డైలాగులు సరే..రజనీ, కమల్ కలుస్తారా?

తమిళనాడులో కాలు పెట్టడానికి జాతీయ పార్టీలేవీ సాహసించవు. అక్కడ పెరియార్​ సిద్ధాంతాలు, అన్నాదురై పొలిటికల్​ అజెండాలే కీలకం. గడచిన యాభై ఏళ్ల నుంచి పెరియార్​, అన్నాల ట్యాగ్​తోనే రాజకీయాలు నడుస్తున్నాయి. అన్నాదురై వారసులుగా ఎంజీఆర్​​, కరుణానిధి చక్రం తిప్పారు. జయలలిత కేవలం ఎంజీఆర్​​ వారసురాలిగా పొలిటికల్​ మైలేజీ పొందారు. కరుణానిధి, జయలలితసహా పాతవాళ్లంతా పోయారు. తమిళనాడులో పొలిటికల్​ వ్యాక్యూమ్​ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.  దీనిని సినీ నటులు రజనీకాంత్​, కమల్​ హాసన్​ ఈ లోటు తీర్చగలరా లేదా అనేది రెండేళ్లుగా సాగుతున్న చర్చ.  తాజాగా వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తారన్న సూచనలు వినిపిస్తున్నా… అంత ఈజీ ఏమీ కాదంటున్నారు ఎనలిస్టులు!

దాదాపు రెండేళ్లుగా తమిళనాడులో రాజకీయంగా లోటు కనిపిస్తోంది. యాంటీ–బ్రాహ్మిన్​, యాంటీ–హిందీ, ప్రొ–ద్రవిడ రాజకీయాలతో ఒకప్పుడు దేశంలోనే పొలిటికల్​ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది ఇక్కడ. వరుసగా జయలలిత, కరుణానిధి లాంటి టాప్​ లీడర్లు కన్నుమూయడంతో వాళ్ల తర్వాత ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ఇండిపెండెన్స్​కి ముందే తమిళ ప్రాంతంలో ద్రవిడ ఉద్యమం రూపుదాల్చింది. ఈ.వి.రామస్వామి నాయకర్​ (పెరియార్​) నాయకత్వంలో ఈ ఉద్యమం తమిళ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. అప్పటి నుంచీ ఆయన గీసిన గీతలోనే తమిళ పాలిటిక్స్​ సాగుతున్నాయి. 1970 తర్వాత పూర్తిగా ఇక్కడ పెరియార్​ సిద్ధాంతాలు, అన్నాదురై పొలిటికల్​ ఎజెండా అమలవుతోంది. ఈ యాభై ఏళ్లలో తమిళనాడు వైపు జాతీయ పార్టీలు కన్నెత్తి చూడాలన్నా ఓటర్లు ఒప్పుకోలేదు. కరుణానిధి, యంజీఆర్​​ల మధ్యే అధికారం మారుతూ వచ్చింది. యంజీఆర్​​ చనిపోయాక ఆయన వారసురాలిగా జయలలిత తెరపైకి వచ్చారు. ఓటర్లు జయ–కరుణలకు అధికారాన్ని మారుస్తూ వచ్చారు తప్ప, మూడో పార్టీని రానివ్వలేదు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. కరుణానిధి వారసుడిగా స్టాలిన్​ వచ్చారు. లోక్​సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో డీఎంకే చూపించిన సత్తా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కంటిన్యూ చేయగలదా? లేదా? అన్నది ఎనలిస్టులు చెప్పలేకపోయారు.

లోక్​సభ ఎన్నికలకు ముందే అక్కడి రాజకీయ లోటును పూడ్చడానికి కాంగ్రెస్​, బీజేపీ ఎన్ని విధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సూపర్​ స్టార్​ రజనీకాంత్​, కమల్​ హాసన్​లు ఒక దశలో ముందుకొచ్చినా ధైర్యం చేయలేకపోయారు. మళ్లీ ఇంతకాలానికి వీళ్లిద్దరూ పొలిటికల్​ సర్కిల్​లోకి వచ్చారు. తాజా న్యూస్​ ఏమిటంటే… రజనీ కమల్​ కలిసికట్టుగా పనిచేస్తారని వినిపిస్తోంది. దానిలో సైతం స్పష్టత లేదన్నది పొలిటికల్​ కామెంటేటర్ల అభిప్రాయం. ‘అవసరమైతే కలుస్తాం. తమిళనా డు అభివృద్ధికి ఒక్కటిగా పనిచేస్తాం’ అని కమల్​ హాసన్​ అని డైలాగ్​. ‘పరిస్థితులు అనుకూలిస్తే తమిళనాడు ప్రజలకోసం తప్పకుండా కలుస్తాను’ అని దీనికి జవాబుగా రజనీకాంత్​ ఓ డైలాగ్​ వేశారు. తమది 44 ఏళ్ల స్నేహమని గుర్తు చేశారు ఇద్దరూ. అయితే, వీళ్ల మాటల్లో ఫోర్స్​ కనబడలేదంటున్నారు తమిళ రాజకీయాలు తెలిసినవాళ్లు.

జనంలోకి వస్తేగానీ చెప్పలేం

కమల్​ హాసన్ అయితే మక్కళ్​ నీది మయ్యమ్​ (ఎంఎన్​ఎం)’ పేరుతో పార్టీ పెట్టి మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క సీటూ గెలవలేదు కానీ, 2 శాతం ఓట్లు సంపాదించుకోగలిగారు. ​ రజనీకాంత్​ మాత్రం ఏడాదికొకసారి తన అభిమానులతో మూడు రోజులపాటు ‘సెల్ఫీ మేళా’ జరుపుతుంటారు. ఆ సమయంలోనే ఎవరికి తోచినట్లుగా వాళ్లు ‘రజనీ పొలిటికల్​ ఎంట్రీ’ గురించి కామెంట్​ చేస్తుంటారని చెబుతారు.

రజనీకాంత్​కి ఫ్యాన్​ ఫాలోయింగ్​ చాలా ఎక్కువ. మరో సినీ నటుడు విజయ్​ కాంత్​కి మాస్​ అప్పీల్​ బాగా ఉంది. వీళ్లతో పోలిస్తే కమల్​ హాసన్​కి అటు ఫ్యాన్స్​, ఇటు మాస్​ ఇద్దరూ అంతగా లేరు. 2016 చివరలో రజనీ–కమల్​ కొంత పొలిటికల్​ హంగామా సృష్టించినా, తర్వాత వాళ్లు సినిమాలకే పరిమితమయ్యారు.

హిట్లు బాగా తగ్గాయ్​

రజనీ కాంత్​, కమల్​ హాసన్​లకు బేస్​ సినిమాలే. 1975 తర్వాత బాలచందర్​ సినిమాలతో వీళ్లిద్దరూ వెలుగులోకి వచ్చారు. అప్పటికి యంజీఆర్​​ పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయి, తమిళనాడు సీఎంగా ఉన్నారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్​, జయశంకర్​ లాంటి టాప్​ హీరోల కాలం చెల్లిపోయింది. అలాంటి సమయంలో వచ్చిన యువకులు రజనీకాంత్​, కమల్​ హాసన్​. కొత్త కథలతో, స్టయిల్​తో, డ్యాన్స్​లు, ఫైట్లతో చాలా తొందరగా ఫ్యాన్​ ఫాలోయింగ్​ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన విజయ్​, అజిత్​ లాంటి కొత్త తరం ముందు రజనీ, కమల్​ వెలవెలబోతున్నారు. గడచిన ఇరవై ఏళ్లుగా చూస్తే ఈ ఇద్దరికీ సరైన హిట్లే లేవని కోలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి.  1996లోని ‘అవ్వయ్‌ షణ్ముఖి (తెలుగులో భామనే సత్యభామనే)’ తర్వాత కమల్‌హసన్‌కి సోలో హిట్‌ కొట్టిన చిత్రం ఒక్క ‘దశావతారం (2008)’ మాత్రమే.  ఈ నడుమ వచ్చిన సినిమాలన్నీ మొదటి వారంలోనే సొమ్ములు చేసేసుకుని వెనక్కి వెళ్లిపోయినవే! ఇటీవల ‘బిగ్‌బాస్‌’ రెండు సీజన్‌ల ద్వారా జనాలకు చేరువైనా మునుపటి ఛార్మ్‌ లేదు. ఆ స్టయిల్‌, డ్యాన్స్‌ వగైరాలన్నీ యువ నటులు అందుకున్నారు.  రజనీ కాంత్​ విషయానికొచ్చినా ‘పడయప్ప (తెలుగులో నరసింహ)’ తర్వాత నిజమైన హిట్​గా చెప్పుకునే సినిమాలు లేవంటారు. మధ్యలో రోబో, శివాజీ బాగా ఆడాయి. ఆ తర్వాత అటువంటి బ్లాక్​బస్టర్లు రాలేదు. కబాలి, కాలా వంటి సినిమాలు వచ్చినా బాగా హైప్​ క్రియేట్​ చేసి సొమ్ము చేసుకుని వెళ్లిపోయినవేనని ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. ద్రవిడ సిద్ధాంతాలను అనుసరించేవాళ్లను ఆదరించడమనేది తమిళ ఓటర్ల నైజం. రజనీకాంత్​ బేసికల్​గా మహారాష్ట్రియన్. అయితే కర్ణాటకలోని బెల్గాంలో వాళ్ల కుటుంబం సెటిల్​ అయ్యింది. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జల వివాదం సాగిన రోజుల్లో ఆయన తమిళనాడును సమర్థించలేదన్నది పెద్ద ఆరోపణ.

అన్నాడీఎంకేని తీసి పారేయలేం

జయలలిత తర్వాత ఎవరు? అనే ప్రశ్న ఎదురైనప్పుడు టక్కున సమాధానం దొరకలేదు. అంత ప్రజాదరణగల నాయకులెవరూ ఆ పార్టీలో కనిపించలేదు. ఈ  లోక్​సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే చావు దెబ్బ తిన్నది. మొత్తం 38 ఎంపీ సీట్లలో కేవలం తేని నియోజకవర్గం తప్ప, మిగతా సీట్లూ యూపీయే తన్నుకుపోయింది. డీఎంకే 23, కాంగ్రెస్​ 8, సీపీఐ, సీపీఎం తలా రెండు సీట్లు గెలుచుకోగా, మిగతా సీట్లు మిత్రపక్షాలు సాధించాయి. దీంతో అన్నాడీఎంకే పని అయిపోయిందనుకున్నారు. కానీ, ఆరు నెలలు గడిచేసరికి రెండు ఎమ్మెల్యే సీట్లకు బైఎలక్షన్​ జరగ్గా, అన్నాడీఎంకే గెలిచింది. వికిరావండిలో 60.29 శాతం ఓట్లు, నంగునేరిలో 55.88 శాతం ఓట్లు అన్నాడీఎంకే సాధించడం పోల్​ ఎనలిస్టులకుసైతం అంతు చిక్కలేదు.

కమల్​ పార్టీకి 2% ఓట్లు

ప్రజలకు న్యాయం చేయడమే తన ధ్యేయమంటూ కిందటేడాది ఫిబ్రవరి 21న ‘మక్కళ్​ నీది మయ్యమ్’ పేరుతో మధురైలో కమల్ హాసన్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పబ్లిక్​ మీటింగ్​కి తమిళనాడు అన్ని ప్రాంతాల నుంచి ఆయన ఫ్యాన్స్​ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామేశ్వరంలో ఉన్న  మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఇంటిని సందర్శించి వచ్చిన తరువాతే కమల్ హసన్ రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు రైతు సంఘ నేత పీఆర్ పాండియన్ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై కమల్​ను అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల ( ఐదు రాష్ట్రాలు, ఒక యూటీ) మధ్య సహకారాన్ని సూచించేలా ఆరు చేతులు, మధ్యలో నక్షత్రంతో  పార్టీ జెండాను కమల్ ఆవిష్కరించారు. ఈ పార్టీకి టార్చ్​ లైట్ ఎలక్షన్ సింబల్​గా వచ్చింది. లేటెస్ట్​గా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కమల్ పార్టీ 36 సీట్లకు పోటీ చేసి, అన్నిటిలో డిపాజిట్లుకూడా కోల్పోయింది. అయితే రెండు శాతం ఓట్లొచ్చాయి.

రజనీ​ పార్టీకి టైముందట!

కమల్ కంటే ముందుగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చాయి. అయితే రేపు..మాపు అంటూ తలైవర్ మాటలు చెప్పారే కానీ, ఇప్పటివరకు పార్టీనే పెట్టలేదు. ముళ్లబాట వంటి రాజకీయ  బాటలో ప్రయాణం చేయడానికి రజనీ వెనకా ముందు ఆడుతున్నారని అంటారు. అందుకే మూడేళ్లుగా వేచి చూసే ధోరణితో ఉన్నారంటారు.

ద్రవిడ ఉద్యమమే మూలం

డీఎంకే, అన్నా డీఎంకే రెండు పార్టీలకు బలమైన బ్యాక్ డ్రాప్ ఉంది. రెండు పార్టీలు ద్రవిడ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చినవే. 1942లో ‘ద్రవిడ కళగం (డీకే)’ అనే సంస్థను పెరియార్ రామస్వామి నాయకర్ ప్రారంభించారు. డీకే సిద్దాంతాలు తమిళనాట అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ బ్యాక్ డ్రాప్​లో పెరియార్​, అన్నాదురై ఆశయాలకనుగుణంగా 1949లో ‘ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)’ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పడింది. డీఎంకే తరఫున కరుణానిధి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1972లో చీలిపోయిన డీఎంకే

1972 నాటికి ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధికి, డీఎంకే ట్రెజరర్​గా ఉన్న యంజీఆర్​​కి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. పార్టీ నుంచి యంజీఆర్​​ని బహిష్కరించారు. దీంతో అన్నా డీఎంకే పేరుతో సొంత పార్టీ పెట్టుకుని యంజీఆర్​ రాజకీయాల్లో కొనసాగారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చివరివరకు డీకే సిద్ధాంతాలకే అన్నా డీఎంకే కట్టుబడి పనిచేసింది.

జనం మనిషి ఎంజీఆర్​​

సినిమా నటుడిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ డీఎంకే రాజకీయాల్లో ఎంజీ రామచంద్రన్ ఉత్సాహంగా పాల్గొనేవారు. సినిమాల్లో పేదలకు సాయం చేసే కేరక్టర్లు ఎక్కువగా వేసేవారు. ప్రతి సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ ఉండేది. సిన్మాల్లో పాత్రలకు తగ్గట్టుగానే నిజ జీవితంలోనూ ఆయన ప్రవర్తించేవారు. ‘రిక్షా కారన్’ సినిమా రిలీజైనప్పుడు చెన్నై సిటీలో రిక్షాపుల్లర్లకు ఆరు వేలకు పైగా రెయిన్ కోట్లు పంచిపెట్టారు. ప్రజలకు పనికొచ్చే ఇలాంటి పనులు ఎన్నో ఆయన చేశారు. సామాన్య ప్రజల కోసం ఎంజీఆర్ ఏ పని తలపెట్టినా  ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేసేవారు. వ్యక్తిగతంగానూ ఎంజీఆర్​కి గుడ్​విల్ ఉండేది. ‘పొయ్యి మీద ఎసరు పడేసి బియ్యం కోసం ఎంజీఆర్​ దగ్గరకు ధీమాగా వెళ్లొచ్చు’ అని అప్పట్లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ కామెంట్ చేశాడంటే ఆయన సాయం చేసే గుణాన్ని అర్థం చేసుకోవచ్చు. బయట ఎవరు కలిసినా ‘భోజనం చేశావా? లేదంటే, మా ఇంటికి వెళ్లి తిని రా’ అనేవారట ఎంజీఆర్​. మంచి మనసున్న బోళామనిషిగా జనం ఆయనను నమ్మారు. డీఎంకే నుంచి బహిష్కరించినా బెదరలేదు. 1972 అక్టోబరు 18న అన్నా డీఎంకే పార్టీ పెట్టారు. ఎంజీఆర్​ ఫ్యాన్ క్లబ్బులే పార్టీ ఆఫీసులుగా మారిపోయాయి. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి సీఎం అయ్యారు. అప్పటి నుంచి 1987లో చనిపోయేంతవరకు ఎమ్జీఆరే సీఎంగా కొనసాగారు.

కరుణ, జయ లేకుండానే…

తమిళనాడు రాజకీయాల్లో మొదటినుంచి ద్రవిడ పార్టీలదే హవా. ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచేది డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్యనే. ఇక్కడ జాతీయ పార్టీల ఉనికి నామమాత్రమే. యంజీఆర్​  చనిపోయాక తమిళనాడు రాజకీయాలను జయలలిత, కరుణానిధి ఇద్దరే శాసించారు. ఆ ఇద్దరూ ఇప్పుడు లేరు. మొట్టమొదటిసారిగా వారిద్దరు లేకుండానే 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నా డీఎంకే తరఫున పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఆయనకు ప్రజల్లో పెద్దగా పరపతి లేదన్నది ఎనలిస్టుల అంచనా. కరుణానిధి కన్నుమూశాక డీఎంకేపై ఆయన కొడుకు స్టాలిన్​కి లీడర్​షిప్​ దక్కింది. తండ్రి స్థాయిలో కాకపోయినా  ప్రజల్లో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే టోటల్​గా తమిళ రాజకీయాల్లో రాజకీయ లోటు ఏర్పడిందన్నది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట.

స్టాలినే కావాలన్నారన్న సర్వే

డీఎంకే, అన్నా డీఎంకే ఉన్న సిద్దాంత బలం స్టార్లు కమల్, రజనీలకు ఉందా అనే ప్రశ్న ఇప్పుడు తెరమీదకు వస్తోంది. ఇద్దరు నటులు సినిమా రంగంలో 40 ఏళ్లపాటు కొనసాగి అనేక విజయాలు సాధించిన విషయాన్ని ఎవరూ కాదనరు. అయితే ఎంజీఆర్​ లాగా ప్రజలతో మమేకమైన సందర్భాలు ఏమీ లేవు. తుఫాన్ల వంటి ప్రకృతి బీభత్సాలు వచ్చినప్పుడుకూడా జనం కోసం జోలె పట్టిన దాఖలా లేదు. సినీ ఆర్టిస్టులుగా అభిమానించడం వేరు, నాయకులుగా ఆరాధించడం వేరు. ఏ సెలబ్రిటీకి ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉన్నదన్న విషయమై కిందటేడాది జరిగిన ఓ సర్వేలో కమల్, రజనీ ఇద్దరికీ పూర్ రేటింగ్ వచ్చింది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ బెటర్ అని 41 శాతం మంది అంటే, ఎనిమిది శాతం కమల్​కి జై కొట్టారు. రజనీకాంత్​ను కేవలం ఆరు శాతం మంది బలపరిచారు. ప్రజాభిమానంలో ఈ ఇద్దరు వెండితెర వేల్పుల కంటే స్టాలిన్ చాలా ముందున్నారు.

ఫిలిం​ నుంచి జనంలోకి…

తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.ఎంతో మంది సినిమారంగ ప్రముఖులు పాలిటిక్స్ లోనూ తమ దైన మార్క్ వేశారు. ఎమ్జీ రామచంద్రన్​కు సమకాలికుడైన శివాజీ గణేశన్ కు  కూడా రాజకీయాలతో సంబంధాలున్నాయి. కొంతకాలం తరువాత డీఎంకేతో కలిసి నడిచిన శివాజీ ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తరువాత ‘తమిళ మున్నేట్ర మున్నయ్’ అనే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తమిళ రాజకీయాల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఎంజీఆర్ ​ ప్రోత్సాహంతో నటి జయలలిత 1982 లో  అన్నా డీఎంకేలో చేరారు. తరువాత పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అటు డీఎంకే అధినేత కరుణానిధిని అటు సొంత పార్టీలోని ప్రత్యర్థులను ఎదుర్కొంటూ అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టారు.  1991లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అన్నా డీఎంకే ఓసారి ఓడిపోతే మరోసారి గెలిచేది. అయినా జయ అధైర్య పడలేదు.  దాదాపు పాతికేళ్ల పాటు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎంజీఆర్, కరుణానిధి తరువాత తమిళనాడు రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది జయలలితే. కెప్టెన్ గా పాపులరైన హీరో విజయకాంత్ కు డీఎండీకే పేరుతో సొంత పార్టీ ఉంది. 2011నుంచి 16వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కొనసాగారు. మరో నటుడు శరత్ కుమార్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. కొంతకాలం డీఎంకేలోనూ ఆ తరువాత అన్నా డీఎంకేలోనూ పనిచేశారు. 2007లో ‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి’ (ఏఐఎస్ఎంకే) ఏర్పాటు చేశారు. ఆర్టిస్టు నెపోలియన్ బీజేపీలో చురుకుగా ఉన్నారు. వీరే కాదు ప్రజల్లో కాస్తంత ఫాలోయింగ్ ఉన్న అనేక మంది ఆర్టిస్టులు ప్రత్యక్షంగా పాలిటిక్స్ లో లేకపోయినా ఏదో ఒక పార్టీకి దగ్గరగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రచారం వరకు పరిమితమవుతుంటారు.

పోటీ గట్టిగానే ఉంది

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా గడువుంది. ఈలోగా రజనీకాంత్​, కమల్​ హాసన్​ గట్టి హిట్లు రెండు కొడితే…మొత్తం రాజకీయం మారిపోతుందని కోలీవుడ్​ వర్గాలంటున్నాయి. మరోపక్క పక్కామాస్​ హీరోలైన అజిత్​, విజయ్​లుకూడా పొలిటికల్​ ఎంట్రీ కోసం కాచుకుని ఉన్నారు. యువత ఇప్పుడు ఎటు ఉంటుందన్నదికూడా ఆలోచించాలంటున్నారు ఎనలిస్టులు. కరుణానిధి వారసత్వంతో ఆయన కొడుకు స్టాలిన్​, మనవడు ఉదయనిధి తమిళ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. డీఎంకే క్యాడర్​ బేస్​ చాలా బలమైంది కావడంతో, పాప్యులిస్టు స్కీమ్​లను నమ్ముకుంటే చాలు. రజనీ, కమల్​ హాసన్​లకు మంచి స్కీమ్​లతోపాటు తమ ఫ్యాన్స్​ని క్యాడర్​గా మార్చుకోగల పొలిటికల్​ వ్యూహంకూడా కావాలి. ఈ లెక్కలన్నీ ఒక కొలిక్కి రావడానికి ఇంకా 20 నెలల గడువుంది.

Latest Updates