వదలని రేసిజం: కమలా హ్యారిస్ కు వేధింపులు

వాషింగ్టన్: తొలి ఇండియన్ అమెరికన్ సెనేటర్, డెమోక్రాట్ నాయకురాలు కమలా హ్యారిస్ సోషల్ మీడియాలో రేసిజానికి గురవుతున్నారు.  అమెరికాలో పుట్టిన 54 ఏళ్ల కమలా హ్యారిస్ తల్లి ఇండియన్, తండ్రి జమైకన్. కాలిఫోర్నియా నుంచి సెనేటర్ గా ఎన్నికయ్యారు. 2020లో  అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఆమెపై కొందరు రిపబ్లికన్లు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఆమె అమెరికన్ బ్లాక్ కాదని, ఆమె సగం ఇండియన్, సగం జమైకన్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గతంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై జరిగిన “బర్తరిజం” లాంటి దాడి ఆమెపై జరుగుతున్నట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. ఒబామా యూఎస్ సిటిజన్ కాదని, ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో పోటీకి అనర్హుడని “బర్తరిజం” పేరుతో డోనాల్డ్ ట్రంప్ తోపాటు రిపబ్లికన్లు ప్రచారం చేశారు. ప్రస్తుతం కమలా హ్యారిస్ పై గురిపెట్టిన రిపబ్లికన్లు..  అమెరికన్ బ్లాక్స్ పేరుతో అవకాశాల్ని కొందరు దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. కమలా హ్యారిస్ పై జాతి వివక్ష ట్వీట్ ను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ రీట్వీట్ చేశారు. ఇది నిజమా అని కామెంట్ చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. 2020లో జరిగే అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల కోసం ఆమె జనవరిలోనే ప్రచారం మొదలుపెట్టారు.

Latest Updates