కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బాలయ్య మృతి

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బి. బాలయ్య(89) అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్ లో తుదిశ్యాస విడిచారు. బాలయ్య సారు మృతి పట్ల రాష్ట్రనాయకులు సంతాపం వ్యక్తం చేశారు.  నిరాడంబరం, నిస్వార్థం, నిజాయితీకి మారుపేరుగా ఆయన జీవనశైలి ఉండేదని అన్నారు.

బ్రాహ్మణపల్లి బాగయ్య, బాలమ్మ దంపతులకు 1930 లో బాలయ్య జన్మించారు. ఆయనకు భార్య, నలుగురు, కుమారులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు .పెద్ద కుమారుడు బాలకిషన్ నిమ్స్ వైద్యశాలలో డాక్టర్ గా పనిచేస్తుండగా, రెండవ కుమారుడు చిన్న బాలకిషన్ సంక్షేమ శాఖలో పని చేస్తున్నారు. మూడవ కుమారుడు బాలకృష్ణ కామారెడ్డి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండగా చిన్న కుమారుడు సుభాష్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.

నిజాయితీ నేతగా..
స్వతంత్ర సమరయోధులుగా, తొలి దశ తెలంగాణ ఉద్యమకారునిగా పేరు తెచ్చుకొని ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సమాజ సేవలో నిమగ్నం అయ్యేవారు. బడుగు బలహీన వర్గమైన గంగ పుత్ర కులంలో జన్మించిన ఆయన సంఘం అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించి సంఘం బాలయ్య గా పేరుతెచ్చుకున్నారు.1963 మంచి 78 వరకు కామారెడ్డి గ్రామ వార్డు సభ్యునిగా ఉప సర్పంచ్ గా పని చేశారు. చిన్నప్పటినుంచి ఉర్దూ భాషను అభ్యసించిన ఆయన ఉర్దు ఉపాధ్యాయునిగా పని చేశారు. ఉర్దూ కవిత్వాలను కూడా రాసేవారు. రాత్రి రాత్రిపూట పాఠశాలలను నడిపించి పేద పిల్లలకు చదువు చెప్పేవారు.

10 వేల ఖర్చు తో ఎమ్మెల్యే..
ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ 1978లో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పట్లో నియోజకవర్గంలో మొత్తం 9 6,124 ఓట్లు ఉండగా 64 వేల 611 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో బాలయ్యకు 27 వేల 5 42 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఎడ్ల రాజరెడ్డి కి 21 ,866 ఓట్లు వచ్చాయి. 5676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన బాలయ్య ఎమ్మెల్యేగా ఐదేళ్లు పని చేశారు. కేవలం పదివేల రూపాయల ఖర్చుతో ఆయన అప్పట్లో ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యేగా ఆయన హయాంలో రోడ్లు ,మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రమైన కామాడ్డి పట్టణంలో వ్యాపార అభివృద్ధికి కృషి చేశారు. సహాయం కోరి ఎవరు వెళ్ళినా తన వంతు సహకారం అందించే వారు.

ఇందిరమ్మ మెచ్చిన నేత..
తెలిసినవారు , స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన విరాళాలతో ప్రచారం చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. అతి తక్కువ ఖర్చుతో ఎమ్మెల్యేగా గెలిచి సమాజ సేవకునిగా, నిజాయితీ నాయకునిగా పేరు తెచ్చుకున్న బాలయ్యను అప్పటి దేశ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారు స్వయంగా సంతకం చేసి లేఖ ద్వారా అభినందించడం విశేషం.

Latest Updates