బర్త్ డే వేడుకల్లో రిటైర్డ్ ఎస్సై కుమారుడు కత్తులతో వీరంగం

కరీంనగర్ పట్టణంలో ఓ రిటైర్డ్ SI కుమారుడి బర్త్ డే వేడుకలు వివాదాస్పదమయ్యాయి. పట్టణంలోని రాంనగర్ లో నిన్న రాత్రి.. ఓ రిటైర్డ్ SI కొడుకు లవన్ కుమార్ బర్త్ డే వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా.. రాంనగర్ వీధుల్లో డీజే పాటలతో అర్థరాత్రి వీరంగం సృష్టించారు లవన్ కుమార్ అతని ఫ్రెండ్స్. పట్టణంలో డీజేలపై నిషేధం ఉన్నా పట్టించుకోలేదు. కత్తులతో విన్యాసాలు చేశారు. అయితే.. ఈ వేడుకల్లో పాల్గొన్నవారిలో చాలామందిపై రౌడీ షీట్ లు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారికి సన్నిహితులైన రౌడీషీటర్లు.. అతని కొడుకు బర్త్ డేని గ్రాండ్ గా నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. అర్థరాత్రి రోడ్డుపై వీరంగంతో ఆందోళనకు గురైన స్థానికులు.. పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వేడుకల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రిటైర్డ్ SIని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ పట్టణంలో వివాదస్పదంగా మారిన రిటైర్డ్ SI కుమారుడి బర్త్ డే వేడుకలపై సీఐ దేవేందర్ రెడ్డి స్పందించారు. లవన్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంబంధిత వీడియో ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామన్న సీఐ..మిగతా వారిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Latest Updates