థ్యంతో నిర్మించారు. 20 టీఎంసీలతో 2లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలనేది ఈ పథకం లక్ష్యం. ఆయా ప్రాంతాల రైతుల డిమాండ్​కు అనుగుణంగా  ఆయకట్టును పెంచు కుంటూ పోయారు తప్ప  అందుకు తగినట్లు  బ్రాంచ్​కెనాల్స్​​, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​, సబ్​ మైనర్స్, ఫీడర్​ చానల్స్​ ఏర్పాటు చేయలేదు. పిల్ల కాలువలకు  అవసరమయ్యే భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. దీనితో భూమిని ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు. ఫలితంగా దూర ప్రాంత రైతులు కిలోమీటర్ల కొద్దీ పైపులైన్లు తవ్వి నీటిని తీసుకెళ్తున్నారు. ఇది వారి నడుమ గొడవలకు దారితీస్తోంది.

రిజర్వాయర్లను నిర్మిస్తేనే..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా -28వ ప్యాకేజీ కిందపానగల్​, వీపనగండ్ల మండలాల్లోని రెండు చెరువులను రిజర్వాయర్లుగా మార్చి, 0.393 టీఎంసీలు, 29వ ప్యాకేజీ కింద రేవల్లి, గోపాల్​పేట, పానగల్​, తిమ్మాజీపేట, తాడూరు, మిడ్జిల్​,కల్వకుర్తి, వంగూరు, చార కొండ, వెల్డండ, మాడ్గుల, కోడేరు, ఘణపూర్​ మండలాల్లోని 28 చెరువులను రిజర్వాయర్లుగా మార్చి 13.342 టీఎంసీల నీటిని, -30వ ప్యాకేజీ కింద 12 చెరువులను రిజర్వాయర్లుగా మార్చి 3.463 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని అధికారులు భావించారు. వీటి నిర్మాణం పూర్తయితే 17.198 టీఎంసీల  నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు ప్రణాళిక ప్రకారం నీరు అందించవచ్చు.  ఇందుకు 9042 హెక్టార్ల భూ సేకరణకు, ఇతర పనులకు దాదాపు రూ.2,500 కోట్లు అవు తుందని  అంచనా వేశారు.   గతేడాది బడ్జెట్​ సమావేశాలకు ముందే సర్వే పనులు పూర్తి చేసి  నివేదికలను ప్రభుత్వానికి సమ ర్పించారు.  ఏడాది గడుస్తున్నా అడుగు ముందుకు పడకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అనుకున్నట్లు రిజర్వాయర్లను నిర్మించి, ప్రణాళిక ప్రకారం నీరందిస్తే తప్ప 4లక్షల ఆయకట్టు కు నీరందించే పరిస్థితి లేదు.

అన్నీ కాకిలెక్కలే..

కేవలం ప్రధాన కాలువకు వేసిన మోటర్లు, చెరువుల కింద అరకొరగా సాగవుతున్నప్ప టికీ  ప్రభుత్వం మాత్రం ఆరు నియోజకవర్గాల పరిధిలో 4 లక్షల 20వేల ఎకరాలకు సాగు నీరిస్తున్నట్లు చెబుతోంది. టీఎంసీకి 20వేల ఎకరాల చొప్పున లెక్కలు వేసుకొని సంతృప్తి చెందుతోంది.  713 చిన్నా చితకా చెరువుల్లో  10 టిఎంసిల నీటిని నిల్వ చేయగలుగుతు న్నామని ఉన్నతాధికారులు అంటున్నా, వాస్త వానికి అందులో చాలా చెరువులు వర్షాలకే నిండుతున్నాయి. అదీగాక వారు చెబుతున్న స్థాయిలో నీటిని నిల్వ చేసే సామర్థ్యం సదరు చెరువులకు లేదని మరికొందరు ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్నదానిప్రకారం  కల్వకుర్తి ఎత్తిపోత ల పథ కంలోని మొదటి లిఫ్టు ఎల్లూరు నుంచి 10వేల ఎకరాలకు,  రెండు, మూడు లిఫ్టుల నడుమ ఉన్న ప్రధాన కాలువ ద్వారా 42వేల ఎకరాలకు మొత్తంగా 52వేల ఎకరాలకు నేరు గా సాగునీరు ఇవ్వగలుగుతున్నారు.  మిగిలి నవన్నీ కాకి లెక్కలేనంటే అతిశయోక్తి కాదు.

Latest Updates