వరదల్లో 2.5 కి.మీ ఈదిండు..బాక్సింగ్ లో సిల్వర్ పట్టిండు

  • వరదలో రెండున్నర కిలోమీటర్లు ఈదిండు..
  • బాక్సింగ్​లో సిల్వర్​ పట్టిండు
ఆగస్టు ఏడో తేదీ. కుండపోత వర్షాలకు ఊళ్లన్నీ మునిగిపోయాయి. ఇళ్ల చుట్టూ నీళ్లే. మనిషి మునిగిపోయేటంత వరద. అదే ఆ యువకుడిని చాలా భయపెట్టింది. కారణం, బెంగళూరులో బాక్సింగ్​ రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకు అతడు పోవాలి. బస్సుల్లేవ్​, ఆటోలు బంద్​, నడవడానికీ అదును లేదు. మరెట్ల? సాహసం చేయాలి. ఈదుకుంట పోవాలి. ఇదే ఆ యువకుడి బుర్రకు తట్టింది.  తండ్రితో కలిసి 2.5 కిలోమీటర్లు 45 నిమిషాల పాటు ఈదుకుంటెళ్లి మెయిన్​రోడ్డు మీద ఎదురు చూస్తున్న జిల్లా టీంను అందుకున్నాడు. రైలెక్కి బెంగళూరు పోయాడు. మూడు రోజులు తిరిగేసరికి  వెండి పతకం సాధించాడు. ఇదీ, కర్ణాటకలోని బెలగావి జిల్లా మన్నూర్​ అనే ఊరికి చెందిన నిషాన్​ మనోహర్​ కదమ్​ సాహసయాత్రా గెలుపు. మామూలుగైతే ఓ ఐదారు నిమిషాల పాటు ఈదగానే మనం అలిసిపోతం. కానీ, అదేదీ లెక్క చేయలేదు నిషాన్​, అతడి తండ్రి. బాక్సింగ్​ సామాన్లన్నింటినీ మంచిగ ప్లాస్టిక్​ కవర్​లో మూటకట్టి, వీపుకు తగిలించుకుని ఈదుకుంటూ వెళ్లారు. నిషాన్​ కల తీరింది. సిల్వర్​ మెడల్​ వరించింది.

‘‘ఈ పోటీల కోసం చాలా ఎదురు చూశా. కానీ, వరదలు నా కలల్ని సమాధి చేస్తాయని భయపడ్డా. బస్సులు, ఆటోలేవీ నడవలేదు. ఆ టైంలో నాకు తోచింది ఈదడమే. అందుకే కష్టమైనా లెక్క చేయకుండా వెళ్లా. ఇప్పుడు గోల్డ్​ మిస్సయినా, వచ్చే ఏడాది కచ్చితంగా  సాధిస్తా” అని నిషాన్​ చెప్పాడు. ఇప్పుడతడిని అందరూ మెచ్చుకుంటున్నారు. అంత కష్టపడి వచ్చినందుకు అభినందిస్తున్నరు. ఈదుకుంటూ వస్తానని చెప్పడంతో, హైవే దగ్గర మేం ఎదురుచూశామని జిల్లా టీమ్​ మేనేజర్​ గజేంద్ర ఎస్​ త్రిపాఠి చెప్పాడు. కాగా, ఈ పోటీల్లో 19 టీమ్​ల నుంచి 248 మంది ఆరు కేటగిరీల్లో పోటీపడ్డారు. ఆదివారంతో పోటీలు ముగిశాయి. లైట్​ఫ్లై వెయిట్​ కేటగిరీలో నిషాన్​ పోటీ పడ్డాడు. ఫైనల్లో నిషాన్​పై బెంగళూరుకు చెందిన భరత్​ గెలిచాడు. కాగా, ఎంజీ స్పోర్టింగ్​ అకాడమీలో అర్జున అవార్డ్​ గ్రహీత కెప్టెన్​ ముకుంద్​ కిల్లేకర్​ కోచింగ్​లో నిషాన్​ రాటుదేలాడు. బెలగావిలోని జ్యోతి పీయూ కాలేజ్​లో ఇంటర్​ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Latest Updates