ముఖ్యమంత్రులే భయపడ్డ ఈ విగ్రహం ఎవరిది..?

చెన్నై మెరీనా బీచ్​కి ఎప్పుడైనా వెళ్లారా? వెళ్లి ఉంటే కనుక అక్కడ ఉన్న శిల్పాలు గుర్తుండే ఉంటాయి. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్నట్టే మెరీనా బీచ్ ఎంట్రన్స్​లో కూడా కొన్ని శిల్పాలు వరుసగా నిలబెట్టి ఉంటాయి. అందులో ఒక విగ్రహం మాత్రం స్పెషల్​గా కనిపిస్తుంది. ఒక చేతిలో కాళ్ళకి వేసుకునే కడియం పట్టుకొని, రెండో చేతితో ఎవరినో ప్రశ్నిస్తున్నట్టు నిలబడ్డ ఒక స్త్రీ విగ్రహం. మామూలుగా ఒక విగ్రహాన్ని చూస్తున్నట్టు ఉండదు. ఆమె మన ఎదురుగా నిలబడ్డట్టే అనిపిస్తుంది. కోపంతో రగిలిపోతూ, విరబోసుకున్న జుట్టుతో ధిక్కారంగా నిలబడ్డ ఆ విగ్రహం నుంచి చూపు తిప్పుకోవటం కుదరదు… ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది?

ఆ విగ్రహం ఇంతకు ముందు తమిళనాడు అసెంబ్లీ ఎదురుగా ఉండేది. తర్వాత ‘‘ట్రాఫిక్​కి ఇబ్బందిగా ఉంది’’ అంటూ ఆ శిల్పాన్ని అక్కడి నుంచి తీసేశారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ మెరీనా బీచ్ ఒడ్డున నిలబెట్టారు. 2001 డిసెంబర్​లో ఆ విగ్రహం తొలగించినప్పుడు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారం చేజారిపోతుందేమో అన్న భయంతోనే ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ముందునుంచి జయలలితే తీసేయించారనే రూమర్ ఇప్పటికీ వినిపిస్తుంది. అంతకుముందు కరుణానిధి ఉన్నప్పుడు కూడా కొన్నాళ్ళు ఆ విగ్రహానికి ఎదురుగా వెళ్ళకుండా ఇంకో దారినుంచి అసెంబ్లీలోకి వెళ్లేవారట. జీవితాంతం నాస్తికుడిగా, ఎలాంటి సెంటిమెంట్లూ లేకుండా బతికిన కరుణానిధి కూడా ఆ విగ్రహానికి ఎదురు వెళ్లేందుకు భయపడే అంత ఏముంది? ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది? ఎందుకని ఆ శిల్పానికి ఎదురు వెళ్లటానికి ముఖ్యమంత్రులు కూడా భయపడ్దారు??

ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఒకసారి తమిళ నాడు చరిత్రనీ, తమిళ సాహిత్యాన్ని చూడాలి. చోళుల పరిపాలనా కాలానికి వెళ్లాలి. ఒక తప్పుడు తీర్పు కారణంగా, చేయని నేరానికి తన భర్తని కోల్పోయిన కణ్ణగి కోపానికి మధురై నగరం మంటల్లో చిక్కుకుంటుంది. ఆమె చూపుల్లో కనిపించిన కోపానికి ఆ మహారాజు గుండె బద్దలై చనిపోతాడు. అందుకే కణ్ణగి అంటే ముఖ్యమంత్రులకి భయం. కణ్ణగి విగ్రహానికి ఎదురు వెళ్లాలన్నా భయం.
ఎవరీ కణ్ణగి?
తమిళ పంచకావ్యాలలో ఒకటైన ‘‘శిలప్పధిగారం’’ అనే కావ్యంలో కణ్ణగి కథ ఉంటుంది. తమిళ మహాకవి ఇళంగో వడిగళ్ క్రీ.శ. రెండవ శతాబ్దంలో రాసిన కావ్యమే ఈ ‘‘శిలప్పధిగారం’’. ఆ కథ ప్రకారం అంతగా అందరూ భయపడుతున్న కణ్ణగి వీర వనిత కాదు. యుద్ధాలు చేసి పాలకులనీ భయపెట్టలేదు. సాధారణ గృహిణి. చోళులలో గొప్ప రాజుగా చెప్పబడే కరికాళ చోళుని కాలంలో పుహార్ పట్టణంలో ఉండే ఒక వ్యాపారస్తుని కూతురు. కోవలన్ అనే మరో వ్యాపారస్తుని భార్య. ఆమెకి ఇల్లే ప్రపంచం. పుహార్ నగరంలోనే వ్యాపారం చేసే కోవలన్, మాధవి అనే నర్తకిని ఇష్టపడతాడు. ఆ తరువాత వ్యాపారాన్ని, ఇంటినీ వదిలేసి ఆమె దగ్గరే ఉండి పోతాడు. ఒక్కొక్కటిగా తన ఆస్తులన్నీ ఆమెకే ధార పోస్తాడు. మొత్తం ఆస్తులతో పాటు చివరికి కణ్ణగి ఒంటి మీది నగలతో సహా మాధవికే ఇచ్చేస్తాడు. కూతురు పుట్టేనాటికే తన దగ్గరున్న ఆస్తులన్నింటినీ మాధవికి ఇచ్చేశాడు కోవలన్. అయినా కణ్ణగి మాత్రం భర్తకి ఎదురు చెప్పదు. అతను చేసే ఏ పనినీ వద్దని అనదు. భర్త మారతాడని ఎదురు చూస్తూనే ఉండేది. మాధవితో ప్రేమలో ఉన్న కోవలన్​కు మాత్రం ఇవేవీ పట్టలేదు. ఎప్పుడైతే కోవలన్ దగ్గర ఆస్తులన్నీ అయిపోయాయని మాధవి తల్లికి అర్థమైందో… ఎలాగైనా అతన్ని వదిలించుకొమ్మని కూతురుకి చెప్పింది. అయితే మాధవి కూడా కోవలన్​ని ఇష్టపడటం వల్ల, అతడ్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు. ఆస్తులన్నీ పోయాక అయినా భర్త ఇంటికి వస్తాడు అనుకున్న కణ్ణగికి ఉన్న ఆ ఒక్క ఆశ కూడా పోయింది. అయినా కోవలన్​ మీద ప్రేమ మాత్రం తగ్గలేదు. అతన్నే ప్రేమిస్తూ ఏనాటికైనా అతను మళ్ళీ తన దగ్గరికే వస్తాడని ఎదురు చూసింది.
కడియం అమ్మబోతే…
కొన్నాళ్లకి మాధవి, కోవలన్​ల మధ్య గొడవ జరిగి, తన ఇంటినీ, భార్యనీ కష్టపెట్టాడనే విషయం అర్థమవుతుంది. కణ్ణగి దగ్గరికి వచ్చి ఏడుస్తున్న కోవలన్​ని చూసి, ‘‘మాధవికి బహుమతిగా ఇవ్వటానికి ఇదే మిగిలింది. దీన్ని తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వమ’’ని తన కాలికి ఉన్న బంగారు కడియాన్ని ఇస్తుంది కణ్ణగి. ఆ మాటకి సిగ్గుతో చితికిపోయిన కోవలన్ ‘‘ఈ కాలి కడియాలతోనే మళ్ళీ వ్యాపారం చేసి పోయినవన్నీ మళ్ళీ సంపాదిస్తాను’’ అంటూ మధురై నగరానికి కణ్ణగిని తీసుకొని బయల్దేరతాడు. అయితే మాధవి మళ్ళీ వస్తుంది. కోవలన్​ని రమ్మని కబురు కూడా పంపుతుంది. కానీ, ఈసారి భార్యని విడిచిపెట్టి వెళ్ళడు. ఇద్దరూ మధురై పట్టణానికి చేరుకుంటారు. అక్కడే ఒక జైన సన్యాసిని ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంటాడు. కణ్ణగి ఇచ్చిన కడియాన్ని అమ్మి వ్యాపారం చేయాలని ఒక నగల వ్యాపారి దగ్గరికి పోతాడు. సరిగ్గా అప్పుడే… మధురై రాజ్యానికి రాజైన నెడుంజెళియన్ భార్య కడియం చోరీ అవుతుంది. అది కోవలన్ దగ్గర ఉన్న కడియంలాగే ఉంటుంది. దాంతో ఆ నగల వ్యాపారి రాజభటులకి ఫిర్యాదు చేస్తాడు. దొంగ దొరికాడనే మాటవినగానే నెడుంజెళియన్ మహారాజు దొంగని చంపేయమని ఆదేశిస్తాడు. రాజు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఏ విచారణా లేకుండానే కోవలన్ తల నరికేస్తారు సైనికులు.
విచారణ జరపకుండానే…
గుడిలో పూజకి వెళ్లి వస్తుండగా కణ్ణగికి తన భర్తని చంపేశారన్న వార్త తెలుస్తుంది. భర్తకోసం అన్ని రోజులు తపించి… చివరికి అతను మారి తన దగ్గరికి వచ్చాక అతను చనిపోవటం కణ్ణగి తట్టుకోలేకపోతుంది. ఆమె కాలికి ఉన్న రెండో కడియాన్ని తీసుకుని కోపంతో రగిలిపోతూ రాజభవనానికి వెళ్తుంది. ‘‘ఒక స్ర్తీ ఏడుస్తూ మిమ్మల్ని చూడాలంటోంది’’ అని భటులు రాజుకు చెప్తారు. ఆమెని తీసుకు రమ్మంటాడు నెడుంజెళియన్ మహారాజు. కోపంతో వచ్చే కణ్ణగి రూపాన్ని చూడగానే ఏదో తప్పు జరిగిందని అర్థమైపోయింది నెడుంజెళియన్​కు.  ‘‘తల్లీ, నీకేం కష్టం వచ్చింది?’’ అడుగుతాడు. ‘‘నా భర్తని, నువ్వు అన్యాయంగా చంపించావ’’ని మహారాజునే ఎదిరించి మాట్లాడుతున్న కణ్ణగి కోపం అక్కడున్న అందరిలోనూ భయం కలిగిస్తుంది. ‘‘నీ భర్త దొంగతనం చేశాడు. నా భార్య కాలి కడియం అతని దగ్గర దొరికింది. అందుకే అతనికి మరణ శిక్ష వేశాన’’ని చెప్తున్న మహారాజుకి తన చేతిలో ఉన్న రెండో కడియాన్ని చూపిస్తుంది కణ్ణగి. ‘‘విచారణే జరపకుండా శిక్ష విధించిన నువ్వు, మహారాజువా?’’ అని నిలదీస్తుంది. అప్పుడు రాణి దగ్గర ఉన్న రెండో కడియాన్ని కణ్ణగి దగ్గర, కోవలన్ దగ్గర ఉన్న కడియాన్ని కలిపి చూస్తే రెండూ వేరని అర్థం అవుతుంది. తప్పుడు తీర్పు ఇచ్చిన బాధతో నెడుంజెళియన్ గుండె పగిలి చనిపోతాడు. అతన్ని చూసిన రాణి కొప్పెరుందేవి కూడా భర్తతో పాటే అక్కడే చనిపోతుంది. అయినా కణ్ణగి కోపం చల్లారలేదు. అన్యాయంగా ఒక మనిషిని చంపిన ఆ రాజ్యం మంటల్లో కాలిపోవాలని శపిస్తుంది. తగలబడిపోతున్న మధురై నగరాన్ని కాపాడుకోవటానికి సాక్షాత్తూ మధురమీనాక్షి అమ్మ ప్రత్యక్షమై… ‘‘నీ కోపాన్ని తగ్గించుకో. స్వర్గంలో నీ భర్తని కలుస్తావ’’ని చెబుతుంది. చెప్పినట్టుగానే ఆమె స్వర్గానికి పోతుంది. ఇదీ కణ్ణగి కథ.

విచారణ జరపకుండానే…
ఫిక్షన్ కథగానే ఉన్నా… చరిత్రలో కూడా కణ్ణగి నిజంగానే ఉందని నమ్ముతారు చాలామంది. తప్పు చేసిన వాడు రాజైనా అతన్ని ఎదిరించాలనే చెప్పిన కణ్ణగిని పూజిస్తుంటారు తమిళ ప్రజలు. తమిళనాడులోనే కాదు, శ్రీలంకలో కూడా ‘కణ్ణగి అమ్మాళ్’ పేరుతో పూజిస్తారు. అందుకే మహారాజుని ఎదిరించిన కణ్ణగి విగ్రహాన్ని చూస్తే ముఖ్యమంత్రులకీ భయంగానే ఉండేదట. పెద్ద పెద్ద స్కాములు జరిగిన ప్రతీసారీ ప్రభుత్వాలు క్రైసిస్ లో పడటం, కణ్ణగి విగ్రహానికి ఎదురుగా వెళ్తే తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయం అనే ప్రచారం జరగటం వల్లనే… ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో ఆమె విగ్రహాన్ని జయలలితే తీసేయించారనీ అంటారు. ఇందులో నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు. 2001లో చెన్నైలో అసెంబ్లీ ముందున్న
కణ్ణగి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేశాక మళ్లీ 2006 లో మెరీనా బీచ్ దగ్గర నిలబెట్టా రు. ఎప్పుడైనా చెన్నై వెళ్తే మెరీనా బీచ్ లో ఉన్న కణ్ణగి విగ్రహాన్ని చూడటం మర్చిపోవద్దు. ‘‘తప్పు చేసింది ఎంత పెద్దవాళ్లైనా… వాళ్లని ఎదిరించాల్సిందే’’ అని చెప్పిన కణ్ణగి మాటలనీ మర్చి పోవద్దు.