మీ ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది.. సోనియాపై కంగనా అటాక్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్-మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ విషయం ముగిసిపోయినట్లు తాము భావిస్తున్నామని శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ చెబుతుండగా.. మరోవైపు సోనియా గాంధీపై కంగనా విమర్శలు గుప్పించింది. మీ ప్రభుత్వం మహిళలను వేధిస్తోందంటూ సోనియాను టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేసింది. ‘గౌరవనీయులైన కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీజీ మహారాష్ట్రలోని మీ సర్కార్ నాతో వ్యవహరించిన తీరుకు మీకు వేదన కలగడం లేదా? డాక్టర్ అంబేడ్కర్ మాకు కల్పించిన రాజ్యాంగ సూత్రాలను సమర్థించమని మీ ప్రభుత్వాన్ని మీరు కోరలేరా? మీరు పశ్చిమాన పెరిగి ఇండియాలో జీవిస్తున్నారు. మహిళల కష్టాలు మీకు తెలిసి ఉండొచ్చు. మీ సొంత ప్రభుత్వమే మహిళలను వేధిస్తూ, శాంతిభద్రతలను పూర్తిగా అపహాస్యం చేస్తున్న ఈ సమయంలో మీ మౌనం, ఉదాసీనతను చరిత్ర నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని కంగనా ట్వీట్ చేసింది.

నా కూతురుకు ప్రాణహాని ఉంది
ముంబైలో తన కూతురుకు ప్రాణాపాయం ఉందని కంగనా తల్లి ఆశా రనౌత్ అన్నారు. ‘కంగనా నా కూతురు. సంజయ్ రౌత్ కంగనా గురించి అలా ఎలా మాట్లాడతారు? కంగనా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తను మహారాష్ట్రలోనే ఉంటుంది. దాదాపు 15 ఏళ్లుగా తన ఇక్కడే ఉంటోంది. మహారాష్ట్ర అందరి కోసం ఉంది. నా కూతురును రక్షించిన అమిత్ షా, ప్రధాని మోడీకి మప్పిదాలు. నా కూతురుకు మొత్తం దేశం అండగా ఉంది. ఈ అన్యాయం ఎందుకు? ఇది బాల్ ఠాక్రే శివ సేన కాదు. ఇప్పుడీ పార్టీ పిరికిగా మారిపోయింది. ఇది అసలు ఎలాంటి ప్రభుత్వం?’ అని ఆశా రనౌత్ చెప్పారు.

Latest Updates