స్పీకర్ రెండు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు : రోహత్గీ

కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీం కోర్టు యదాతథ స్థితి కంటిన్యూ చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కు మంగళవారం వరకు టైం ఇచ్చింది. మళ్లీ 16న ఎమ్మెల్యేల రాజీనామాలపై విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. కర్ణాటక పరిణామాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. సుప్రీం కోర్టునే స్పీకర్ ఛాలెంజ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్. స్పీకర్ చర్యలను ప్రశ్నించారు. తమ రాజీనామాలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రెబెల్ ఎమ్మెల్యేల తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

స్పీకర్ రెండు గుర్రాలపై స్వారీ చేస్తున్నారంటూ ముకుల్ రోహత్గీ అన్నారు. రాజీనామాలపై స్టడీ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ స్పీకర్ చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజీనామాలు ఆమోదించకుండా వారిపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని వాదించారు. అనర్హత వేటు లేకుండా తప్పించుకునేందుకే ఎమ్మెల్యేలు రాజీనామా ఇచ్చారని స్పీకర్ తరపున సింఘ్వి వాదనలు వినిపించారు. నిర్ణీత సమయంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదని సింఘ్వి అన్నారు. మరో సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ కర్ణాటక సీఎం కుమార స్వామి తరపున వాదనలు వినిపించారు. ఈ రాజీనామాల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఏ ప్రాతిపదికన పిటిషన్ వేశారని రెబెల్ ఎమ్మెల్యేల తీరును ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాలపై స్పీకర్ విచారణ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

Latest Updates