బలపరీక్ష ఇంకా జరగలేదు.. కర్నాటక డ్రామా వాయిదా

  • రాజ్ భవన్ డెడ్ లైన్లను లెక్కచేయని స్పీకర్
  • గవర్నర్ జోక్యం పై సుప్రీంను ఆశ్రయించిన సీఎం కుమారస్వామి
  • విప్ అధికారాలపై క్లారిటీ కావాలంటూ విడిగా కాంగ్రెస్
  • పిటిషన్ రెండోరోజూ ఓటింగ్ చేపట్టకపోవడంపై బీజేపీ నిరసన

కర్నాటకలో పొలిటికల్​ గేమ్ మరో మలుపుతిరిగింది.  సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయి వాలా విధించిన​ డెడ్​లైన్లను ధిక్కరిస్తూ.. స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​ అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డ సీఎం కుమారస్వామి.. దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెబల్​ ఎమ్మెల్యేలకు విప్​ నిబంధనలు వర్తిస్తాయో లేదో కోర్టే తేల్చాలంటూ కర్నాటక పీసీసీ చీఫ్ దినేశ్​ గుండూరావు విడిగా మరో పిటిషన్​ దాఖలు చేశారు. రాత్రంతా అసెంబ్లీలోనే ధర్నా చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. సమావేశాల రెండోరోజైన శుక్రవారం కూడా బలపరీక్షపై ఓటింగ్​ చేపట్టకుండానే సభను వాయిదా పడటంతో ప్రభుత్వంపై మండిపడ్డారు.

గవర్నర్​ లవ్​ లెటర్ల నుంచి కాపాడండి: సీఎం

బలపరీక్షపై రెండో రోజు చర్చను ప్రారంభించిన సీఎం కుమారస్వామి మరోసారి బీజేపీపై మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేకి రూ.50 కోట్లిచ్చి కొనుకున్నారని ఆరోపించారు. సీఎం కామెంట్స్​పై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత యడ్యూరప్ప.. గవర్నర్​ ఆదేశించినట్లు మధ్యాహ్నం 1:30లోగా ఓటింగ్​ చేపట్టాలని స్పీకర్​ను కోరారు. చర్చ పూర్తైన తర్వాతే ఓటింగ్​కు వెళ్తానని, ఈ విషయంలో కాంప్రమైజ్​ కాలేననన్న  స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. గడువు ముగియడంతో డెడ్​లైన్​ను సాయంత్రం 6:30కు పొడిగిస్తూ గవర్నర్​ వాజుభాయి వాలా సీఎంకు మరో లెటర్​ పంపారు.‘‘ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బెదిరింపులపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వెంటనే ఫ్లోర్​టెస్ట్​ నిర్వహించండి’’అని అందులో పేర్కొన్నారు. సభ మళ్లీ ప్రారంభం కాగానే సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్​ సందేశాలను ‘లవ్​ లెటర్స్​’గా అభివర్ణించిన కుమారస్వామి.. వాటి నుంచి తనను కాపాడే బాధ్యత స్పీకర్​పైనే ఉందన్నారు. ‘‘గవర్నర్​ పట్ల నాకు చాలా గౌరవముంది. కానీ ఆయన పంపిన రెండో లవ్​ లెటర్ నన్ను హర్ట్​ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించి గవర్నర్​కు ఇప్పుడే తెలిసిందా? ఢిల్లీ(కేంద్రం) డైరెక్షన్ ప్రకారం నడుచుకునే సమస్యేలేదు. ఫ్లోర్​ టెస్టు ఎప్పుడు చేపట్టాలన్నది మీరే(స్పీకరే) డిసైడ్​ చేయండి. గవర్నర్​గారి లవ్​ లెటర్ల నుంచి నన్ను కాపాడండి”అని కుమారస్వామి అన్నారు.

చర్చ పూర్తయ్యాకే ఓటింగ్​: స్పీకర్​

అసెంబ్లీని వాయిదా వెయ్యొద్దని, అవసరమైతే రాత్రి 12 గంటల వరకైనా సభ పొడిగించి ఓటింగ్​ చేపట్టాలన్న ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అభ్యర్థనను స్పీకర్​ రమేశ్ కుమార్​ తిరస్కరించారు. ‘‘సుప్రీంకోర్టుకు, ప్రజలకు, సభకు నిజానిజాలు తెలియాలి. చర్చ పూర్తైన తర్వాతే ఓటింగ్​కు అనుమతిస్తా. ఎవరో బెదిరించడం వల్లే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని గవర్నర్(లేఖలో) అంటున్నారు. అదేంటో తేలాలి. స్పీకర్​నైన నాక్కూడా  ఇప్పటిదాకా ఏ ఒక్క ఎమ్మెల్యే ఫిర్యాదు చెయ్యలేదు. నిజంగా అలాంటిది జరగనప్పుడు ఆ ఎమ్మెల్యేలు ప్రజల్ని మిస్​లీడ్​ చేసినట్లవుతుంది” అని స్పీకర్​ రమేశ్​ కుమార్​ అన్నారు.

మళ్లీ కోర్టుకు చేరిన పంచాయితీ

ఫ్లోర్​ టెస్టుపై వరుసగా డెడ్​లైన్లు విధిస్తున్న గవర్నర్​కు అసలు అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారాలు ఎంతవరకున్నాయో స్పష్టం చేయాలంటూ సీఎం కుమారస్వామి శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. 2015నాటి ఉత్తరాఖండ్ సంక్షోభం సమయంలో గవర్నర్​ పాత్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కుమారస్వామి ఉదహరించారు. రెబల్​ ఎమ్మెల్యేలపై జరిగిన విచారణలో కాంగ్సెస్​ పార్టీని కూడా చేర్చాలని కేపీసీసీ చీఫ్ దినేశ్​ గుండూరావు సుప్రీంకోర్టును కోరారు. ఈనెల 17 నాటి తీర్పుతో విప్​ అధికారాలపై అస్పష్టత ఏర్పడిందని, రెబల్​ ఎమ్మెల్యేలకు విప్​ వర్తిస్తుందో, లేదో క్లారిటీ ఇవ్వాలంటూ పిటిషన్​ వేశారు. ఈ రెండు పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.

Latest Updates