పది పరీక్షల్లో టాపర్ ఇంటిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

కర్ణాటక ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షల్లో 625 మార్కులకు 616 మార్కులను సాధించిన పేద విద్యార్థి మహేష్ ఇంటిని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ కుమార్ సందర్శించారు. మహేష్ ఇంటిని చూసి మంత్రి కన్నీటిపర్యంతమయ్యారు. చదువుకు ధనిక, పేద తేడాలేదని మరోసారి రుజువయిందని ఆయన అన్నారు. పరీక్షలకు వారం ముందు వరకు కూడా రోజూవారీ కూలిపనిచేసిన మహేష్.. ఇంత మంచి మార్కులు సాధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

స్థానిక జీవన్ బీమా నగర్ లోని కర్ణాటక ప్రభుత్వ పబ్లిక్ స్కూల్లో చదివే మహేష్ కనస్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ చదువుకునేవాడు. అతని తండ్రి గతంలోనే చనిపోయాడు. తల్లి పడే కష్టాన్ని చూడలేక మహేష్ కూడా పనికి వెళ్లేవాడు. అలా పనిచేస్తూనే.. మహేష్ ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. అతని గురించి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి సురేష్.. మహేష్ ను పాఠశాలకు పిలిపించి కలవాలనుకున్నాడు. కానీ.. మనసు మారి.. మహేష్ ఇంటికే వెళ్దామని అధికారులను కోరాడు. మంగళవారం ఉదయం స్థానిక అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మహేష్ ఇంటికి వెళ్లాడు. అక్కడ పరిస్థితిని చూసిన మంత్రి షాకయ్యాడు. ఇలాంటి వాతావరణంలో ఉంటూ.. ఉత్తమ మార్కులు ఎలా సాధించాడని విస్మయానికి గురయ్యాడు. మహేష్ ఉండే ఇల్లు చిన్న గుడిసే. ఆ గుడిసేలో మహేష్ తన తల్లి మరియు సోదరులతో ఉంటున్నాడు. అక్కడ అలాంటి గుడిసేలు మరో 30 వరకు ఉన్నాయి. మంత్రి సురేష్ అధికారులతో పాటు మహేష్ ఇంట్లోకి వెళ్లి.. అక్కడే కూర్చొని.. అతని తల్లితో మాట్లాడాడు. మహేష్ కు నగదు బహుమతితో పాటు.. పై చదువులకు కావలసిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చాడు. మహేష్ పరిస్థితి చూసి మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ విషయంపై మహేష్ మాట్లాడుతూ.. ‘నేను నా మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మంత్రిని దూరం నుంచి చూశాను. ఆ రోజు ఆయన మా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు. ఇప్పడు ఆయనే స్వయంగా మా ఇంటికి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. విద్యా మంత్రి మా ఇంటికి వస్తారని కలలో కూడా అనుకోలేదు. మంత్రి నాకు మూద్‌బిద్రిలోని అల్వా కాలేజీలో ఉచితంగా చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చారు. నాకిష్టమైన సైన్స్ గ్రూపును చదువుతాను. నా విజయానికి మా స్కూల్ ప్రిన్పిపాల్ ఎంతో సహాయం చేశారు. పై చదువులు చదివి టీచర్ కావాలన్నదే నా కోరిక’ అని తెలిపాడు.

For More News..

సింగర్ బాలు కోసం సాయంత్రం 6 గంటలకు ‘యూనివర్సల్ మాస్ ప్రేయర్’

మళ్లీ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ట్రంప్ ఒక రాంగ్ ప్రెసిడెంట్

Latest Updates