కరీంనగర్ పోలింగ్ కు అంతా సిద్ధం

కరీంనగర్  నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. మూడు డివిజన్ల రిజర్వేషన్ల విషయంలో ఏర్పడిన గందరగోళంతో.. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నిక ఆలస్యమైంది. కరీంనగర్ లోని 60 డివిజన్లలో.. 2 ఏకగ్రీవం కాగా.. మిగతా 58 డివిజన్లలో రేపు ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు.

కరీంనగర్ కార్పోరేషన్ లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతున్న 58 డివిజన్లలో.. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2 లక్షల 72 వేల 195 మంది ఓటర్లున్నారు.   111 ప్రాంతాల్లో 348 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 మంది రిటర్నింగ్ అధికారులు, మరో 20 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు.. రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు పోలింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బందిని కేటాయించారు. 20, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా… మిగతా డివిజన్లలో పోలింగ్ జరగనుంది.

చాలా డివిజన్లలో ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటంతో.. హోరాహోరీ ప్రచారం చేశాయి పార్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో.. గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బూత్ లకు వచ్చే ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే.. ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. కొత్తపల్లిలో ఇద్దరు మహిళలు దొంగఓట్లు వేసేందుకు వచ్చి దొరికిపోవటంతో సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు అధికారులు. టెండర్ ఓటు వేసుకునే అవకాశం ఉండటంతో.. అప్రమత్తంగా ఉండేలా పోలింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు..  వెబ్ కాస్టింగ్ తో.. పరిస్థితిని సమీక్షించేలా అధికారులు ఏర్పాటు చేసారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పోలింగ్ కేంద్రాల దగ్గర గస్తీ ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు సీపీ కమాలాసన్ రెడ్డి. ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో.. నాన్ ఓటర్లు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ అమలుతో పాటు ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పోలింగ్ తర్వాత కరీంనగర్ SRR కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చనున్నారు. 27న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ఉంటుంది.

Latest Updates