లాక్డౌన్ లో పేదలను ఆదుకునేందుకు ఏం అమ్మారో తెలుసా..

భూమి అమ్మి మరీ పేదలకు సాయం చేస్తున్న అన్నదమ్ములు

రూ. 25 లక్షలకు స్నేహితునికి రాసిచ్చిన అన్నదమ్ములు

ఎవరైనా తమ సొమ్ము ఒకరికి ఇవ్వాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, కర్ణాటకకు చెందిన ఇద్దరు అన్నాదమ్ములు మాత్రం తన భూమిని అమ్మి మరీ పేదలకు సాయం చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలని అనుకున్నారు కర్ణాటక కోలార్ జిల్లాకు చెందిన తాజమ్ముల్ పాషా మరియు ముజమ్మిల్ పాషా అనే ఇద్దరు వ్యాపారవేత్తలు. లాక్డౌన్ వల్ల కష్టాలు పడుతున్న వారికి సాయం చేయడం కోసం తమకు చెందిన భూమిని రూ .25 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో వారికి సాయం చేస్తున్నారు.

ప్రస్తుతం భూమి అమ్మాలంటే రిజిష్టర్ ఆఫీసులు మూతపడి ఉన్నాయి. దాంతో తమ స్నేహితుడికి బాండ్ పేపర్ పై భూమిని రాసి ఇచ్చి అతని దగ్గరి నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నట్లు ఆ అన్నదమ్ములు తెలిపారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత తమ స్నేహితుడి పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని వారు తెలిపారు.

పాషా సోదరులు ఇద్దరూ ప్రస్తుతం అరటి సాగు మరియు రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. వారు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ సమయంలో తాజమ్ముల్ కు ఐదు సంవత్సరాలు మరియు ముజమ్మిల్ కు మూడు సంవత్సరాలు. తల్లిదండ్రులు చనిపోవడంతో సోదరులిద్దరూ చిన్నతనంలోనే అమ్మమ్మ ఊరైన కొలార్‌కు వలస వచ్చారు.

‘మా తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. దాంతో మేం చిక్‌బాలాపూర్ నుంచి కోలార్‌లోని మా అమ్మమ్మ ఇంటికి వచ్చాం. అలా వచ్చినప్పుడు ఇక్కడి స్థానికులైన హిందువులు, సిక్కులు, ముస్లింలు ఎటువంటి పక్షపాతం లేకుండా మాకు సాయం చేశారు. అందుకే వారికి మేం సాయపడాలని నిర్ణయించుకున్నాం. లాక్డౌన్ వల్ల రోజువారీ కూలీలు, కార్మికులు మరియు వారి కుటుంబాలు బాధపడుతుండటం చూసి.. మా భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్నాం. అలా వచ్చిన డబ్బుతో పేద ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాన్ని కొనాలని నిర్ణయించుకున్నాం’ అని తాజమ్ముల్ పాషా తెలిపారు.

సోదరులిద్దరూ భూమిని అమ్మిన డబ్బుతో ధాన్యంతో పాటు నిత్యావసర సరుకులను కొన్నారు. తమ ఇంటి పక్కనే టెంట్ వేసి కూలీలు మరియు నిరాశ్రయులకు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆ ఇద్దరు సోదరులు 3 వేలకు పైగా కుటుంబాలకు ఆహార ధాన్యాలు, నూనె, చక్కెర మరియు ఇతర నిత్యావసరాలను సరఫరా చేశారు. అంతేకాకుండా హ్యాండ్ శానిటైజర్లు మరియు మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ జరగడానికి కోలార్ అధికారులు పాసులు జారీ చేశారు. దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజూ సరుకులు మరియు ఆహార పంపిణీ చేస్తున్నారు.

For More News..

లాక్డౌన్ లో హెయిర్ కటింగ్.. ఆరుగురికి సోకిన కరోనా

ఇంటికో కోడి.. 10 గుడ్లు

PM కిసాన్ కొత్త లిస్టు విడుదల.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..

సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Latest Updates