ఎమ్మెల్యేల రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న సీజేఐ బెంచ్
అలా కుదరదు, టైమ్ కావాలన్న స్పీకర్ రమేశ్ కుమార్
బెంగళూరుకొచ్చి రెండోసారి లెటర్లిచ్చిన 10 మంది రెబల్స్
ఇవాళ మళ్లీ విచారించనున్న కోర్టు
రిజైన్ చేసే ప్రశ్నేలేదు.. బలపరీక్షకు రెడీ: సీఎం కుమారస్వామి
బెంగళూరు/న్యూఢిల్లీ: ఆరు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న కన్నడ పొలిటికల్ పంచాయితీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం ఉదయం ఢిల్లీలో, ఆ తర్వాత బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్నాటక కేసును ఎమర్జెన్సీగా విచారించిన సీజేఐ బెంచ్, అంతే వేగంగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. రాజ్యాంగ పదవిలో ఉన్న తాను.. కోర్టు చెప్పినట్లు నడుచుకోలేననిస్పీకర్ ధిక్కారస్వరం వినిపిండంతో వ్యవహారం మరింత సంక్లిష్టమైంది. కర్నాటక కేసులు శుక్రవారం కూడా విచారణకు రానున్ననేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ 10 మంది రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ రంజన్ గొగోయ్ బెంచ్ గురువారం ఉదయం ఎమర్జెన్సీగా విచారించింది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడానికంటే ముందే తమపై అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నామని కోర్టుకు రెబల్స్ తెలిపారు. వాదన ముగిసిన వెంటనే ఆదేశాలిచ్చిన సీజేఐ బెంచ్.. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి శుక్రవారం విచారణ కొనసాగిస్తామని తెలిపింది.
దీనిపై కొంత గడువు కావాలంటూ కర్నాటక స్పీకర్ పిటిషన్ వేయగా, దాన్ని స్వీకరించేందుకు బెంచ్ నిరాకరించింది. కోర్టు అనుమతితో 10 రెబల్ ఎమ్మెల్యేలు ముంబై నుంచి బెంగళూరుకొచ్చి సాయంత్రం 6 గంటలకు మరోసారి రాజీనామాలు సమర్పించి తిరిగి ముంబై పయనమయ్యారు. కర్నాటక, గోవాల్లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ చంపేస్తోందంటూ పార్లమెంటు కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు.
అదంతా వీడియో తీశాం: స్పీకర్
గురువారం నాటి పరిణామాలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పుట్టినగడ్డను ప్రేమించే వ్యక్తిగా కర్నాటక భవిష్యత్తును డిసైడ్ చేసే నిర్ణయాల్ని తేలికగా తీసుకోలేనని, అసలు కోర్టు ఉద్దేశమేంటో తనకు అర్థం కాలేదని అన్నారు. ‘‘రెండోసారి ఇచ్చిన లెటర్లన్నీ ఫార్మాట్లోనే ఉన్నాయి. వెంటనే ఆమోదించాలని వాళ్లు కోరారు. రాజీనామాలు జెన్యూనో కాదో పరిశీలించకుండా ఆ పని చేయలేనని చెప్పాను. ఎమ్మెల్యేలతో సంభాషణ మొత్తాన్ని వీడియోలో రికార్డు చేశాం. ఆఫుటేజీని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు పంపుతాం. ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నన్ను ఆదేశించింది. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఆ మాట ఎందుకన్నారో, మూడ్రోజులకే ఇంత హడావుడిగా ఆదేశాలివ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. యస్, నేను పుట్టిన గడ్డను ప్రేమిస్తాను కాబట్టే, ఇక్కడ అన్నీ బాగుండాలని కోరుకుంటాను. బాధ్యతగల స్పీకర్‌గా అడ్డగోలు వ్యవహారాలను నేను అస్సలు ప్రోత్సహించను.
కర్నాటక అసెంబ్లీ రూల్స్, రాజ్యాంగం నిర్దేశించినట్లే నడుచుకుంటాను. ఎక్కడ రాజీనామాలు ఆమోదించాల్సి వస్తుందోనని ఆఫీసు నుంచి నేను పారిపోయానంటూ కోర్టుకు రెబల్స్ చెప్పడం నిజంగా దారుణం. ఆరోజు(జులై 6వ తేదీన) వాళ్లొస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదు. మధ్యాహ్నం తర్వాతే ఆఫీసు నుంచి బయటికెళ్లాను. వాళ్లు నా కార్యాలయానికి రాకుండా నేనెప్పుడూ అడ్డుకోలేదు. నన్ను కలుసుకోడానికి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారో తెలియదు”అని స్పీకర్ రమేశ్ కుమార్ వివరించారు. 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్– జేడీఎస్ ప్రభుత్వానికి 116 మంది సభ్యుల బలముంది. ప్రస్తుతానికి 16 మంది రెబల్స్ రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాజీనామాలు ఆమోదం పొందితే సర్కార్ కూలిపోతుందన్న బీజేపీ.. తన105 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు, బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది.