ఎవరి బలం ఏంటో రేపు తెలుస్తుంది : యాడ్యురప్ప

అందరి చూపు కర్ణాటకవైపే. నెల రోజుల సస్పెన్స్ కు సోమవారం ఫుల్ స్టాప్ పడనున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత యాడ్యురప్ప మాట్లాడుతూ..అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టే విశ్వాస పరీక్షలో ఎవరి బలం ఏంటో సోమవారం తేలుతుందన్నారు. ‘‘ఓటింగ్‌పై ఎమ్మెల్యేలను బలవంతం చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడి చేయవద్దు. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌కు విలువ లేదు. ప్రజాస్వామ్యానికి కుమారస్వామి ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది. గవర్నర్‌ సూచనలను సీఎం కుమారస్వామి లెక్కచేయడం లేదు. అన్నింటికీ రేపు అసెంబ్లీలో సమాధానం దొరుకుతుంది’’ అని యడ్యూరప్ప అన్నారు.

విశ్వాస పరీక్షలో నెగ్గడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు రెబల్‌ ఎమ్మెల్యేలు సైతం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు దేవెగౌడ సైతం ముమ్మర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates