కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు : 4నెలల చిన్నారిని ఖననం చేసిన అధికారి

కరోనా కన్నా రాక్షసంగా తయారవుతున్నారు మనుషులు. నాలుగు నెలల బాలుడు డయేరియాతో మరణిస్తే..కరోనా సోకి మరణించాడంటూ అంత్యక్రియులు జరిపేందుకు ఎవరు ముందుకు రాలేదు. 24గంటల తరువాత ఓ అధికారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

రాజస్థాన్  భిల్వారా జిల్లా చవాంఢీ గ్రామానికి చెందిన సురేశ్ కుమావత్ కుటుంబం ముంబైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పనిలేక పోవడంతో సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వ గ్రామమైన చవాంఢీ కి తిరిగి వచ్చారు. అలా తిరిగి వచ్చిన సురేశ్ కుటుంబ సభ్యులకు అధికారులు కరోనా టెస్ట్ లు చేశారు. కరోనా టెస్ట్ ల్లో తండ్రి సురేశ్ కు కరోనా సోకగా అతని నాలుగు నెలల పసికందుకు డయేరియాతో అనారోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సురేశ్ ను కరోనా వార్డ్ ఉన్న ఆస్పత్రికి..చిన్నారిని చిల్డ్రన్స్ ఆస్పత్రికి,   కుటుంబసభ్యుల్ని హోం క్వారంటైన్ కు తలించారు. అయితే డయేరియాతో ఆరోగ్యం విషమించడంతో  పసికందు మరణించాడు. దీంతో ఆస్పత్రికి సిబ్బంది చిన్నారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే చిన్నారికి అంత్యక్రియలు చేసేందుకు చవాంఢీ గ్రామస్తులు అంగీకరించలేదు. చిన్నారికి కరోనా సోకింది అంటూ తిరస్కరించారు. కుటుంబసభ్యుల్ని సైతం అంత్యక్రియలు జరపడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు.

ఈ నేపథ్యంలో చిన్నారికి అంత్యక్రియలు చేయడం లేదని సమాచారం అందుకున్న సబ్ డివిజనల్ ఆఫీసర్ మనిపాల్ సింగ్ చవాండీ గ్రామానికి వెళ్లారు. చిన్నారికి కరోనా సోకలేదని, డయేరియాతో మరణించాడని గ్రామస్తుల్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఊరి గ్రామస్తులు చిన్నారికి అంత్యక్రియలు చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మనిపాల్ సింగ్ పసికందు మృతదేహాన్ని తన చేతులతో స్మశాన వాటిక వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.