మనీ కోసం క్రికెట్ ఆడదామన్న షోయబ్ అక్తర్‌కు కపిల్ దేవ్ కౌంటర్…

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. బుధవారం మీడియాతో మాట్లాడిన అక్తర్ కరోనాపై పోరాడటానికి భారత్ – పాకిస్తాన్‌లు కలిసి నిధులు సేకరించుకోవాలని అన్నారు. ఇందుకు ఇరు దేశాలు క్లోస్డ్ స్టేడియంలో ట్రైసిరీస్ ఆడాలని కోరారు. ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందించారు. భారత్ కు నిధులు సేకరించేంత పరిస్థితులు ఎదురవ్వలేదని … తమ వద్ద కరోనాను ఎదుర్కోవడానికి తగినంత ధనం ఉందని తెలిపారు. భారత్ తనను తాను రక్షించుకోవడమే కాకుండా అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలకు సహాయం చేసేంత ఎదిగిందని చెప్పారు. భారత సంసృతిలో ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉందని అది భారత్ గొప్పదనం అని అన్నారు. అయితే తమదేశం  ఇప్పుడు తన వనరులను అధికారులను సమర్థవంతంగా ఉపయోగించుకునే పనిలో బిజీగా ఉందని చెప్పారు.

ప్రస్తుతమున్న పరిస్థితులలో షోయబ్ అక్తర్ క్రికెట్ గురించి మరిచిపోయి తన దేశ ప్రజలకు ఎలా సేవచేయాలో ఆలోచించాలని కపిల్ దేవ్ సూచించారు. వైద్యం, తినడానికి తిండి లేని వాళ్లను ముందు ఆదుకోండని అన్నారు. అయితే ఇంకో ఆరు నెలలు భారత్ క్రికెట్ గురించి ఆలోచించదని చెప్పారు. తమకు ఆట కన్నా జట్టు సభ్యులే ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం అందరూ లాక్ డౌన్ ను పాటిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో కరోనా విలయతాండవం ఆడుతున్నప్పుడు వేరే దేశాలను భారత్ ఆదుకుంటుండటం చూసి తాను భారతీయుడినైనందుకు గర్వపడుతున్నానని చెప్పారు.

Latest Updates