రైతును కోటీశ్వరుడ్ని చేసిన ఉల్లి

అప్పుల నుంచి భారీ లాభాల్లోకి కర్ణాటక రైతు

240 టన్నుల దిగుబడి.. క్వింటాల్​కు రూ.12 వేలు

సక్సెస్​ రావాలంటే రిస్క్​ చేయాలంటారు. ఆ రిస్క్​ తెస్తే సక్సెస్​నైనా తెస్తుంది.. లేదంటే అనుభవాన్ని మిగుల్చుతుంది. ఓ రైతు అలాంటి రిస్కే చేశాడు. భయపడుతూనే ముందడుగు వేశాడు. సక్సెస్​ రుచి చూసి అప్పుల నుంచి కోటీశ్వరుడిగా ఎదిగాడు. అతడు చేసిన రిస్క్​ ఉల్లి పంట వేయడమేనట. ఇప్పుడు ఉల్లి ధరలు మామూలు మనిషికి కన్నీళ్లు తెప్పిస్తుండొచ్చు గానీ, ఆ రైతు దశనే మార్చేసింది మరి. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న చందంగా మొన్నటిదాకా అప్పుల్లో ఉన్న అతడిని ఒక్క నెలలో, ఒక్కటంటే ఒక్క నెలలో కోటీశ్వరుడిని చేసింది. ఎవరా రైతు? ఎక్కడుంటాడు? అసలు అన్ని పైసలు ఎట్లొచ్చాయి? ఓ లుక్కేయండి మరి.

అప్పు తెచ్చి పంటేశాడు

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న దొడ్డసిద్దవానహళ్లికి చెందిన రైతు మల్లికార్జునను ఆ అదృష్టం వరించింది. తనకు పది ఎకరాల పొలం ఉంది. దానికి తోడు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి పంట వేశాడు. బ్యాంకు లోను, ఇతరత్రా మార్గాల్లో రూ.15 లక్షలు తెచ్చి ఉల్లి విత్తనం నాటాడు. తన జీవితంలో చేసిన అతి పెద్ద రిస్క్​ ఇదేనంటాడు మల్లికార్జున. అసలే రాష్ట్రంలో కరువుతో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. అలాంటి టైంలో రిస్క్​ చేసి వేసిన పంట అకాల వర్షాలతో నష్టపోయినా, మార్కెట్లో రేటు పడిపోయినా భారీ అప్పుల్లో కూరుకుపోయేవాడినంటాడు. ఒకవేళ పంట బాగా చేతికొస్తే పెట్టుబడిపోనూ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మిగులుతుందనుకున్నాడు. కానీ, ఊహించిన దాని కన్నా ఎక్కువే మిగుల్చుకున్నాడు.

లైఫ్ను మార్చేసిన రేటు

అతడి లైఫ్​ ఆ రిస్క్​తోనే టర్న్​ అయింది. అంతా బాగుండడం, కాలం కలిసి రావడంతో 240 టన్నుల (2400 క్వింటాళ్లు– 20 లారీల లోడ్లు) పంట చేతికొచ్చింది. అతడు పంట వేసినప్పుడు క్వింటాల్​ ఉల్లి ధర పలికింది కేవలం రూ.7 వేలు. కానీ, పంట మొత్తం చేతికొచ్చే టైంకు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఉల్లి రేటు కొండెక్కింది. అక్కడి మార్కెట్​లో క్వింటాల్​కు రూ.12 వేలు పలికింది. పంటను అమ్మిన అతడికి దాదాపు రూ.2 కోట్ల 88 లక్షలు వచ్చాయి. అప్పులు పోను కొండంత లాభం మిగిలింది. పోయిన సంవత్సరం ఐదు లక్షల లాభమే చూసిన మల్లికార్జున, ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. పంట చేతికొచ్చాక దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు అనునిత్యం కాపలా ఉన్నారట అతడు, అతడి భార్య. ఇప్పుడొచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేసి, ఇల్లు కట్టుకుంటానని, మరి కొంత పొలం కొంటానని మల్లికార్జున ఆనందంగా చెబుతున్నాడు. అంతే మరి, ఎవరి లక్కు ఎప్పుడు, ఎలా తిరుగుతుందో ఎవరు మాత్రం ఊహించగలరు!!
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates