శశికళ పాత్రకు పూర్ణ ఫిక్స్

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఇంతవరకు బ్రేక్‌‌ రాలేదు పూర్ణకి. త్వరలో రావొచ్చు అంటోంది. ఎందుకంటే ఓ చాలెంజింగ్‌‌ రోల్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. తమిళనాడు  దివంగత ముఖ్యమంత్రి  జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌‌ విజయ్‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’.  జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌‌,  ఎంజీఆర్‌‌ పాత్రలో అరవింద్‌‌స్వామి నటిస్తున్నారు.  ఇటీవల వీరి పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జయలలితగా  కంగనా యాప్ట్ అని కొందరు అంటే, అస్సలు సెట్‌‌ కాలేదు అనే విమర్శలూ వస్తున్నాయి. ఆమె సంగతి ఎలా ఉన్నా.. ఎంజీఆర్ పాత్రలో మాత్రం అరవింద్‌‌స్వామి అచ్చుగుద్దినట్టు సరిపోయారని ప్రశంసలు అందుకున్నాడు. ఇక జయ జీవితంలో అత్యంత ముఖ్యమైనవారు మరో ఇద్దరున్నారు. శశికళ, శోభన్‌‌బాబు. అశ్వథ్థామ, భీష్మ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేసిన బెంగాలీ నటుడు జిషుసేన్‌‌ గుప్తాను శోభన్‌‌ పాత్ర వరించిందనే ప్రచారం జరుగుతోంది.

ఇక శశికళగా ఎవరు నటిస్తారు అనేది చర్చనీయాంశమయ్యింది. ప్రియమణిని తీసుకోవడంతో ఆమెనే ఆ పాత్ర వరించిందని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. శశికళ పాత్ర చేస్తున్న నటి.. పూర్ణ. తాజాగా  ఈ చిత్రంలో  శశికళ పాత్రలో  పూర్ణ నటిస్తున్నట్టు  చిత్రయూనిట్ ప్రకటించింది.   జయలలిత బయోపిక్‌‌లో నటిస్తుండటం ఆనందంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేయడంతో ఈ విషయం బైటికొచ్చింది. కరుణానిధిగా ప్రకాష్‌‌రాజ్, జానకీ రామచంద్రన్‌‌గా మధుబాల, ఆర్‌‌ఎం వీరప్పన్‌‌ పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ట్రైలర్‌‌‌‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ ప్రామిసింగ్ రోల్‌‌తో అయినా పూర్ణ కెరీర్‌‌‌‌ మలుపు తిరుగుతుందేమో చూడాలి.

Latest Updates