ప్రగతి భవన్​ గేటు నుంచే వెనక్కు పంపుతున్నరు

  • టీచర్స్​ ఎమ్మెల్సీ రఘోత్తమ్​రెడ్డి ఆవేదన
  • తప్పులు వెతికి ఉద్యోగులను సర్కార్​ భయపెడుతోందని ఆరోపణ

సదాశివనగర్​, వెలుగు: ఎమ్మెల్సీగా పాసున్నా తనను ప్రగతిభవన్​లోకి అనుమతించట్లేదని, గేటు దగ్గర్నుంచే తిప్పి పంపుతున్నారని కరీంనగర్​ టీచర్స్​ ఎమ్మెల్సీ రఘోత్తమ్​రెడ్డి వాపోయారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర్నుంచి తనను కేసీఆర్​ సర్కార్​ ప్రగతిభవన్​ గేటు దాటనివ్వడం లేదన్నారు. గత ప్రభుత్వాలు సామాన్యుల నుంచి సమస్యలపై వినతి పత్రాలు తీసుకునేవని, కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. పనుల కోసం వెళితే గేటు దగ్గరే ఆపుతున్నారన్నారు. తనకు ఎమ్మెల్సీగా ఐడెంటిటీ కార్డు, గన్​మెన్లు, వాహనం ఉన్నా గేటు దాటనివ్వడం లేదని ఆవేదన చెందారు. ‘‘గేటు దగ్గరకు వెళ్లగానే ఎవరు కావాలి.. ఏం పని అని అడుగుతున్నారు. ఆఫీసర్లెవరూ లేరు, మీకు అనుమతి లేదంటూ వెనక్కు తిప్పి పంపిస్తున్నారు. ఆఫీసర్లు వేరే పనిలో ఉన్నారు తర్వాత రమ్మంటున్నారు. ఇది ఒక ఎమ్మెల్సీకి జరుగుతున్న అన్యాయం” అని ఆయన వాపోయారు. ఈ మధ్య సర్కార్​ ఓ కొత్త మాట ఎత్తుకుందని, ఇదీ సమస్య అని చెబితే ‘డబ్బుల్లేవ్​’ అంటూ చేతులెత్తేస్తోందని రఘోత్తమ్​రెడ్డి విమర్శించారు. సకల జనుల సమ్మె చేసింది తెలంగాణ సర్కార్​ కోసమని, కానీ, నేటి సర్కార్​ జనం పీకలు పిసికి పాలు పోస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల తప్పులు వెతికి భయపెడుతోందన్నారు. సర్కార్​ బడిలో ఇంగ్లీష్​ మీడియానికి సర్కార్​ పర్మిషన్​ ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు. ప్రతీ స్కూల్​లో హెచ్​ఎంలు, టీచర్లతో విద్యా కమిటీ వేసి ఇంగ్లీష్​ మీడియంలో బోధించేలా తీర్మానం చేశామని, కానీ, ఆ క్రెడిట్​ ఉద్యోగ సంఘాలు, అధికారులకు పోతుందని సీఎం అడ్డుకున్నారని అన్నారు. ఇంగ్లీష్​ మీడియంకు పర్మిషన్​ ఇవ్వొద్దంటూ విద్యా శాఖ మంత్రి దగ్గర జీవోను నిలిపేశారని ఆరోపించారు. ఇప్పుడు తామే ఇంగ్లిష్​ మీడియం పెట్టామని క్రెడిట్​ కొట్టేసేందుకు సీఎం కేసీఆర్​ కసరత్తులు చేస్తున్నారన్నారు.

Karimnagar Teachers MLC Raghotham Reddy vows that not allowed to Pragathi Bhavan

Latest Updates