సుప్రీం వర్సెస్ స్పీకర్​ ​ : కోర్టుకు చేరిన కర్నాటక రాజకీయం

ఎమ్మెల్యేల రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న సీజేఐ బెంచ్

అలా కుదరదు, టైమ్​ కావాలన్న స్పీకర్​ రమేశ్​ కుమార్

బెంగళూరుకొచ్చి రెండోసారి లెటర్లిచ్చిన 10 మంది రెబల్స్

ఇవాళ మళ్లీ విచారించనున్న కోర్టు

రిజైన్​ చేసే ప్రశ్నేలేదు.. బలపరీక్షకు రెడీ: సీఎం కుమారస్వామి

బెంగళూరు/న్యూఢిల్లీ: ఆరు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న కన్నడ పొలిటికల్​ పంచాయితీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం ఉదయం ఢిల్లీలో, ఆ తర్వాత బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  కర్నాటక కేసును ఎమర్జెన్సీగా విచారించిన సీజేఐ బెంచ్,​ అంతే వేగంగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్​ను ఆదేశించింది. రాజ్యాంగ పదవిలో ఉన్న తాను.. కోర్టు చెప్పినట్లు నడుచుకోలేననిస్పీకర్ ధిక్కారస్వరం వినిపిండంతో వ్యవహారం మరింత సంక్లిష్టమైంది. కర్నాటక కేసులు శుక్రవారం కూడా విచారణకు రానున్ననేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్​ను ఆదేశించాలంటూ 10 మంది రెబల్స్​ దాఖలు చేసిన పిటిషన్​ను సీజేఐ రంజన్​ గొగోయ్ బెంచ్ గురువారం ఉదయం ఎమర్జెన్సీగా విచారించింది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడానికంటే ముందే తమపై అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నామని కోర్టుకు రెబల్స్ తెలిపారు. వాదన ముగిసిన వెంటనే ఆదేశాలిచ్చిన సీజేఐ బెంచ్​..  స్పీకర్​ నిర్ణయాన్ని బట్టి శుక్రవారం విచారణ కొనసాగిస్తామని తెలిపింది.

దీనిపై  కొంత గడువు కావాలంటూ కర్నాటక స్పీకర్​ పిటిషన్​ వేయగా, దాన్ని స్వీకరించేందుకు బెంచ్​ నిరాకరించింది. కోర్టు అనుమతితో 10 రెబల్​ ఎమ్మెల్యేలు ముంబై నుంచి బెంగళూరుకొచ్చి సాయంత్రం 6 గంటలకు మరోసారి రాజీనామాలు సమర్పించి తిరిగి ముంబై పయనమయ్యారు. కర్నాటక, గోవాల్లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ చంపేస్తోందంటూ పార్లమెంటు కాంప్లెక్స్​లో కాంగ్రెస్​ ఎంపీలు నిరసన చేపట్టారు.

అదంతా వీడియో తీశాం: స్పీకర్​

గురువారం నాటి పరిణామాలపై స్పీకర్​ రమేశ్​ కుమార్​ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పుట్టినగడ్డను ప్రేమించే వ్యక్తిగా కర్నాటక భవిష్యత్తును డిసైడ్​ చేసే నిర్ణయాల్ని తేలికగా తీసుకోలేనని, అసలు కోర్టు ఉద్దేశమేంటో తనకు అర్థం కాలేదని అన్నారు. ‘‘రెండోసారి ఇచ్చిన లెటర్లన్నీ ఫార్మాట్​లోనే ఉన్నాయి. వెంటనే ఆమోదించాలని వాళ్లు కోరారు. రాజీనామాలు జెన్యూనో కాదో పరిశీలించకుండా ఆ పని చేయలేనని చెప్పాను. ఎమ్మెల్యేలతో సంభాషణ మొత్తాన్ని వీడియోలో రికార్డు చేశాం. ఆఫుటేజీని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​కు పంపుతాం. ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నన్ను ఆదేశించింది. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఆ మాట ఎందుకన్నారో, మూడ్రోజులకే ఇంత హడావుడిగా ఆదేశాలివ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. యస్​, నేను పుట్టిన గడ్డను ప్రేమిస్తాను కాబట్టే, ఇక్కడ అన్నీ బాగుండాలని కోరుకుంటాను.  బాధ్యతగల స్పీకర్​గా అడ్డగోలు వ్యవహారాలను నేను అస్సలు ప్రోత్సహించను.

కర్నాటక అసెంబ్లీ రూల్స్​, రాజ్యాంగం నిర్దేశించినట్లే నడుచుకుంటాను. ఎక్కడ రాజీనామాలు ఆమోదించాల్సి వస్తుందోనని ఆఫీసు నుంచి నేను పారిపోయానంటూ ​ కోర్టుకు రెబల్స్ చెప్పడం నిజంగా దారుణం. ఆరోజు(జులై 6వ తేదీన) వాళ్లొస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదు. మధ్యాహ్నం తర్వాతే ఆఫీసు నుంచి బయటికెళ్లాను. వాళ్లు నా కార్యాలయానికి రాకుండా నేనెప్పుడూ అడ్డుకోలేదు. నన్ను కలుసుకోడానికి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారో  తెలియదు”అని స్పీకర్​ రమేశ్​ కుమార్​ వివరించారు. 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్​– జేడీఎస్​ ప్రభుత్వానికి 116 మంది సభ్యుల బలముంది. ప్రస్తుతానికి 16 మంది రెబల్స్​ రాజీనామాలు స్పీకర్​ వద్ద పెండింగ్​లో ఉన్నాయి. రాజీనామాలు ఆమోదం పొందితే సర్కార్​ కూలిపోతుందన్న బీజేపీ.. తన105 మంది ఎమ్మెల్యేలు,  ఇండిపెండెంట్లు, బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది.

Latest Updates