శ్రీలంక అంతటా కర్ఫ్యూ

వరుసల పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శ్రీలంక ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం సూచించింది. అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరింది. దేశమంతటా కర్ఫ్యూవిధించింది.10 రోజుల పాటు హై అలర్ట్​ ప్రకటించింది. మరిన్ని దాడులు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్​ వర్గాల హెచ్చరికల దృష్ట్యా అన్ని ప్రధాన నగరాల్లో, ప్రధాన చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అధ్యక్షుడు, ప్రధాని వంటి ప్రముఖుల నివాస ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టు సంస్థల లిస్టును బయటకు తీస్తూ విచారిస్తున్నారు. ప్రాథమికంగా నేషనల్ తోహిద్ జమాత్(ఎన్​టీజే)పై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆ సంస్థ కార్యకలాపాలపై దృష్టిపెట్టారు. ‘‘రక్షణ శాఖకార్యదర్శి, మిలిటరీ కమాండర్లు, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ తో నిరంతరం చర్చిస్తున్నాం. పరిస్థితులు కుదుటపడేవరకూ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాం. దేశంలో అలజడి సృష్టిస్తున్న టెర్రరిస్టు సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటాం. టెర్రరిస్టుల ఆటలు సాగనివ్వం. వారు ఏ మతం వారైనా విడిచిపెట్టం. వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రదాడులకు పాల్పడకుండా అడ్డుకుంటాం. దాడులకు పాల్పడిన వారిని త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటాం’’ అని శ్రీలంక రక్షణమంత్రి రువాన్ విజేవర్ధనే ప్రకటించారు. దేశంలోని స్కూళ్లకు సోమవారం, మంగళవారం రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

Latest Updates