బాబు తప్పు చేయకుంటే బ్లాక్ మెయిలింగ్ ఎందుకు?

Kanna Lakshmi narayana fires on AP CM Chandrababu over Data theft case
  • డేటా చోరీ కేసులో టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు
  • పక్క రాష్ట్రంలో చిన్న కేసుపై చంద్రబాబు సిట్ ఎందుకేశారు
  • ఓటుకు కోట్లు కేసులాగే ఆయన తీరు: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

తిరుపతి: డేటా చోరీ కేసు విషయంలో టీడీపీ నేతలంతా భుజాలు తడుముకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. శనివారం తిరుపతిలో కన్నా మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరమని అన్నారు. అయినా, డేటా చోరీ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న టీడీపీ నేతలు భుజాలెందుకు తడుముకొంటున్నారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలో నమోదైన చిన్న కేసు విషయమై ఏపీలో సిట్‌ ఎందుకు వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. డేటా చోరీ కేసుతో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని, ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బ్లాక్‌మెయిల్‌కు దిగుతోందని అన్నారు.

2017 నుంచి ఏపీలోకి తెలంగాణ ఓట్లు

రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని గొంతు చించుకుంటున్న టీడీపీ పరువు నష్టం దావా ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు.  తెలంగాణలో ఉన్న ఓట్లను ఏపీలో చేర్చే ప్రక్రియకు 2017 నుంచే టీడీపీ పూనుకుందని కన్నా ఆరోపించారు. ఏ గడ్డి తిని అయినా తిరిగి అధికారంలోకి రావాలని బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫామ్‌-7 దాఖలు చేస్తే టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం తీరు చూస్తే డేటా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే  చంద్రబాబు తీరు ఉందని అన్నారు.

సిట్ నివేదిక వస్తే సీఈసీ చర్యలు

ఓటర్ల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. డేటా చోరీపై నియమించిన మూడు సిట్‌ల నివేదిలక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపిందని స్పష్టం చేశారు.

బీజేపీ బస్సు యాత్ర

ఈ నెల 13న బీజేపీ బస్సుయాత్ర విజయనగరంలో ప్రారంభమై 21న కడపలో ముగుస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.

Latest Updates