కర్నాటక క్లైమాక్స్​ నేడే

karnataka-assembly-drama-drags-on-speaker-says-kr-ramesh-kumar-trust-vote-by-6-pm-today
  • సాయంత్రంలోపు ప్రక్రియ ముగిస్తా: స్పీకర్​ రమేశ్

కర్నాటకలో కుమారస్వామి సర్కార్​ బలపరీక్షపై అసెంబ్లీ స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల్లోగా ఓటింగ్​ ప్రక్రియ పూర్తిచేస్తానని ప్రకటించారు. బలపరీక్ష విషయంలో తాను బలిపశువును కాదల్చుకోలేదన్న ఆయన, సోమవారమే ఏదోఒకటి తేల్చేస్తానని ప్రకటించారు. అయితే బలపరీక్ష వాయిదా కోరుతూ అధికార పక్షం ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాల్ని అడ్డుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అరుపులు, కేకల మధ్య రాత్రి 11:45 వరకు అసెంబ్లీ కొనసాగింది. చివరికి అధికార, ప్రతిపక్ష సభ్యుల సమ్మతితో స్పీకర్​ సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైపు  రాజీనామాలతో కూటమి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసిన రెబల్​ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​, జేడీఎస్​ నిర్ణయించుకున్నాయి. “పార్టీ విప్​ను అనుసరించి ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి హాజరుకావాలని స్పీకర్​ నోటీసులు జారీచేశారు”అని కాంగ్రెస్​ మంత్రి డీకే శివకుమార్​ మీడియాకు చెప్పారు. విప్​ జారీపై సుప్రీంకోర్టు ఎలాంటి నిబంధనలు విధించలేదని ఆయన గుర్తుచేశారు. ‘‘మా ఎమ్మెల్యేల్ని(రెబల్స్​ని) బీజేపీ లీడర్లు తప్పుదారిపట్టిస్తున్నారు. అసలు విప్​ జారీ కాదని, ఒకవేళ జారీ అయినా అది చెల్లదని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. ముంబైలో ఉన్న ఎమ్మెల్యేలంతా  స్పీకర్​ ఆదేశాలను అనుసరించి మంగళవారం ఉదయం సభకు రావాలి. లేకుంటే రాజ్యాంగ నియమాల ప్రకారం వాళ్లపై వేటేస్తాం. ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తాం”అని మంత్రి డీకే స్పష్టం చేశారు.

నా రాజీనామాపై ఫేక్​ ప్రచారం: సీఎం

బలపరీక్షపై సోమవారమే రూలింగ్​ ఇస్తానని స్పీకర్ రమేశ్​ కుమార్​​ పదే పదే ప్రకటించడంతో ఓటింగ్​కు ముందే సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. తన రాజీనామాపై వస్తున్నవన్నీ ఫేక్​ వార్తలని స్పీకర్​కు సీఎం చెప్పారు.  సుప్రీంకోర్టులో పిటిషన్లపై తీర్పు వచ్చాకే ఓటింగ్​ పెట్టాలని కాంగ్రెస్​, జేడీఎస్​ ఎమ్మెల్యేలు డిమాండ్‌‌ చేశారు.

Latest Updates